Doctor stays back in Ukraine with pet leopard, black panther : యుద్ధంలోనూ బతకవచ్చని ఈ డాక్టర్ నిరూపించాడు. యుద్ధానికి దూరంగా ఉన్న ప్రాంతాలను ఎంచుకొని తనతోపాటు చిరుత పిల్లలను పెంచి పోషిస్తున్నాడు. చాలా మంది పెద్ద నగరాల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోతుంటే.. ఈ తెలుగు డాక్టర్ మాత్రం ఉక్రెయిన్ రాజధానికి సూదూరంగా ఉన్న చిన్న ప్రాంతంలో ఉండి అక్కడే సంతోషంగా గడుపుతున్నాడు. ఈ తెలుగు డాక్టర్ ధైర్యానికి..చేస్తున్న పనికి నిజంగానే అందరూ మెచ్చుకోవాల్సిందే.. ఉక్రెయిన్ లో యుద్ధం కారణంగా ఎంతో మంది భారతీయ విద్యార్థులు బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ దేశం నుంచి అతికష్టం మీద దాటి వచ్చేస్తున్నారు. కాలినడకన, వాహనాలు, రైళ్లలో భిక్కుభిక్కుమంటూ వస్తున్నారు. నగరాల్లోని బంకర్లలో తలదాచుకుంటూ మధ్యలో బయటకు వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు.

ప్రస్తుతం ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబుల మోత మోగిస్తోంది. కానీ ఉక్రెయిన్ లోనే ఉంటున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన డాక్టర్ కుమార్ బండి మాత్రం మన దేశానికి తిరిగి రాలేదు. ధైర్యంగానే ఆ బాంబుల మోత మధ్యే ఉంటున్నాడు.
ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తనుకుకు చెందిన కుమార్ బండి ఉక్రెయిన్ లో డాక్టర్ గా పనిచేస్తున్నారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించడంతో ఆయన ఆ దేశం నుంచి భారతదేశానికి రాకుండా అక్కడే ఉండిపోయాడు. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ తోపాటు ప్రధాన నగరాల్లో కాకుండా దూరంగా వెళ్లిపోయాడు. రాజధాని కీవ్ కు ఏకంగా 850 కి.మీల దూరంలోని డొన్ బస్ అనే ప్రాంతంలోని ఇంట్లో బంకర్ లో తలదాచుకున్నాడు.
ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి పారిపోవడం కంటే.. ఆ ఇబ్బందులు పడే కంటే ఆ దేశంలోనే యుద్ధ ప్రాంతాలకు వ్యతిరేకంగా బంకర్లలో తలదాచుకోవడం మేలు అని ఈ డాక్టర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇక తన ప్రియమైన రెండు చిన్న చిరుత పిల్లలతో కలిసి అక్కడే జీవిస్తున్నాడు. తాజాగా తన చిరుత పిల్లలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసి పంచుకున్నాడు అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డాక్టర్ కుమార్ వైద్య వృత్తితోపాటు యూట్యూబర్ గానూ చేస్తున్నాడు. పలు వీడియోలను రూపొందించి విడుదల చేస్తుంటారు. చిరుత పిల్లలను పెంచుకుంటూ వాటితో వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. అవి వైరల్ అయ్యాయి.
ఇక తాను ఉక్రెయిన్ ను విడిచి భారత్ కు వెళ్లకపోవడానికి తను పెంచుకుంటున్న రెండు చిరుత పులి పిల్లలే కారణమని.. నేను వెళ్లిపోతే వాటిని చూసుకునే వారే ఉండరని.. అందుకే యుద్ధ ప్రాంతాలకు దూరంగా డొన్ బస్ లో ఉంటున్నానని కుమార్ బండి తెలిపారు. చిరుత పిల్లలతో ఉంటుంటే నాకు బోర్ కొట్టడం లేదని.. ఒంటరిగా ఉన్న ఫీలింగ్ కలగడం లేదని వివరించారు.
ఎంతో మంది భారతీయ విద్యార్థులు యుద్ధం జరుగుతున్న నగరాల్లో భిక్కుభిక్కుమంటూ ఉంటున్నారు. ఇలా డాక్టర్ కుమార్ బండిలా యుద్ధం తీవ్రత లేని సుదూర గ్రామాలు, పట్టణాలకు వెళ్లి తలదాచుకుంటే వారికి ప్రాణభయం ఉండదు. ఆ దిశగా అక్కడ చిక్కుకుపోయిన వారు ఆలోచిస్తే వారి బతుకుకు భరోసా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.