క్యాన్సర్ రోగులకు విజయవంతంగా చికిత్సలు నిర్వహిస్తున్న భారతీయ సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్ వైద్యులు భారతదేశం గురించి ఒక హెచ్చరిక జారీ చేశారు. దేశంలో తక్షణ చర్యలు తీసుకోకపోతే త్వరలోనే భారతదేశం ‘క్యాన్సర్ సునామీ’లో చిక్కుకుంటుందని డాక్టర్ దత్తాత్రేయుడు నోరి, డాక్టర్ రేఖ భండారి హెచ్చరించారు. ప్రముఖ క్యాన్సర్ పాథాలజిస్ట్ డాక్టర్ దత్తాత్రేయుడు నోరి…. ఈ వ్యాధితో బాధపడుతున్న అనేక మంది భారతీయులకు చికిత్స చేశారు. ప్రారంభ దశలోనే వ్యాధిని గుర్తించడం ద్వారా మాత్రమే భారతదేశం ‘క్యాన్సర్ సునామి’లో చిక్కుకోకుండా నిరోధించవచ్చని వారిద్దరూ తెలిపారు.
భారతదేశంలో ప్రతిరోజూ 1,300 మంది క్యాన్సర్‌తో మరణిస్తున్నారని నోరి తెలిపారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో సుమారు 1.2 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు వస్తున్నాయన్నారు. కాగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ తాజాగా 2030 నాటికి భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.7 మిలియన్ల కొత్త క్యాన్సర్ కేసులు సంభవిస్తాయని అంచనా వేసింది. భారత్ లో కాన్సర్ నివారణకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే క్యాన్సర్ సునామీ సంభవిస్తుందని డాక్టర్ నోరి హెచ్చరించారు. భారతదేశంలో ప్రజారోగ్య సంరక్షణకు ఇది పెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.