Pawan Kalyan- YCP: పవన్ మీటింగ్‌కు వైసీపీ ఖర్చు చేయండం ఏమిటి అని ఆశ్చర్య పోతున్నారా.. కాంగారు పడకండి.. అసలు విషయం ఏమిటంటే.. ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 11, 12 తేదీల్లో ఆయన తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఏపీలో బీజేపీకి జనసేన మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని నిర్వహించే సభకు ఏపీ సర్కార్ అధికారిక ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు మిత్రపక్షం అయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్, ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు ప్రధాని సభలో పాల్గొననున్నారు.

రూ.10 కోట్లకుపైగా ఖర్చు..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు విశాఖ పర్యటనకు రూ.10కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు అంచనా వేస్తోంది. ఈ మేరకు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల నుంచి కనీసం 2 లక్షల మందిని సభకు తరలించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. పది గంటల లోపే జనాలంతా స్టేడియంకు చేరుకోవాలి. వేకువజాము నుంచి దూర ప్రాంతాల బస్సులు విశాఖకు రావాల్సి ఉంటుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను సభాస్థలికి కొద్దిదూరంలో నిలిపివేసి అక్కడి నుంచి జనాలు నడక మార్గంలో చేరుకునేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విజయవాడకు చెందిన సంస్థ ఏర్పాట్లు..
మోదీ సభ ఏర్పాట్లను విజయవాడకు చెందిన ఓ సంస్థ చేసింది. దీని కోసం రూ.7 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వేదిక ఏర్పాటు, సౌండ్ సిస్టం, వీఐపీ గ్యాలరీ, జనాలు కూర్చొనేందుకు కుర్చీల ఏర్పాటు, షెడ్డుల నిర్మాణం వంటి పనులు చేపడుతున్నారు. ఇంజినీరింగ్ కళాశాల మైదానాన్ని చదును చేయడంతోపాటు తొలగించిన వృక్షాలను తరలించారు.
ఏర్పాట్ల పరిశీలనకు 24 కమిటీలు
ప్రధాని పర్యటనకు జిల్లా అధికారులతో 24 కమిటీలు ఏర్పాటు చేశారు. జీవీఎంసీ కమిషనర్, పోలీసు కమిషనర్, జేసీ తదితర సీనియర్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించారు. సభ ఏర్పాట్లను ఆయా కమిటీలు పర్యవేక్షిస్తాయి. బహిరంగ సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహారం ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి విమానాశ్రయంలో అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు పర్యటనకు ఎటువంటి అవరోధాలు ఎదురుకాకుండా ఆయా కమిటీలు పనిచేయనున్నాయి.

మారిపోయిన విశాఖ రూపురేఖలు..
మొన్నటి వరకు ఎక్కడి గొంగళి అక్కడే అనే విధంగా పనులు… ఇప్పుడు ప్రధాని మోదీ రాకతో ఎక్స్‌ప్రెస్ రైలులా పనులు చకచక జరిగాయి. అంతకు ముందు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న అధికారులు… ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ప్రధాని వస్తున్నారంటే ఎంత హుషారుగా పనులనుఉరకలెత్తించారు. దీంతో ప్రజలు అబ్బబ్బ ఏమి హుషారు ఏమి హుషారో అని ఆశ్చర్యపోతున్నారు. ప్రధాని మోదీ వచ్చి వెళ్లే మార్గంలో ఎటువంటి గుంతలు లేకుండా కొత్తగా రోడ్లు వేశారు. నూతన హంగులతో విశాఖపట్నం కనువిందు చేస్తుంది. ఎక్కడికి అక్కడ రంగులు వేశారు. ఏయూ ఇంజనీరింగ్ ప్రాంగణం అంతా నూతన శోభ సంతరించుకుంది. ప్రధాని పర్యటనతో విశాఖ అంతా కూడా ఒక్కసారిగా కలకలాడుతుంది.