CM KCR- Srinivas Rao: మొన్న ఒకేరోజు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో 8 వైద్య కళాశాలను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య శాఖకు చెందిన కీలక అధికారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.. అయితే వీరిలో ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు.. కొత్తగూడెం పట్టణానికి వైద్య కళాశాల ఏర్పాటు చేసినందున తాను ముఖ్యమంత్రి కి ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపానని ఆయన సమర్ధించుకున్నారు.. కానీ ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది.

ఉద్యోగ సంఘాల నాయకులా? బ్రోకర్లా?
సరిగ్గా రెండేళ్ల క్రితం తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. వీరికి ఏ ఒక్క ఉద్యోగ సంఘం కూడా మద్దతు తెలపలేదు. పైగా వరుస ప్రెస్ మీట్లు నిర్వహించి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడింది ఆర్టీసీ కార్మికులే. వారు సమ్మెలోకి దిగిన తర్వాతే ఉద్యమ రూపం మారింది. దురదృష్టవశాత్తు తెలంగాణ వచ్చిన తర్వాత నష్టపోయింది వారే. ఇక ప్రభుత్వానికి భజన చేయటం లో అలవాటు పడిన ఉద్యోగ సంఘాల నాయకులు వారి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తున్నారు.. ప్రభుత్వం పిఆర్సి అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినప్పటికీ ఒక్క మాట అనలేదు. ఇక మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా టిఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేశారు. విషయం తెలుసుకున్న బిజెపి నాయకులు వారిని ప్రశ్నించారు.. దీనికి కౌంటర్ గా మరుసటి రోజు టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నాయకులు విలేకరుల సమావేశం పెట్టి… కెసిఆర్ మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటున్నారని కితాబు ఇచ్చారు.. ఓ మంత్రితో సన్నిహితంగా ఉండే ఓ ఉద్యోగ సంఘం అధ్యక్షురాలు సీఎం కేసీఆర్ దేవుడు అని పొగిడింది.
పోటీ పడుతున్నారు
సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్దిపేట వెళ్ళినప్పుడు అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కారు.. కానీ ఇదే కలెక్టర్ రంగనాయక సాగర్ నిర్వాసితుల విషయంలో కర్కశంగా వ్యవహరించారు.. వారంతా కూడా కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం మొట్టికాయలు వేసింది.. కలెక్టర్ అయినప్పటికీ అధికార టీఆర్ఎస్ భజనలో ఆరు తేరిన ఈయనకు కెసిఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈయన ఒక్కడే కాదు టీఎన్జీవో లో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ మహిళ అధ్యక్షురాలి భర్త పటాన్ చెరువు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేస్తూ పదవీ విరమణ చేశాడు.

కానీ ఈమె చాకచక్యం వల్ల ప్రభుత్వం అతడి సర్వీసును ఐదేళ్లు పొడిగించింది.. ఇక ఈమె కూకట్ పల్లి కమిషనర్ గా పనిచేస్తూ ఉంటారు. అయితే ఈమెను ఎల్బీనగర్ జోన్ కు బదిలీ చేయడంతో… ఈమెకు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి ఆ బదిలీని నిలుపుదల చేయించాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ సంఘాల నాయకుల ఆకృత్యాలు అన్ని ఇన్ని కావు.. ప్రజల సమస్యల పరిష్కారాన్ని వదిలేసి అధికార పార్టీ భజన చేయడంలో ఆరితేరిపోయారు. మొన్న వెంకటరామిరెడ్డి… నిన్న గడల శ్రీనివాసరావు… రేపు మరొకరు… అధికారి పేరు మాత్రమే మారుతున్నది. పాదయాక్రాంతమైన వారి బతుకులు మాత్రం కాలుకు వేసుకునే చెప్పు స్థాయికి దిగజారి పోతున్నాయి.