
తన తండ్రి మాదిరిగానే జగన్ నమ్ముకున్న వారికి న్యాయం చేస్తాడని కొందరు వైసీపీ నేతలు చెబుతుంటారు. కానీ.. ఇప్పుడు అదే వైసీపీలోని కొందరు మాత్రం పూర్తి భిన్నంగా స్పందిస్తున్నారు. జగన్ ను నమ్ముకుంటే మునిగిపోవడం ఖాయమా? అనే సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణమేంటీ? వారికి జరిగన అన్యాయమేంటీ?
2014లో జగన్ అధికారంలోకి రాలేకపోయిన తర్వాత చాలా మంది వైసీపీని వీడి వెళ్లారు. అందులో ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక, ఇతర నేతలు కూడా ఎక్కువ మందే ఉన్నారు. దీంతో.. జగన్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పోరాటం కొనసాగిస్తూనే.. ప్రజాక్షేత్రంలో తిరిగి పార్టీని నిలబెట్టారు. అయితే.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ వెన్నంటి ఉన్నారు కొందరు నేతలు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. కానీ.. అధికారంలోకి వచ్చిన వారికి సరైన గుర్తింపు దక్కట్లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వారికి న్యాయం జరగకపోగా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని అందలం ఎక్కిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రవీంద్రబాబు, అవంతి, చల్లా రామకృష్ణారెడ్డి, రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు వంటి నేతలు ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చారు. గెలిచిన తర్వాత మరింత మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇలాంటి వారికే పదవులు దక్కాయి. దక్కుతున్నాయి. దీంతో పార్టీని నమ్ముకున్నవారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
తోట త్రిమూర్తులు మొదలు పండుల రవీంద్రబాబు వరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తుండడంతో తట్టుకోలేకపోతున్నారు. సామాజిక వర్గ పరంగా చూసుకున్నా, విధేయత పరంగా చూసుకున్నా.. తమకు దక్కాల్సినవి ఇతరులు తన్నుకుపోతుండడంతో బాధపడుతున్నారు. దీంతో.. జగన్ ను నమ్ముకుంటే మునిగిపోయినట్టేనా? అనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారే విషయం కూడా పరిశీలిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి ఈ పరిస్థితి మరింతగా ముదురుతుందని అంటున్నారు విశ్లేషకులు.