Etela Rajender: ఎంతో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉన్న ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఫలితాలు వెలువడే సమయంలో అంతా టీవీలకు, మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. రౌండ్ రౌండ్‌కు ఓట్లను తెలుసుకున్నారు. హుజూరాబాద్‌లో పోటీ, ప్రచారం ఎంత రసవత్తరంగా జరిగిందో.. ఎన్నికల ఫలితాలు కూడా అంతే రసవత్తరంగా వచ్చాయి. ప్రతీ రౌండ్‌లో కొద్ది పాటి మెజారిటీ సాధిస్తూ వచ్చారు ఈటెల రాజేందర్. ఒక్కసారిగా 12వ రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు లీడింగ్ మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. చివరిగా ఎవరూ ఊహించని 24 వేల మెజారిటీతో ఈటెల భారీ విజయం సాధించారు. దీంతో వరసగా 7వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా ఈటెల చరిత్ర సృష్టించారు.

టీఆర్ఎస్ తొందరపడి తప్పు చేసిందా ?
ఈటెల రాజేందర్ విజయం టీఆర్ఎస్ ముఖ్య నేతలను కలవర పెడుతోంది. ఆయన విషయంలో తొందరపడి తప్పు చేశామా అనే భావనలో వారు ఆలోచిస్తున్నట్టు సమాచారం. హుజూరాబాద్‌లో కచ్చితంగా టీఆర్ఎస్ దే విజయం అని ఆ పార్టీ నాయకులు మొదటి నుంచి భావించారు. కానీ అక్కడ విజయం అంత తేలిక కాదని భావించిన పార్టీ అధిష్టానం.. ఈ ఎన్నికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గొర్రెల పంపిణీ, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, కుల సంఘాల భవనాలకు ప్రొసీడింగ్ పత్రాలు వంటివి మంజూరు చేసింది. వీటి అన్నింటి కంటే ముఖ్యమైనది దళితబంధు పథకం. ఈ ఒక్క పథకమే టీఆర్ఎస్‌కు గంప గుత్తగా 60-70 వేల ఓట్లు తీసుకొస్తుందని భావించారు. ఈ ఎన్నికలో ఓడిపోతే తమ ప్రభుత్వమేమీ పడిపోదని అనేక సార్లు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ప్రస్తావించినా.. హుజూరాబాద్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఓ సందర్భంలో సీఎం కేసీఆర్ కూడా పరోక్షంగా హుజూరాబాద్ ఎన్నికపై స్పందించారు. అవును తామది రాజకీయ పార్టీ అని, తాము కూడా డెఫినెట్‌గా రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. అంటే దీనిని బట్టే అర్థం అవుతోంది హుజూరాబాద్ ఎన్నికను సీఎం కేసీఆర్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో.
Also Read: TRS: టీఆర్‌ఎస్‌కు అప్పుడే ‘ఈటల’ సెగ
ఈటల రాజేందర్ విజయం వల్ల టీఆర్ఎస్‌లోని నాయకులు సమాలోచనలు చేస్తున్నారు. పైకి ఓటమికి కుంగిపోం, గెలిస్తే పొంగిపోం, ఈ ఒక్క సీటుతో ప్రభుత్వానికి ఒరిగేదేమి లేదని చెబుతున్నా.. లోపల మాత్రం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా ముఖ్య నాయకులు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు.
పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్న ఈటెలపై ఒక్క సారిగా అవినీతి ఆరోపణలు రావడం దానిపై సీఎం కేసీఆర్ స్పందించిన తీరు ఆ పార్టీ నాయకులతో సహా రాష్ట్ర ప్రజలు, హుజూరాబాద్ ఓటర్లు గమనించారు. అందుకే ఈటెల అంత ఘన విజయం సాధించారని భావిస్తున్నారు. చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ఇలా స్పందించని సీఎం కేసీఆర్, ఒక్క ఈటెలను మాత్రమే ఇలా టార్గెట్ చేయడం హుజూరాబాద్ ప్రజలను బాధించింది. పార్టీని దిక్కరించడం, గులాబీ జెండా ఓనర్లం అంటూ మాట్లాడటం వంటి బహిరంగ ప్రకటనలు చేస్తే పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని గానీ ఇలా ఒక్కడిని చేసి, కక్ష పూరితంగా వ్యవహిరించడం సరైంది కాదని భావించారు. ఈ పోటీ ఈటెలకు, గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మధ్య జరిగిన పోటీగా ఎవరూ చూడలేదు. ఈ పోటీ ఈటెల రాజేందర్‌కు, సీఎం కేసీఆర్ కు మధ్య జరిగిన పోటీగానే అందరూ భావించారు. అందుకే ఇద్దరూ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
Also Read: TRS: కేసీఆర్ కొరివితో తలగొక్కున్నాడా? ఇది టీఆర్ఎస్ పతనానికి దారితీస్తుందా?