Balineni Srinivas Reddy- YV Subbareddy: వైసీపీలో వివాదాలకు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించడం లేదు. అయితే అన్ని వివాదాలకు సీఎం జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డే కారణం కావడం కొత్త చర్చకు దారితీస్తోంది. వైవీ బాధిత వర్గంలో జగన్ అస్మదీయులు, ఆప్త మిత్రులు ఉండడం ప్రస్తావనార్హం . ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, విజయసాయిరెడ్డి ఎపిసోడ్లలో అందరి చూపు వైవీ సుబ్బారెడ్డి వైపే కనిపిస్తోంది. కీలక నాయకులందరూ పార్టీకి వైవీ వల్లే దూరమయ్యే అవకాశాలున్నాయని పార్టీలో కొత్త చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలక, అసంతృప్తి వెనుక ఉన్నది కూడా వైవీయే కావడం గమనార్హం. తాజాగా బాలినేని మరోసారి మీడియా ముందుకు వచ్చి వైవీకి వ్యతిరేకంగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.
తన మంత్రి పదవి పోవడానికి వైవీయే కారణమని బాలినేని అనుమానిస్తున్నారు. మంత్రి పదవి ఉన్నంత కాలం ప్రకాశం జిల్లాలో తనకు ఎదురేలేదనే రీతిలో బాలినేని హవా చెలాయించారు. మంత్రి పదవి నుంచి తనను తప్పించేసరికి ఆయనకు తత్వం బోధపడింది. తాను టిక్కెట్లు ఇప్పించిన వారే తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని.. హైకమాండ్ కు ఫిర్యాదుచేస్తున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలదన్నట్టు తనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ఆక్రోషించారు. దీని వెను వైవీ సుబ్బారెడ్డే ఉన్నారని అనుమానిస్తూ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయితే హైకమాండ్ నుంచి ఉలుకూ పలుకూ లేకపోవడంతో మరోసారి మీడియా ముందుకొచ్చి వైవీ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఎంపీ విజయసాయిరెడ్డితో వైవీ సుబ్బారెడ్డి లొల్లి పెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర రీజనల్ ఇన్ చార్జిగా విజయసాయిరెడ్డి ఉండేవారు. కానీ ఉన్నపలంగా విజయసాయిని తొలగించి ఆ స్థానంలో వైవీ సుబ్బారెడ్డిని కూర్చోబెట్టారు జగన్. అయిష్టతగానే వైదొలగిన విజయసాయి విశాఖతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇది మింగుడుపడని వైవీ మూడు రోజుల కిందట విజయసాయిరెడ్డి అనుచరుల్ని పార్టీ పదవుల నుంచి తొలగించారు . వెంటనే విజయసాయిరెడ్డి పార్టీ అనుబంధ సంఘాల ఇంచార్జ్ హోదాలో మళ్లీ వారిని పార్టీ పదవుల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తర్వాత .. సుబ్బారెడ్డి అసలు వారిని పార్టీ నుంచే సస్పెండ్ చేశారు. దీంతో ఈ పరిణామం ఇద్దరి నేతల మధ్య విభేదాలను మరింత ఆజ్యం పోసింది. కొత్త వివాదాలకు తారితీస్తోంది.
అయితే ఇదంతా జగన్ కు తెలిసే జరుగుతుందన్న అనుమానం నేతల్లో ప్రారంభమైంది. మొన్నటి బాలినేని ఎపిసోడ్ లో హైకమాండ్ దూతలు వచ్చినా పెద్దగా చర్చలు వర్కవుట్ కాలేదు. అందుకే బాలినేని తాజాగా మీడియా ముందుకొచ్చి వివాదం ముగియలేదని సంకేతాలిచ్చారు. తన వెనుక వైవీ సుబ్బారెడ్డి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అటు విజయసాయిరెడ్డి సైతం వైవీతో అమీతుమీకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వైవీని వ్యతిరేకిస్తున్న నాయకులు మాత్రం తాము జగన్ వెంటే నడుస్తామని చెబుతున్నారు. అయితే వైవీ వెనుక జగన్ ఉన్నారని తెలిస్తే మాత్రం అనూహ్య నిర్ణయాలకు సిద్ధపడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వైసీపీలో వైవీ చిచ్చుకు కారణమవుతున్నారు.