TDP And Jana Sena- BJP: అవసరం ఎంత పనైనా చేయిస్తుందంటారు. అది చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. తన రాజకీయ లబ్ధి కోసం ఆయన ఎందాకైనా వెళతారు. అవసరమైతే పది మెట్లు దిగి ఎవరి ప్రాపకం కోసమైన పాడిగాపులు కాస్తారు. అది చంద్రబాబు స్ట్రాటజీ. 1999లో బీజేపీతో జత కలిశారు. అటు తరువాత ముఖం చేశారు. 2014 ఎన్నికల్లో మరోసారి బీజేపీతో కలిసి నడిచారు. 2019లో అదే బీజేపీ, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఊరూ వాడా ప్రచారం చేశారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పురుడుబోసుకుందో.. అదే కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేశారు. పొత్తు సైతం పెట్టుకున్నారు. అయితే అన్నివేళలా వ్యూహాలు పనిచేయవు కదా.. గత ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఇప్పుడు పార్టీ గడ్డు పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో జనసేన, జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దల సహకారం లేనిదే గట్టెక్కలేనని తెలుసుకున్న చంద్రబాబు వారి ప్రాపకం కోసం చేయని ప్రయత్నం లేదు.

అయితే గత పరిణామాలను బీజేపీ అగ్రనేతలు అంత తొందరగా మరిచిపోలేకపోతున్నారు. వాస్తవానికి ప్రధాని మోదీ ఏపీలో పార్టీని విస్తరించాలని చూశారు. అటు పక్కనే ఉన్న తెలంగాణతో పాటు ఏపీలో కూడా బీజేపీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రారంభించారు. తెలంగాణ విషయంలో కొంత సక్సెస్ అయ్యారు. ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం పాచిక పారలేదు. దీనికి చంద్రబాబే కారణమన్నది జగమెరిగిన సత్యం. పద్ధతి ప్రకారం బీజేపీని రాష్ట్ర ప్రజల వద్ద శత్రువుగా చూపించడంలో సక్సెస్ అయ్యారు. విభజన హామీలు అమలుచేయకుండా కేంద్రం మోసం చేసిందని ప్రచారం చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలపడకుండాచేశారు.
ఇప్పుడు అదే చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం బీజేపీని కలుపుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే గత అనుభవాలను బీజేపీ పెద్దలు మరిచిపోలేకపోతున్నారు. చంద్రబాబుకు ఎట్టి పరిస్థితుల్లో చాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారు. అటు బీజేపీని ఏపీలో విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్ ను చంద్రబాబు ట్రాప్ లో పడకుండా చూస్తున్నారు. అందులో భాగమే పవన్ తో ప్రధాని భేటీ అని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ భేటీలో గత రెండున్నర దశాబ్దాలుగా చంద్రబాబు వ్యవహార శైలి ప్రధాని మోదీ పవన్ కు గుర్తుకు తెచ్చినట్టు సమాచారం. అందుకే పవన్ కూడా జాగ్రత్త పడ్డారని.. అందులో భాగంగానే ఒక చాన్స్ అంటూ ప్రచారం మొదలు పెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వైసీపీ విముక్త ఏపీకి పిలుపునిచ్చినందున పొత్తుల అంశాన్ని కూడా సజీవంగా ఉంచినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఒక వేళ పొత్తు అన్నది ఉన్నా అందులో కూడా చంద్రబాబును కేవలం ప్రేక్షక పాత్రగా ఉంచాలన్నది బీజేపీ పెద్దల అభిప్రాయం. ఇప్పుడు జగన్ మరోసారి అధికారంలోకి రాకూడదన్నది చంద్రబాబు ప్రధాన ధ్యేయం. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు తెలుసు. అందుకే ఆ అవసరాన్ని గుర్తెరిగి చంద్రబాబును ఇరుకున పెట్టేందుకు బీజేపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. పవన్ ను అడ్డం పెట్టుకొని మరోసారి రాజకీయం చేసి లబ్ధి పొందాలని చంద్రబాబు భావిస్తున్నారు. పవన్ ద్వారానే కేంద్ర పెద్దల సాయం తీసుకోవాలని కూడా ప్లాన్ చేశారు.ఇప్పుడదే ప్లాన్ తో చంద్రబాబును అణిచివేయాలని కేంద్ర పెద్దలు చూస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు సీఎం అవుతారు. అదే బీజేపీ, జనసేన కలిసి నడిస్తే నువ్వే సీఎం క్యాండిడేట్ వు అంటూ పవన్ ఆలోచనను డైవర్ట్ చేయడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీకి అడ్వాంటేజ్ కాకూడదని జనసేన భావిస్తోంది. అందుకే పవన్ నాదేండ్ల మనోహర్ తో ప్రకటన ఇప్పించారు. ఇప్పటికీ తాము వైసీపీ విముక్త ఏపీకి కట్టబుడి ఉన్నామని చెప్పించారు. అటు కేంద్ర పెద్దలు ఇచ్చిన డైరెక్షన్ పాటిస్తూనే.. పొత్తుల అంశాన్ని సజీవంగా ఉంచాలని భావిస్తున్నారు. ప్రధాని మోదీ విశాఖ భేటీలో స్పష్టమైన రాజకీయ సూచనలు చేసిన తరువాతే పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జనసేన టీడీపీతో కలవకూడదన్నది బీజేపీ పెద్దల వ్యూహం. ఒక వేళ కలిసినా చంద్రబాబును అచేతనం చేయాలన్నది రెండో వ్యూహం. ప్రధాని మోదీ కూడా పవన్ తో ఇదే చెప్పారని రాష్ట్ర బీజేపీ నాయకులు చెబుతున్నారు. జనసేన నాయకులు మాత్రం ప్రధాని భేటీ వివరాలు రహస్యమని.. ఇవి బయటకు తెలిసే చాన్స్ లేదని చెబుతున్నారు. అయితే మున్ముందు మాత్రం చంద్రబాబు గతంలో తమకు ఎన్ని విధాల చుక్కలు చూపించారో.. అదే సినిమా చంద్రబాబుకు చూపించాలన్న కసితో మాత్రం బీజేపీ పెద్దలు ఉన్నారు.