
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై దేశ వ్యాప్తంగా గత మూడు నెలలుగా ఉద్యమం నడుస్తూనే ఉంది. అయినా.. అటు రైతులు కానీ.. ఇటు ప్రభుత్వం కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎన్నో దఫాలుగా చర్చలు నిర్వహించినా పెద్దగా ఫలితాలనివ్వలేదు. ఇప్పుడు ఈ రచ్చ కాస్త ఇంటర్నేషనల్ అయిపోయింది. రైతుల పోరాట పటిమ కావొచ్చు.. మరేదైనా కావచ్చు వీరి ఆందోళనలపై అంతర్జాతీయంగానూ స్పందనలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ అంతర్జాతీయ మెస్సేజ్‌లపై కేంద్రం కూడా అతిగా స్పందించడంతో వారికి మరింత ప్రాధాన్యం లభిస్తోంది. ఇండియాలో మానవ హక్కులు ఉల్లంఘనకు గురువుతున్నాయన్న చర్చ ప్రారంభమైంది.
Also Read: న్యాయవాద దంపతుల హత్యపై సంచలన ప్రకటన చేసిన పుట్టమధు
చివరికి దిశా రవి అనే 21 ఏళ్ల పర్యావరణ ఉద్యమకార్యకర్తను టూల్ కిట్ పేరుతో అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. ఆమె అరెస్ట్‌కు వ్యతిరేకంగా కొంత మంది.. అరెస్ట్ సహజమేనని మరికొంత మంది నేరుగా రాష్ట్రపతికి లేఖలు రాయడం.. అందులో మాజీ ప్రధాన న్యాయమూర్తులు ఉండటం మరింత చర్చనీయాంశం అవుతోంది. అసలు దిశా రవి ఏం చేశారు..? ఎందుకీ పరిస్థితి వచ్చిందన్నది ఇప్పుడు కీలకం అయింది. బాల పర్యావరణ ఉద్యమకారిణిగా.. గ్రెటా ధన్ బర్గ్ ప్రపంచం మొత్తానికి ట్రంప్ తెంపరితనం వల్ల పరిచయం అయ్యారు. ఆమె భారత రైతుల ఆందోళనలకు మద్దతుగా ట్వీట్ చేశారు. ఆ క్రమంలో ఓ టూల్ కిట్‌ను జత చేశారు. ఆ టూల్‌కిట్‌లో ఎప్పుడెప్పుడు ఎలా ఉద్యమం చేయాలో కార్యాచరణ ఉంది. టూల్ కిట్ అంటే చాలా మంది ఏదేదో అనుకుంటున్నారు. అది ఓ కార్యాచరణ పత్రం మాత్రమే.
సోషల్ మీడియా వ్యూహంతోపాటు, నిరసన ప్రదర్శనల సమాచారం కూడా ఉంది. ఉద్యమం ఉద్ధృతం చేయడానికి ఉపయోగించుకుంటారు. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు అన్నీ ఈ టూల్ కిట్ తరహా ప్లాన్‌ను అమలు చేసుకుంటాయి. నిజానికి ఇది ఒకరు తయారు చేసేది కాదు.. ఎవరైనా ఎక్కడినుంచైనా గూగుల్ డాక్యుమెంట్ ఎడిట్ చేయొచ్చు. అందరి ఆలోచనలను అందులో పొందుపరిచి.. అన్నీ ఒకేచోట ఉండేలా చేయొచ్చు. ఇప్పుడీ టూల్ కిట్‌ను దిశా రవి రూపొందించారనేది పోలీసుల అభియోగం.
Also Read: బీజేపీ టార్గెట్ సాగర్ : అందుకే కొత్త నేతలు కావాలంట
ఇండియా చాప్టర్‌లో దిశా రవి లాంటి వారు 150 మంది పని చేస్తున్నారు. గోవా, జమ్మూ, మధ్య ప్రదేశ్‌లలో చెట్లు కొట్టేస్తున్నప్పుడు ప్రచారోద్యమం చేశారు. అయితే వీరిపై ఇప్పుడు దేశద్రోహ అభియోగాలు నమోదయ్యాయి. దిశతోపాటు నికితా జాకబ్, శాంతాను ములుక్ లపై కేసులు నమోదయ్యాయి. మిగిలిన వారికి ముందస్తు బెయిల్ వచ్చింది. దిశ రవిని మూడు రోజుల కస్టడీకి ఇచ్చారు. దిశ ఫోను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆమె వ్యక్తిగత సమాచారం.. చాట్స్ మొత్తాన్ని మీడియాకు లీక్ చేశారు. కొన్ని విలువలు విడిచేసిన ఇంగ్లిష్ మీడియా చానెళ్లు మొత్తం వాటిని ప్రసారం చేసేస్తున్నాయి. ఇప్పుడు ఆమెకు అనుకూలంగా.. వ్యతిరేకంగా దేశంలో రెండువర్గాలు వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె దేశానికి ఏ విధంగా చెడు చేయబోయిందో విశ్లేషిస్తున్నారు కొంత మంది. కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకున్నారు అని మరికొంత మంది అంటున్నారు. కానీ.. ఆమె అరెస్టు విషయంలో మాత్రం అసలు నిజాలు ఎవరికీ వెల్లడి కావడంలేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్