Varahi Registration: ఏపీ పాలిటిక్స్ లో పవన్ ప్రచార రథం ‘వారాహి’ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇష్యూకు ఒక ఫుల్ స్టాప్ పడినట్టు కనిపిస్తోంది. పవన్ తన అభిరుచికి తగ్గట్టు.. అన్ని వసతులతో ప్రచార రథాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ వాహనం రంగు, ఇతర విషయాలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. రాజకీయంగా వివాదం రాజుకుంది. తాజాగా ఈ వాహనానికి అన్నిరకాల అనుమతులు లభించాయి. ఇందుకు సంబంధించి లాంఛనాలన్నింటినీ తెలంగాణ రవాణా శాఖ పూర్తిచేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సైతం పూర్తయ్యింది. టెంపరరీ నంబరు సైతం ఇచ్చేసింది. వాహనం కలర్, ఎత్తు, సామర్థ్యం.. ఇలా అన్నింటిపై నడిచిన వివాదాలు ఉత్తివేనని తేల్చేసింది. పవన్ తన ప్రచార రథంతో యుద్ధానికి సిద్ధమని సోషల్ మీడియాలో ప్రకటించిందే తరువాయి ‘వారాహి’పై సన్నాయి నొక్కులు ప్రారంభమయ్యయి. అలివ్ గ్రీన్ రంగు వేయడం ఏమిటని స్టార్ట్ చేశారు. అది లారీ చాసీని బస్సుగా మార్చేశారని చెప్పుకొచ్చారు. చివరకు టైర్లపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అవి మైనింగ్ వాహనాలకు వినియోగించేవి అని.. సాధారణ రహదారులపై తిరగడానికి పనికిరావంటూ చెప్పేశారు. పైగా వాహనం సామర్థ్యానికి మించి రూపొందించారని.. ఎత్తు కూడా పరిమితికి మించి ఉందని ప్రచారం చేశారు.

అయితే ఈ ఆరోపణలన్ని ఏపీ సమాజం నుంచి.. అందునా అధికార వైసీపీ బ్యాచ్ నుంచే ఎక్కువగా వినిపించాయి. కానీ ఇవేవీ తెలంగాణ ట్రాన్స్ పోర్టు అధికారులు చెవికెక్కించుకోలేదు. ఇతర వాహనాల మాదిరిగానే నిబంధనలకు లోబడి రూపొందించడంతో రోజువారి ప్రక్రియలో భాగంగా వారాహికి కూడా
రిజిస్ట్రేషన్ చేశారు. టెంపరరీ నంబరు కూడా కేటాయించారు. ఏపీ నుంచి వస్తున్న ప్రచారంలో నిజం లేదని తేల్చేశారు. నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశామని వివరణ ఇచ్చారు. వారాహికి రిజిస్ట్రేషన్ నెంబర్ టీఎస్ 13 ఈఎక్స్ 8384 నంబరు కేటాయించారని తెలుస్తోంది. వారాహి కలర్ ఆలివ్ గ్రీన్ కాదని.. ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్థారించారు. నిబంధనల మేరకు ఉన్నందునే రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వివరణ ఇవ్వడంతో ఈ వివాదాన్ని తెరదించినట్టయ్యింది.
తాజాగా తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్టు కమిషనర్ పాపారావు వారాహి వాహన వివాదంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు విషయాలను వెల్లడించారు. రూ.5000 ప్రభుత్వానికి రుసుం చెల్లించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నారని చెప్పారు. సాధారణంగా స్పెషల్ నెంబర్స్ అనేవి ఈజీగా ఎవరికి అలర్ట్ కావు అలాంటివి కావాలి అంటే ప్రభుత్వానికి 5000 కట్టి మనకు కావాల్సిన నెంబర్స్ తీసుకోవచ్చు.వారాహికి కూడా 5000 కట్టి 8384అనే రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారని వెల్లడించారు. డిఫెన్స్ కు చెందిన వాహనాలకు మాత్రం అలివ్ గ్రీన్ రంగు ఉంటుంది. మరే ఇతర వాహనాలకు అలివ్ గ్రీన్ పెయింట్ వేయకూడదన్న నిబంధన ఉంది. అయితే పవన్ వారాహి వాహనంపై వేసిన కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అని నిర్థారణ కావడంతో రంగు వివాదం ముగిసినట్టే.

పవన్ కళ్యాణ్ ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టడానికి ఆసక్తికరమైన కారణం ఒకటి ఉంది. దుష్టశక్తుల నుంచి ఈ రాష్ట్రాన్ని విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో ప్రత్యేక వాహనాన్ని రూపొందించారు. వారాహి అనే పేరు పెట్టడం వెనుక ఒక సదుద్దేశ్యం ఉందని అటు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. వారాహి అంటే దుర్గాదేవి సప్త మాతృకల్లో ఒకరు. రాక్షసులను సంహరించేందుకు దుర్గా మాత అమ్మవారు బ్రహ్మాది దేవతల్లోని శక్తులు మూర్తులు ధరించి వచ్చినట్టుగా ‘దేవీ మహాత్యం’ వర్ణిస్తోంది. ఒరటి బ్రహ్మలోని శక్తి బ్రహ్మి, రెండు విష్ణు శక్తి ‘వైష్ణవి’, మహేశ్వరుని శక్తి ‘మహేశ్వరి’, స్కందుని శక్తి కౌమారి, వారాహ స్వామి వారాహి, ఇంద్రుని శక్తి ఐంద్రి, అమ్మవారి భ్రూమధ్యం కనుబొమల నుంచి ఆవిర్భవించిన కాళీ…వీటినే సప్త మాతృకలు అంటారు. అయితే ఇందులో వారాహ ప్రదాయినిది ప్రత్యేక స్థానం. వారాహ అమ్మవారు అన్నప్రదాయిని, చేతిలో ఒకవైపు నాగళి, రోకలి అన్నోత్పత్తిని, ఆయుధాలను సంధించే సంకేతాన్ని చూపినట్టుట్టుంది. అందుకే పవన్ తన వాహనాన్ని వారాహి అని పేరు పెట్టారు. ఇప్పుడు అన్నిరకాల క్లియరెన్స్ రావడంతో మంచి రోజున తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయుడి సన్నిధిలో పూజలు చేసి ప్రారంభించనున్నారు. మొత్తానికైతే వాహన పూజ చేయకముందే… వారాహిని ప్రపంచం చూసేసింది. ప్రకంపనలు సృష్టించింది. మున్ముందు తనను వేదికగా చేసుకొని ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయని రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపింది.