
ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షాలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ – జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందా? అంటే.. కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ‘అవును’ అనే సమాధానమే చెబుతున్నాయి. దీనికి కారణం.. బీజేపీ నుంచి తనకు తగినంత ఇంపార్టెన్స్ రావట్లేదని పవన్ భావిస్తున్నారట! కేంద్రంతో సన్నిహిత సంబంధాలే ఉన్నప్పటికీ.. రాష్ట్రంలో మాత్రం తగిన గుర్తింపు దక్కట్లేదని అసంతృప్తిగా ఉన్నారట.
కరోనా తర్వాత చాలా రోజులు విశ్రాంతి తీసుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ క్రియాశీలకం అయ్యారు. బుధవారం నుంచి మంగళగిరిలోనే ఉంటూ.. రాజకీయాల్లో బిజీ కానున్నారు. అయితే.. బీజేపీపై ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక సమయంలోనే ఈ రెండు పార్టీల మధ్య చాలా గ్యాప్ వచ్చిందనే గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత కూడా పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి.
విపక్షాలతో కలిసి పోరాటం చేస్తామని చంద్రబాబు ప్రకటిస్తే.. తాము కలిసే ప్రసక్తే లేదని చెప్పింది బీజేపీ. కానీ.. జనసేన మాత్రం మాట్లాడలేదు. ఇక, తాజాగా.. ఏపీ జాబ్ క్యాలెండర్ పై బీజేపీ నేతలు ఉద్యమించారు. కానీ.. అందులో జనసేన కనిపించలేదు. దీంతో.. రెండు పార్టీల మధ్య ఏదో జరిగిందని, ఆ పరిస్థితి ఇంకా కొనసాగుతోందని మాత్రం అర్థమవుతోందని అంటున్నారు విశ్లేషకులు.
వాస్తవానికి జనసేన – బీజేపీ కలిసి ఓ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. దీని ప్రకారం.. రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. రెండు పార్టీలూ కలిసే తీసుకోవాలి. కానీ.. ఇప్పుడు పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఎవరికి వారే అన్న చందంగా రెండు పార్టీలూ ముందుకు సాగుతున్నాయి. జనసేన కేడర్ సైతం బీజేపీతో పొత్తుపట్ల అయిష్టంగానే ఉందనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.
ఇలాంటి పరిణామాలతో.. బీజేపీ-జనసేన స్నేహం మునపటిలా మాత్రం లేదనది స్పష్టమవుతోందని అంటున్నారు. తిరుపతి ఉప ఎన్నిక తర్వాత పవన్ కరోనా బారిన పడడం.. ఇప్పటి వరకూ బయటకు రాకపోవడంతో.. స్పష్టత రాలేదు. మరి, ఇప్పుడు బయటకు వచ్చారు. ఈ నేపథ్యం రెండు పార్టీల నేతలు కలిసి ఏదైనా కార్యక్రమం తీసుకుంటారా? అసలు కనీసం నేతలు కలుస్తారా? లేదా? అన్నది తేలితే.. ఓ స్పష్టత రావొచ్చని అంటున్నారు.