CM Jagan Graph: పొగడ్త వస్తే మా గొప్పదనం.. ప్రతికూలత వస్తే ఎదుటి వారి కుట్ర అన్నట్టుంది ఏపీలో వైసీపీ నేతల దుస్థితి. గత ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యత కనబరచిన ఆ పార్టీ .. గత మూడేళ్లుగా ఎదురులేని స్థితిలో నిలిచింది. సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజలకు మరింత దగ్గరైంది. ఇది వాస్తవమే కానీ.. పాలనాపరంగా మాత్రం వెనుకబడింది. ఇదే విషయంపై ఇటీవల సీఎన్వోఎస్ సర్వేలో తేటతెల్లమైంది. సెంటర్ ఆఫ్ నేషనల్ ఓపీనియన్ సర్వే (సీఎన్వోఎస్) తాజాగా విడుదల చేసిన సర్వేలో జగన్ బాగా వెనుకబడ్డారు. ఎప్పటికప్పడు ఈ సర్వే బృందం ప్రజల్లోకి వెళ్లి అభిప్రాయాలను సేకరిస్తోంది. వాటిని క్రోడీకరించి సర్వేను వెల్లడిస్తుంది. తాజాగా ప్రధాని మోదీతో పాటు దేశ వ్యాప్తంగా 25 మంది సీఎంల పనితీరు, వారికున్న జనాదరణపై సర్వే చేసింది. ఏపీ సీఎం జగన్ కు దేశంలో 20వ స్థానం లభించింది.

రాష్ట్రంలోని 39 శాతం మంది ఆయన నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 29 మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 32 శాతం మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు. ఈ సర్వేలో మరో తెలుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ఆయన 11వ స్థానంలో ఉన్నారు. ఏపీ సీఎం జగన్ తో పోల్చుకుంటే 9 శాతం ఆదరణతో ముందంజలో ఉన్నారు. ఆయన నాయకత్వంపై 49 మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం 19 శాతం మంది మాత్రం వ్యతిరేకించారు. మిగతా32 మంది మాత్రం తటస్థంగా ఉండిపోయారు. అయితే ఈ సర్వేను వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఏపీలో వైసీపీతో పాటు సీఎం జగన్ కు ప్రజాదరణ పెరుగుతుంటే..సర్వే వాస్తవ విరుద్ధంగా ఉందని కొత్తవాదనకు వైసీపీ నేతలు తెరపైకి తెస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కుట్రగా అభివర్ణిస్తున్నారు. గత మూడేళ్లుగా ఎటువంటి ఎన్నికలు వచ్చినా విజయం సాధించామని.. కొన్నిసార్లు విపక్ష అభ్యర్థులు డిపాజిట్లు సైతం కోల్పోయారని.. సీఎం పాలనా తీరు ప్రజలకు నచ్చకపోతే విజయం సాధ్యమయ్యేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ఫేక్ సర్వేగా చెబుతున్నారు. ఇదంతా టీడీపీ కుట్రగా అభివర్ణిస్తూ.. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇటువంటి సర్వేలను చేయించిందని ఆరోపిస్తున్నారు. తాజాగా సీఎన్వోఎస్ విడుదల చేసిన సర్వే చర్చనీయాంశంగా మారింది. వైసీపీ నేతలు కలవరపాటుకు గురవుతున్నారు. ఎక్కడికక్కడే నేతలు స్పందిస్తూ ఇది వాస్తవ విరుద్ధమైన సర్వేగా పేర్కొంటున్నారు.
Also Read: Madras High Court: తాళి తీయడమంటే భర్తను అత్యంత క్రూరంగా క్షోభ పెట్టడమే: హైకోర్టు సంచలన తీర్పు
ఎన్నికలకు రెడీ..
వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకుంది. మరో రెండేళ్ల పాలనే మిగిలి ఉంది. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే విపక్ష టీడీపీ, జనసేనలు అప్రమత్తయ్యాయి. దూకుడు పెంచాయి. టీడీపీ మహానాడుతో పాటు బాదుడే బాదుడు కార్యక్రమంతో వైసీపీకి గట్టిగానే సవాల్ విసిరింది. చంద్రబాబు అన్ని జిల్లాలను చుట్టేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. అదే సమయంలో జనసేనాని పవన్ సైతం వైసీపీ ప్రభుత్వంతో పాటు సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కౌలురైతు భరోసా యాత్రతో పాటు జనవాణి, గుడ్ మార్నింగ్ సీఎం పేరిట వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, పాలనా లోపాలను ఎత్తిచూపుతున్నారు. దీంతో వైసీపీ శ్రేణులు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. వైసీపీ ప్లీనరీతో కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా వెల్లడైన సర్వే మాత్రం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. అందుకే సర్వే ఫేక్ అంటూ కొత్త పల్లవిని అయితే అందుకున్నారు.
వారికి లేని అభ్యంతరం…
వాస్తవానికి కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లవుతోంది. దేశంలో అద్భుత విజయాలను ఆ పార్టీ సొంతం చేసుకుంటూ వస్తోంది. అయినా బీజేపీ పాలి త రాష్ట్రాల సీఎంల పనితీరుపై కూడా ఈ సర్వే వెల్లడించింది. అదే సమయంలో ప్రధాని మోదీ గ్రాఫ్ సైతం పెరిగిందని చెప్పుకొచ్చింది. కానీ వారెవరూ సర్వేపై స్పందించిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అభ్యంతరాలు వ్యక్తం కావడం విశేషం. పైగా ఇదంతా చంద్రబాబు కుట్రగా పేర్కొంటున్నారు. చంద్రబాబు అధికారానికి దూరమై దాదాపు మూడేళ్లు కావస్తోంది. కేంద్రంలో కూడా ఆయన పరపతి అంతగా లేదు. అయినా ఆయనే సర్వేకు సూత్రధారి అన్నట్టు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో అయితే హేతుబద్ధత కనిపించడం లేదు. అయితే ఈ తాజా సర్వే గెలుపోటమును నిర్ధేశించలేదని.. కేవలం సీఎంల పాలనా తీరుపై మాత్రమే చేసిన సర్వేగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి సమయంలో పాలనా వైఫల్యాలను అధిగమించడానికి ప్రయత్నించాలే తప్ప.. తమ లోపాలను అసమర్ధతను ఎదుటివారిపై నెట్టేయకూడదని చెబుతున్నారు.

విపక్షాలకు అస్త్రం..
మరోవైపు సర్వే ఫలితాలు విపక్షాలకు కొత్త అస్త్రాలను ఇచ్చినట్టయ్యింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జగన్ పాలనలో వైఫల్యం చెందారని ఆరోపిస్తోంది. పాలన అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే కాదని… అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ వస్తోంది. అయితే సంక్షేమ పథకాల మాటున జగన్ కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకే టీడీపీ ఆరోపణలు చేస్తోందని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. కానీ టీడీపీ చేస్తున్న ఆరోపణలనే జాతీయ స్థాయిలో సర్వే బయటపెట్టింది. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం దీనికి అంగీకరించడం లేదు.ఇది ముమ్మాటికీ చంద్రబాబు కుట్ర అన్న అభిప్రాయంతో ఉన్నారు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు అందుకున్న వారిలో సానుకూలత ఉంది. అదే అంశాన్ని సర్వే వెల్లడించింది. జగన్ పనితీరుపై 39 మంది సంతృప్తి వ్యక్తం చేశారని కూడా చెబుతోంది. 29 మంది మాత్రమే అసంతృప్తిగా ఉన్నారని.. 32 మంది తటస్థంగా ఉన్నారని ప్రకటించింది. ఈ విషయంలో సానుకూల అంశాలను పరిగణలోకి తీసుకోకుండా మొత్తం సర్వే ఫేక్ అని వైసీపీ శ్రేణులు వాదనకు దిగడం చర్చనీయాంశమవుతోంది.
Also Read:Food Safety and Standards in AP: ఏపీలో ఆహారం తినేవాళ్లందరికీ హెచ్చరిక.. కాస్త ఆగండి..
[…] […]