బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో జతకట్టేందుకు వాటిని రెడీ చేస్తున్నారు. అంతర్గతంగా వారిలో శక్తి నింపే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో వైసీపీని కూడా తన వైపు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎన్నికల రూపురేఖలు మారనున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేయడమే పీకే వ్యూహంగా కనిపిస్తోంది.
మూడో కూటమి ప్రయత్నాలు ముమ్మరం అవుతున్న క్రమంలో అన్ని పార్టీల భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటి వరకు వైసీపీ ఏ కూటమిలోనూ చేరలేదు. దీంతో ఈసారి థర్డ్ ఫ్రంట్ లో చేరేలా ప్రేరేపిస్తున్నారు. కానీ జగన్ కు కూడా బీజేపీతో చాలా అవసరమే ఉంది. దీంతో ఆయన ఎటూ చెప్పలేకపోతున్నారు. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుని పీకే నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బీజేపీతో తమ పార్టీకి ఉన్న అవసరాల దృష్ట్యా ప్రస్తుతం ఎటూ చెప్పలేకపోతున్నామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ సారధ్యంలోని మూడో కూటమిలో చేరాల్సిందిగా పీకే ఇచ్చిన ఆఫర్ ను జగన్ కూడా కాదనలేకపోతున్నారు. పీకేపై జగన్ కు కూడా మంచి అభిప్రాయమే ఉంది. ఆయన వ్యూహాలపై జగన్ కు విశ్వాసం ఉంది. బీజేపీని ఢీకొట్టాలంటే అన్ని పార్టీల ప్రోత్సాహం అవసరమే అని గుర్తించి వాటిని ఏకం చేసే పనిలో పడ్డారు. దీంతోనే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని పోయేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
ఏపీ సీఎం జగన్ మాత్రం కేసుల భయంతోనే వెనకకు తగ్గినట్టు తెలుస్తోంది. బీజేపీతో వైరం పెట్టుకుంటే భవిష్యత్తులో నెగ్గలేమని భావిస్తున్నారు. దీంతో తాము ఎటు చెప్పలేక పోతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా దానికి వ్యతిరేకంగా నిలబడితే మనుగడ కష్టమే అవుతుందని భావిస్తున్న తరుణంలోనే పీకే ఆఫర్ ను తిరస్కరిస్తున్నట్లు సమాచారం.