టీడీపీ నుంచి అధికార పార్టీ వైసీపీలో చేరిన వలస నాయకులతో వైసీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్ (గన్నవరం), మద్దాలి గిరిధర రావు (గుంటూరు వెస్ట్), కరణం బలరామ్ (చీరాల) వైసీపీ తీర్ధం పుచ్చుకోకున్నా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. పదవుల్లో లేనీ టీడీపీ నాయకులకు చట్టపరంగా ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో వారు పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారు.
Also Read: స్వర్ణ ప్యాలెస్ ఘటన.. జగన్ సర్కార్ కు షాక్
టీడీపీ నాయకుల చేరికతో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గన్నవరం వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుల మధ్య కోల్డ్ వార్ సాగుతున్న విషయం విధితమే. మరోవైపు చీరాలపై పట్టు సాధించిన ఆమంచి కృష్ణమోహన్ ఉండగా కరణం బలరామ్ కుమారుణ్ని పార్టీలో చేర్చుకుని నియోజకవర్గాన్ని వారికి అప్పగించారు. ఆమంచిని చీరాల వదిలి అద్ధంకి ఇన్ఛార్జిగా కొనసాగాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు.
మరోవైపు ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలోను పార్టీ నాయకుల తీవ్ర అంసతృప్తితితో ఉన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో మాజీ మంత్రి టీడీపీ నాయకులు రామసుబ్బారెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మూలె సుధీర్ రెడ్డి అదిష్టానంపై ఆగ్రహంతో ఉన్నారని జిల్లాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. జిల్లాలో మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వడంతో ఇతర వర్గాల నాయకులు అసంతృప్తితో ఉన్నారు.
Also Read: ఒంటరి పోరాటం చేస్తున్న చంద్రన్న..!
టీడీపీ నుంచి వలస వచ్చి వైసీపీలో చేరిన నాయకులు నియోజకవర్గాల్లో హావా కొనసాగించడంతో ఇంత కాలం పార్టీ కోసం పని చేసిన వారికి ఇబ్బందిగా మారింది. గన్నవరం నియోజకవర్గంలో అసలైన వైసీపీ నాయకులను పక్కనపెట్టి ఎమ్మెల్యే వంశీ తన వెంట టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జమ్మలమడుగులోను సుధీర్ రెడ్డిని పక్కన పెట్టి రామసుబ్బారెడ్డి హవా కొనసాగించడంతో సుధీర్ రెడ్డి వర్గం ఇబ్బందుల్లో పడింది. పార్టీ కోసం పని చేసిన వారికి ఇలా అన్యాయం చేయడం సరైన నిర్ణయం కాదనే విషయం అదిష్టానం గుర్తించాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.