Bandi Sanjay: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మరోమారు కరీంనగర్ అసెంబ్లీ బరిలో దిగారు. అధిష్టానం ఆయనకే టికెట్ కేటాయించింది. దీంతో ఆయన సోమవారం నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరయ్యారు.
నగరంలో భారీ ర్యాలీ..
కరీంనగర్ ఎమ్మెల్యే స్థానానికి నామినేసన్ వేసే ముందు బండి సంజయ్ కరీంనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గీతా భవన్ వరకు ఈ ర్యాలీ సాగింది. ఇందులో రాజాసింగ్ కూడా పాల్గొన్నారు. ర్యాలీ పొడవునా జైశ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలు మార్మోగాయి. అనంతరం అక్కడి నుంచి బండి స్వయంగా కారు నడుపుకుంటూ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి వెళ్లిన బండి సంజయ్ నామనినేషన్ వేశారు.
రూ.79 లక్షల ఆస్తులు.. 30 కేసులు..
ఇదిలా ఉండగా బండి సంజయ్ తన నామినేషన్ పత్రాలతో అఫిడవిట్ సమర్పించారు. ఇందులో తన పేరిట రూ.79.51 లక్షల ఆస్తి ఉందని పేర్కొన్నారు. అప్పులు రూ.5.44 లక్షలు ఉన్నట్లు తెలిపారు. తన భార్య పేరిట రూ.12.40 లక్షల ఆస్తి ఉన్నాయని వెల్లడించారు. తన పేరిట గానీ, తన కుటుంబ సభ్యుల పేరిటగానీ ఎలాంటి భూములు లేవని తెలిపారు. అదే సమయంలో తనపై 30 కేసులు(విచారణ దశలో) ఉన్నాయని పేర్కొన్నారు.
ఆస్తులపై చర్చ…
సంజయ్ భార్య ఎస్‌బీఐలో ఉద్యోగి. సంజయ్ ఐదేళ్లుగా ఎంపీగా ఉన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేశారు. కానీ, ఆయన పేరిట కేవలం రూ.79.51 లక్షల ఆస్తులు మాత్రమే ఉండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వార్డు కౌన్సిలర్, కార్పొరేటర్‌గా గెలిస్తేనే భారీగా ఆస్తులు కూడబెట్టుకుంటున్న ఈ రోజుల్లో ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, మూడేళ్లు అధ్యక్షుడిగా, ఐదేళ్లు ఎంపీగా ఉండి కూడా ఎలాంటి ఆస్తులు లేకపోవడం నిజంగా ఆదర్శమే అంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఆయన సంపాదన అంతా బినామీల పేరిట ఉందని ఆరోపిస్తున్నారు.