
హుజురాబాద్ ఉప ఎన్నికలో వింతలు విశేషాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ, బీజేపీ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. దీంతో రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలిచే విధంగా తమ ప్రచారాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రజాదీవెన యాత్ర పేరుతో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గం అంతా చుట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేరారు. పాదయాత్ర కొన్ని రోజుల పాటు వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో నియోజకవర్గంలో ఆయన అనుచరులైనా పాదయాత్ర చేస్తే బాగుండని భావించినా అంత సాహసం ఎవరు చేయరని తెలుస్తోంది.
ఇక పార్టీ విషయానికి వస్తే బీజేపీలో ఈటల ప్రస్తుతం ఒంటరిగానే మిగిలిపోతున్నారు. పార్టీల చేరే వరకు అందరు వెంట ఉండి ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఈటలలో నైరాశ్యం పెరిగిపోతున్నట్లు కనిపిస్తోంది. పార్టీలో చేరే క్రమంలో అప్పటి కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వెంట ఉండి మరీ ప్రోత్సహించారు. కానీ ప్రస్తుతం ఇద్దరు చెరో దారి చూసుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈటల కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నత పొందిన కిషన్ రెడ్డి కర్ణాటక వ్యవహారాలు చూస్తున్నారు. ఇదే అదనుగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఈటలతో కలవడం లేదు. దీంతో ప్రచారం చేస్తున్నా ఆయనలో జోష్ కనిపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ వ్యూహాలకు దీటైన సమాధానాలు ఇచ్చే విధంగా ఈటలను సంసిద్ధం చేయాల్సిన నేతలు అంటనట్లుగా ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ అధిష్టానం సైతం ఈటల రాజీనామా చేయగానే ప్రచారంలో పాలుపంచుకోవాలన నాయకత్వానిక సూచించినా నేతలు పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అధిష్టానం తేల్చిచెప్పినా ఇంతవరకు ఏ నేత కూడా ఈటల వైపు చూడకపోవడం గమనార్హం. స్థానిక నేతలు కూడా పట్టించుకోకపోవడంతో ఈటలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. పాదయాత్రకు కూడా అనుకున్న విధంగానే విరామం ప్రకటించినట్లు సమాచారం.