Divorce Controversy:“వద్దురా సోదరా పెళ్లంటే నూరేళ్ళ మంటరా.. ఆగరా నువ్వాగరా.. వెళ్లిళ్ళి ఆ గోతిలో పడొద్దు రా” అని ఓ సినిమాలో పాట ఉంటుంది కదా. ఆ పాట నేటి కాలానికి అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్న పురుషుల పరిస్థితి అలా ఉంది కాబట్టి.. పెళ్లి చేసుకోకపోతే ఎందుకు చేసుకోలేదని సమాజం నుంచి ఒత్తిడి.. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యకు, కుటుంబ సభ్యులకు పడక అదొక రకమైన ఒత్తిడి.. ఒకవేళ ఇవన్నీ కాదనుకొని ప్రేమ వివాహం చేసుకుంటే.. అది మరింత దారుణంగా ఉంటుంది. ఇన్ని ప్రతికూలతలను దాటలంటే సగటు మగవాడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతోంది.. పైగా ఇటీవల కాలంలో వివాహేతర సంబంధాల వల్ల మగవాళ్ళు ఆడవాళ్ళ చేతిలో హతమవుతున్నారు. మేఘాలయ, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి వంటి ఘటనలు ఇటీవల కాలంలో తీవ్ర చర్చకు దారితీసాయి. ఈ ఘటనలో భార్యలు తమ భర్తలను హతం చేయడం విశేషం.
Also Read: వీఎస్ అచ్యుతానందన్ జీవితం.. ఒక పోరాట యోధుడి ప్రస్థానం!
తాజాగా ముంబైకి చెందిన ఓ మహిళ విడాకుల కేసు మన దేశ సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ కేసును భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి బీ ఆర్ గవాయ్ విచారించారు. కేసు పూర్వపరాలను పరిశీలించి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. దీనికి కారణం లేకపోలేదు. ముంబై మహా నగరానికి చెందిన ఓ మహిళ ఐటి ఉద్యోగిగా పనిచేస్తోంది. 18 నెలల క్రితం ఆమెకు వివాహం జరిగింది. భర్తతో విభేదాల వల్ల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ఆమె భరణం కోసం సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కింది. భరణంగా తనకు 12 కోట్లు ఇవ్వాలని.. బీఎండబ్ల్యూ కారు కూడా సమకూర్చాలని ఆమె తన పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ విచారించిన సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు..” మీరు వివాహం చేసుకొని 18 నెలలు మాత్రమే అయింది. అంతలోనే విడాకులు తీసుకున్నారు. మీకు నెలకు కోటి రూపాయలతోపాటు.. అత్యంత విలాసవంతమైన కారు కావాలా.. మీరు ఎంబీఏ చదువుకున్నారు. ఐటి ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇంకొకరిని ఇలా అడుక్కోవడం పద్ధతి కాదని” సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
Also Read: ప్రియుడిని వలచి.. కట్టుకున్న మొగుడిని కడతేర్చి.. జైల్లో ఒంటరైన సోనమ్ కథ!
ఇటీవలి కాలంలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయి. భరణం కోసం భర్తలను వేధిస్తున్న భార్యలు ఎక్కువవుతున్నారు. దీంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక చాలామంది భర్తలు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. సరిగ్గా కొద్ది నెలల క్రితం బెంగళూరులో ఓ ఐటీ ఉద్యోగి తన భార్యకు భరణం చెల్లించినప్పటికీ వేధిస్తున్న తీరు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ తరహా సంఘటనలు మరిన్ని చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో న్యాయస్థానాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. తాజాగా సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు కూడా ఆ కోవ లోనివేనని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.