DMart : ఆన్ లైన్ మోసాలు(Online Scam) పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటూ మోసాలు చేస్తున్నారు. ఉచితం అనే మాటను ఎరగా వేస్తూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. ప్రజల అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు తెరతీస్తున్నారు. ఈసారి వారు డీమార్ట్(DMart) నే లక్ష్యంగా చేసుకుంటున్నారు. లేనిపోని ఆఫర్లు ప్రకటించి జేబులు గుళ్ల చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రజలను ఇట్టే బుట్టలో వేసుకుని వారి ఖాతాలోని డబ్బులను కానిచ్చేస్తున్నారు. ఏం జరిగిందో తెలిసే లోపే తమ ఖాతాలు పైసలు మాయం కావడంతో కంగుతింటున్నారు.
డీమార్డ్ షాపింగ్ మాల్ 20వ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ఉచితంగా బహుమతులు అందజేస్తుందని ఓ లింక్ నెట్టింట వైరల్ గా మారుతోంది. దీంతో వినియోగదారులు పొరపాటున లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. డీమార్డ్ కుంభకోణానికి సంబంధించి ఫేక్ లింక్ ను ట్విటర్ లో పోస్టు చేసిన సైబర్ వింగ్ పోలీసులు జాగ్రత్తగా ఉండాలని ఓపెన్ చేయొద్దు అంటూ హెచ్చరిస్తున్నారు. ప్రజలు అనవసర ఆశలకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు.
లింక్ ను క్లిక్ చేయగానే ఓ వెబ్ సైట్ ఓపెన్ అయి అందులోని ఓ స్పిన్నర్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు బహుమతులు వచ్చాయని ఓ సందేశం వస్తుంది. వాటిని తీసుకోవాలంటే ఆ లింక్ ను వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి అంటూ సూచన వస్తుంది. పొరపాటున ఆ లింక్ క్లిక్ చేస్తే ఖాతాలోని డబ్బులు ఖాళీ అవుతాయని పోలీసులు చెబుతున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నా రోజుకో కొత్త స్కాం వెలుగులోకి వస్తుంది. ప్రస్తుతం డీమార్డ్ ను వేదికగా చేసుకుని మోసాలకు పాల్పడాలని ప్లాన్ చేసుకున్నారు. దీంతో ప్రజలు ఆ యాప్ ల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నకిలీ యాప్ లపై అప్రమత్తంగా ఉంటూ వారి మోసాలను తిప్పికొట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.