Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు అసలు సిసలు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారు. వైసిపి అఫీషియల్ స్పోక్స్ మన్ గా మారారు. వైసిపికి అనుకూలంగా ట్విట్స్ వేయడం, వేరే పార్టీ వాళ్లు వైసిపిని ఏదైనా అంటే వెంటనే వాళ్లకి ట్విట్టర్లో కౌంటర్లు ఇవ్వడం, వైసిపికి అదేపనిగా బాగా కొట్టడంఇటీవల పరిపాటిగా మారింది. ఆర్జీవిని వైసిపి డిజిటల్ మీడియా అంతా చూసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే ఆయన ఏపీ ప్రభుత్వ విధానాలపై సైతం మాట్లాడగలుగుతున్నారు. తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చివరకు వైసీపీ వ్యతిరేకులుగా మారిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల విషయంలో సైతంఅనుచిత వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు.
తాజాగా ఏపీ ఉద్యోగుల విషయంలో ఆర్జీవి కలుగ చేసుకున్నారు. జీతాల ఆలస్యం పై స్పందిస్తూ భిన్నంగా కామెంట్స్ చేశారు. గతంలో ఏపీ ఉద్యోగులు విజయవాడలో ఉద్యమ బాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సైతం రకరకాల సెటైర్లతో కామెంట్లు పెట్టారు. వీరిని చూసి ఏపీ ప్రభుత్వం చలించిందో లేదో కానీ.. నాకు మాత్రం చలి జ్వరం వచ్చిందంటూ సెటైర్లు వేశారు. మొన్నటికి మొన్న చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు నిరసన బాటపట్టారు. వందో.. రెండు వందల మంది కాదు.. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ పొందిన ఆ రెండు లక్షల మంది ఎక్కడ అని ప్రశ్నించి వారి మనోభావాలను దెబ్బతీశారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను టార్గెట్ చేస్తూ.. పది రోజులు జీతాలు ఆలస్యం అయితే భరించలేరా అని ప్రశ్నించారు.
తెలంగాణలో ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ సభలో పాల్గొన్నారు. అక్కడ దిగువ స్థాయి సిబ్బందికి జీతాలు ఆరు నెలలుగా లేవని తెలుసుకున్నారు. దానికి పరిష్కార మార్గం చూపిస్తామని.. ఇటువంటి చిన్న చిన్న సమస్యలను సైతం అధిగమిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియోని జత చేస్తూ ఆర్జీవి సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం విశేషం. పొరుగు రాష్ట్రంలో జీతాలు ఆరు నెలలు ఆలస్యం అవుతున్నాయని.. ఇక్కడ మాత్రం పది రోజులైనా భరించలేకపోతున్నారంటూ ఆర్జీవి సెటైరికల్ గా కామెంట్స్ చేయడం వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియోలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయులుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీవి తీరును తప్పుపడుతున్నారు.
https://twitter.com/RGVzooi/status/1722065401201222049?s=20