PM Modi- Mudhol Hound Dogs: శునకం అంటేనే విశ్వాసానికి మారుపేరు. పూర్వకాలం నుంచి శునకాలకు, మనుషులకు అవినాభావ సంబంధం ఉంది. రాజులు యుద్ధాల సమయంలో ప్రత్యర్థుల మీదకి ఈ శునకాలనే పంపేవారు. ఒకప్పుడు దేశీయ శునకాలు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి కొత్త కొత్త రకాలను అభివృద్ధి చేశారు. ఇక పోలీసు విభాగంలో శునకాలు కీలక పాత్ర పోషిస్తాయి. కేసులను ఛేదించడంలో ఎంతో ఉపయోగపడతాయి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భద్రతా దళంలో ఇప్పుడు తొలిసారిగా దేశ వాలీ ముధోల్ జాతికి చెందిన శునకాన్ని ఉపయోగిస్తున్నారు. చూసేందుకు సన్నగా, పొడవుగా ఉండే ఈ శునకాన్ని నరేంద్ర మోడీ భద్రతా విభాగంలో చేర్చారు. ముధోల్ హౌండ్ జాతి శునకాలు చాలా తెలివైనవి. ఇవి ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, అనేక భద్రతా దళాలలో చేస్తున్నాయి. కానీ ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్.. ఈ శునకాలను ప్రధానమంత్రి భద్రత కోసం తన స్క్వాడ్లో చేర్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ విషయాన్ని మన్ కీ బాత్ లో చర్చించారు.

ఈ శునకాల ప్రత్యేకతే వేరు
కర్ణాటక రాష్ట్రంలోని భాగల్కోట్ జిల్లా ముధోల్ ప్రాంతానికి చెందిన ఈ శునకాల ప్రత్యేకత వేరు. ఎంతో శక్తి సామర్థ్యాలు వీటి సొంతం. దేశ సరిహద్దులలో పహారా కాస్తుంటాయి. నేరస్తుల జాడను సునాయాసంగా పట్టుకుంటాయి. ఈ శునకాల సామర్ధ్యం అన్ని వర్గాలను ఆకర్షిస్తున్నది. దేశ సరిహద్దుల్లో పహారా, నేరస్తులను పట్టుకోవడం, తదితర అన్ని పనుల్లో ఈ జాగిలాలను చేర్చుకుంటున్నారు. గతంలో ఆర్మీతో పాటు ఇటీవల భారత వాయుసేన నాలుగు శునకాలను భద్రతా సేవలకు స్వీకరించింది.
Also Read: AP Cabinet: మంత్రులకు జగన్ క్లాస్.. ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలివీ!
వైమానిక దళ స్థావరాల్లో విమానాల రాకపోకలకు అడ్డుపడుతున్న పక్షులు, ఇతర ప్రాణులను తరిమేందుకు ముధోల్ జాతి శునకాలను వినియోగిస్తారు. అందుకే వీటిని ఆర్మీ, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐ టి బిపి, వివిధ రాష్ట్రాల్లోని పోలీస్ శాఖలో ఉపయోగించుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2020లో తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రంలో ప్రత్యేక జాతిగా పరిగణిస్తున్న ముధోల్ హౌండ్ గురించి ప్రస్తావించారు. దీంతోపాటు 2018 సంవత్సరంలో ఒక ర్యాలీలో వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. అప్పటినుంచి ఈ శునకాలకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ శునకాలు నేరాలను గుర్తించడంలో దిట్ట. అంతేకాకుండా వేగంగా పరిగెత్తడం వీటి ప్రత్యేకత. మొదటిసారిగా ముధోల్ జాతిని బిఎస్ఎఫ్, స్పెషల్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్, బందిపూర్ అటవీ శాఖలో చేర్చారు. అంతకుముందు వివిధ రాష్ట్రాల్లోని ఇండియన్ ఆర్మీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, పోలీస్ స్క్వాడ్ లలో ఇవి పనిచేశాయి.

వీటినే ఎందుకు తీసుకుంటున్నారంటే..
ఈ శునకాలు వేట, నేరాలను గుర్తించడంలో ప్రసిద్ధి చెందాయి. ముధోల్ హౌండ్ అనే పేరు దాని పూర్వపు ముధోల్ రాజ్యం ప్రస్తుత బాగల్ కోట్ నుంచి వచ్చిందని చెబుతారు. ఈ శునకాలు చాలా సన్నగా ఉంటాయి. నడుము భాగం పొడవుగా ఉంటుంది. తల చిన్నగా ఉండి చెవులు కిందకి వాలి ఉంటాయి. కళ్ళు ఎర్రగా వేటకు వెళ్లే పులి మాదిరి కనిపిస్తుంటాయి. ఈ శునకాలు పులి తో సమానంగా పరిగెత్తుతాయి. ఇవి చాలా తెలివైనవి కూడా. వాసన ద్వారానే నేరాలను, నేరస్తులను పసిగడతాయి. మొదట డెక్కన్ రాజ్యమైన ముధోల్ రాజు మాలోజీ రావు గోర్పడే ఈ శునకాలను పెంచారు. ఒకసారి ఈ రాజు ఈ శునకాలను ఇంగ్లాండ్ ప్రతినిధులకు బహుమతిగా ఇచ్చారు. వారు ఈ శునకాలను జాగ్రత్తగా పెంచారు. ఆ దేశంలో నాటు శునకాల ద్వారా సంపర్కం జరిపించి కొత్త జాతిని కనిపెట్టారు. ఈ జాతి శునకాలు ప్రస్తుతం బర్మింగ్ హంలో విరివిగా కనిపిస్తుంటాయి. వీటిని కూడా అక్కడి దేశస్థులు కాపలా కోసం వినియోగిస్తుంటారు. కానీ అవి ముదోల్ జాతంత తెలివయినవి కావు. కాగా బాగల్ కోట్ లో స్పెషల్ ప్రొటెక్షన్ సెల్లో పెరుగుతున్న ఈ శునకాలు 72 సెంటీమీటర్ల పొడవు, 25 కిలోల బరువు వరకు ఉంటాయి. ఇవి రోజుకు అరకిలో మొక్కజొన్నలు, గోధుమలు, కందిపప్పును ఆహారంగా తీసుకుంటాయి. సాయంత్రం పూట రెండు ఉడకబెట్టిన గుడ్లను తింటాయి. ప్రధానమంత్రి భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ సెల్ లో పెంచుతున్న శునకాలకు రోజూ అరకిలో చికెన్ పెడతారు. వీటి నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ కావడంతో మున్ముందు రోజుల్లో సైన్యంలో మరిన్ని ముధోల్ జాతి శునకాలను తీసుకోవాలని రక్షణ శాఖ అధికారులు భావిస్తున్నారు.
Also Read:TNews Employees strike: జీతాల కోసం టీన్యూస్ ఉద్యోగుల మెరుపు సమ్మె.. అధికార పార్టీ ఇజ్జత్ పాయే!