https://oktelugu.com/

కాంగ్రెస్ భవిష్యత్తు ను నాశనం చేస్తున్న గాంధీలు

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పేర్లు తెలియనివాళ్ళు ఎవరూ వుండరేమో. కానీ వాళ్ళు నకిలీ గాంధీ పేరుతో చలామణి అవుతున్నారని ఎంతమందికి తెలుసు? వీరికి గాంధీ కి ఎటువంటి రక్త సంబంధం లేదని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? ఇందిరా నెహ్రూ ఫిరోజ్ జహంగీర్ ఘండి ( కొంతమంది ఫిరోజ్ ఖాన్ అని కూడా చెబుతారు) ని పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఫిరోజ్ ఘండి/ఖాన్ పార్సీ తెగకు చెందినవాడు. తన మతం పార్సీ […]

Written By:
  • Ram
  • , Updated On : August 26, 2020 / 03:23 AM IST
    Follow us on

    సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ పేర్లు తెలియనివాళ్ళు ఎవరూ వుండరేమో. కానీ వాళ్ళు నకిలీ గాంధీ పేరుతో చలామణి అవుతున్నారని ఎంతమందికి తెలుసు? వీరికి గాంధీ కి ఎటువంటి రక్త సంబంధం లేదని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? ఇందిరా నెహ్రూ ఫిరోజ్ జహంగీర్ ఘండి ( కొంతమంది ఫిరోజ్ ఖాన్ అని కూడా చెబుతారు) ని పెళ్లి చేసుకోవటం తెలిసిందే. ఫిరోజ్ ఘండి/ఖాన్ పార్సీ తెగకు చెందినవాడు. తన మతం పార్సీ అని కొంతమంది, ఇస్లాం అని కొంతమంది చెబుతారు. ఏ మతానికి చెందినవాడైనా, ఏ తెగకు చెందినవాడైనా భారతీయుడే కదా. కాకపోయినా ఏమవుతుంది ప్రేమకు మతాలూ, దేశాలు అడ్డుకాదు కదా. అటువంటప్పుడు ఆ పెళ్ళికి సెక్యులర్ వాది, అభ్యుదయవాది అయిన నెహ్రూ కి అభ్యంతరం ఉండాల్సిన అవసరం ఏమిటో తెలియదు. మహాత్మా గాంధీ సహాయంతో ఫిరోజ్ ఘండి/ఖాన్ పేరును ఫిరోజ్ గాంధీగా లండన్ లో అఫిడవిట్ దాఖలు చేసి మార్పు చేసారని తెలుస్తుంది. దానితో ఇందిరా ఘండి/ఖాన్ పేరు కూడా ఇందిరా గాంధీ గా మారిందని దానితో నెహ్రూ మనసు కుదుటపడి శాంతించిందని చెబుతారు.  ఈ విధంగా గాంధీ వారసత్వాన్ని దొంగచాటుగా స్వంతం చేసుకొని అసలు గాంధీ కుటుంబానికి తామే వారసులుగా భ్రమింప చేయటం లోనే వీరి రాజకీయ చాకచక్యం తేటతెల్లమవుతుంది. పుట్టుకతో వచ్చిన వారసత్వాన్నే మార్చగలిగినవాళ్ళు తమ మనుగడ కోసం కాంగ్రెస్ భవిష్యత్తుని ఫణంగా పెట్టటంలో విశేష మేముంది.

    Also Read : కాంగ్రెస్ తో కటీఫ్ అంటున్న కోదండరాం?

    23 మంది రాసిన లేఖపై కోపం ఎందుకు?

    వీళ్ళందరూ గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్రులే. ఇన్నాళ్ళూ గాంధీ కుటుంబం మీద ఈగ వాలనివ్వకుండా కాపాడిన వాళ్ళే. మరి ఒక్కసారి  కానివాళ్ళు ఎలా అయ్యారు? ఇంతకీ వాళ్ళు చేసిన పాపమేంటి? పార్టీ బతికి బట్టకట్టాలంటే ఏంచేయాలో వాళ్ళ అనుభవాన్ని రంగరించి కొన్ని సలహాలు చేశారు. దానికే అంతగా విరుచుకు పడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు లేవనెత్తిన అంశాలపై చర్చించే బదులు ఇదా టైం అని రాహుల్ గాంధీ ( ఘండి) ఘర్జించటం లో ఆంతర్య మేంటి? దానికి సెంటిమెంట్ కూడా జోడించి సోనియా గాంధీ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఈ పని చేయటం వలన బిజెపి కి లాభం కలగదా అని రెట్టించటం వెనక అసలు భావమేమిటి? (కపిల్ సిబాల్ ట్వీట్ వేరు ఇది వేరు). అంటే వాళ్ళు లేవనెత్తిన అంశాలకు జవాబు చెప్పకుండా సమస్యను దాటవేయటానికే ఈ పని చేసినట్లు స్పష్టమవుతుంది. రాజస్తాన్ , మధ్య ప్రదేశ్ ల్లోసమస్యల్లాంటివి సంవత్సరం పొడవునా వస్తూనే వుంటాయి. వచ్చే కొద్ది నెలల్లో బీహార్ ఎన్నికలు, ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఇలా ఏవో ఒకటి దేశంలో వస్తూనే వుంటాయి. కాబట్టి టైం కరెక్టు కాదనేది కుంటిసాకు. ఇక సోనియా గాంధీ ఆరోగ్యం బాగానే వుందని , ఇది రొటీన్ మెడికల్ చెక్ అప్ అని అధికార ప్రతినిధే చెప్పాడు. ఇకపోతే క్రమశిక్షణ ఉల్లంఘన గురించి కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదం.

    ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్ళు మాట్లాడటం కాంగ్రెస్ కి కొత్తేమీ కాదు. వాళ్లకు నచ్చితే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయమని వాళ్ళను సేవ్ చేయటం  పరిపాటే. వాళ్ళ లెటర్ లీక్ అయ్యిందని అదేదో జరగరానిది జరిగిందనీ అందుకని వీరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కొంతమందిచేత బహిరంగంగా ప్రకటనలు ఇప్పించటం క్రమశిక్షణ ను ఉల్లంఘించటం కాదా?  ఈ వుత్తరం రాసిన వాళ్ళందరూ గాంధీ కుటుంబం దయతో ఇచ్చిన పోస్టులు అనుభవించి కూడా ఇలా మాట్లాడటం విశ్వాస రాహిత్యమట. అది ఆ మాట్లాడే వాళ్లకు కూడా వర్తిస్తుందని మర్చిపోవద్దు. మన్మోహన్ సింగ్ దగ్గర్నుంచీ , చిదంబరం, ఆదిర్ రంజన్ చౌదరి దాకా అందరూ ఆ కోవలోకే వస్తారు కదా. మరి ఇదేదో వీళ్ళకే వర్తించటం ఎందుకు? కాబట్టి అసలు విషయం అది కాదు. గాంధీ కుటుంబం పై ఏమాత్రం ప్రశ్నించినట్లు కనబడినా వెంటనే వాళ్ళను బిజెపి కి అంటగట్టటం , ఇదంతా బిజెపి కుట్ర లో భాగమేనని చెప్పటం పరిపాటి అయ్యింది. సచిన్ పైలట్ పై ఇదే ఆరోపణలు చేసారు. తర్వాత అది అబద్దమని తేలింది. ఇప్పుడు వీరిపై కూడా కొంతమంది చేత అదే ఆరోపణలు చేయిస్తున్నారు. అంటే బిజెపి బూచిని చూపించి తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకుంటున్నారు.

    Also Read : వలసవాదులతో వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి..!

    లేఖలో ప్రస్తావించిన అంశాలు గాంధీ కుటుంబానికి వ్యతిరేకమా?

    ఇవన్నీ కాంగ్రెస్ అనుకూల , కాంగ్రెస్ శ్రేయోభిలాషుల అభిప్రాయాలే. పత్రికల్లో ఎప్పట్నుంచో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు చెప్పిందట్లో తప్పేమిటో చెప్పాలి. 2014 నుంచి పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతుందని వాపోయారు. బిజెపి ని సమర్ధంగా ఎదుర్కోవాలంటే పార్టీ ని తిరిగి పునరుజ్జీవనం చేయాలని చెప్పారు. నాయకత్వం అందరికీ అందుబాటులో వుండాలని , నిరంతరం పనిచేసేటట్లు వుండాలని చెప్పారు. అదేసమయం లో పార్టీని శక్తివంతంగా చేయాలంటే ఏమి చేయాలో కొన్ని సూచనలు ఇచ్చారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కి ఎన్నికలు జరపాలని , అధికార వికేంద్రీకరణ జరగాలని, రాష్ట్ర కమిటీలకు మరింత స్వేచ్చ వుండాలని, పార్లమెంటరీ బోర్డు ని ఏర్పాటు చేయాలని చెప్పారు. గాంధీ కుటుంబం ఇందులో ప్రముఖ పాత్ర వుండాలని కూడా చెప్పారు. ఇందులో ఏ ఒక్కటీ పార్టీ వ్యతిరేక చర్యగా చెప్పగలరా?

    సంవత్సరం పైనుండీ కాంగ్రెస్ కి అధ్యక్షుడు లేకుండా తాత్కాలిక అధ్యక్షురాలి తో నడపడటం ఎంతవరకు సబబు? ఓ పెద్ద పార్టీకి ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. అంటే ఏమిటి . రాహుల్ గాంధీ కి ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీ పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరు రాకూడదు. మోడీ కి ప్రత్యామ్నాయంగా గట్టి ప్రతిపక్ష పార్టీ గా తయారుకావాలంటే మంచి సలహాలు స్వీకరించి పటిష్టపరుచుకొనే బంగారు అవకాశాన్ని చేజార్చుకొని కాంగ్రెస్ భవిష్యత్తుని తామే నాశనం చేసుకోవటమంటే ఇదేనేమో. ఎప్పటికైనా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టాల్సిందే , అప్పటిదాకా కాంగ్రెస్ పని కుంటుబడి పార్టీ దెబ్బతిన్నా పర్వాలేదు. వుంటే మేముండాలి లేకపోతే ఏమయినా పర్వాలేదు అనే స్వార్ధం సోనియా గాంధీ కుటుంబం లో వుందని ఈ పరిణామంతో ప్రతిఒక్కరికీ అర్ధమయ్యింది. పరిస్థితులు ఇలానేవుంటే బిజెపి ని వ్యతిరేకించే శక్తులన్నీ కలిసి వేరే కుంపటి పెట్టుకోవటం ఖాయం. ఈ పరిస్థితులు చూస్తుంటే 2024లో కూడా 2019 ఫలితాలే పునరావృతమవుతుందా అనిపిస్తుంది. ప్రజాస్వామ్యం లో కనీసం రెండు బలమైన జాతీయ పార్టీలు ఉంటేనే ప్రజలకు ప్రయోజనముంటుంది. ఇంకా నాలుగు సంవత్సరాలు వుంది కాబట్టి ఆ దిశగా అడుగులు పడతాయని ఆశిద్దాం.

    Also Read : టీ.కాంగ్రెస్ కు ఊపుతెచ్చే ప్లాన్ చేశారు?