Stalin And Chandrababu: మొన్న చంద్రబాబు.. నిన్న స్టాలిన్.. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను నియంత్రించి తప్పు చేశాయా? త్వరలో జరిగే పరిణామాలు ఏంటి?

"ఒక్కొక్కరు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలను కనండి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. దేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది". ఇవి ఆ మధ్య చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.." వెనుకటి రోజుల్లో నూతన దంపతులకు 16 సౌభాగ్యాలు కలగాలని పెద్దలు ఆశీర్వాదాలు ఇచ్చేవారు. ఆ 16 సౌభాగ్యాల కంటే 16 మందిని కనడమే ఇప్పుడు అసలైన ఆశీర్వాదం" ఇవీ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్న మాటలు.

Written By: Anabothula Bhaskar, Updated On : October 22, 2024 3:50 pm

Stalin And Chandrababu

Follow us on

Stalin And Chandrababu: ఈ మాటల్ని రాజకీయ కోణంలో కాకుండా.. సామాజిక కోణంలో చూస్తే దక్షిణాది స్థితిగతులు బయటి ప్రపంచానికి.. ముఖ్యంగా మిగతా భారతదేశానికి తెలుస్తాయని విశ్లేషకులు అంటున్నారు. ఒకప్పుడు పెరిగిన జనాభా కు సరిపడా ఆహార ధాన్యాలు లేకపోవడంతో.. జనాభా నియంత్రణ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే దీనిని దక్షిణ భారతదేశంలో పటిష్టంగా అమలు చేశారు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలలో జనాభా తగ్గిపోయింది. కానీ ఇదే సమయంలో మిగతా భారత దేశంలో జనాభా పెరిగింది. అయితే ఇది ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతిబంధకంగా మారుతోందని చర్చ నడుస్తోంది. ఎందుకంటే త్వరలో జన గణన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. కొత్త జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అది కనుక నిజమైతే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే పార్లమెంటుతోపాటు దేశ రాజకీయాలలో ఉత్తరాది వారి ప్రాబల్యం పెరిగింది. పైగా కేంద్రంలో అధికారంలో ఎవరుండాలనే నిర్ణయం తీసుకోవడంలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర తగ్గిపోతుందని తెలుస్తోంది.

1971 జనాభా లెక్కల ప్రకారం..

మనదేశంలో 1972లో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దానికి 1971 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఇప్పుడు 2026 లో మరోసారి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి జన గణన ఇంకా ప్రారంభం కాకపోయినప్పటికీ.. 2026లో కాకపోయినా.. ఆపై వచ్చే ఎన్నికల నాటికి పునర్విభజన జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అయితే సీట్ల సంఖ్యను పెంచకుండా పునర్విభజన చేపడుతారా? సీట్ల సంఖ్యలో పెంచుతారా అనే వాటిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ సీట్ల సంఖ్య పెంచితే పార్లమెంటు స్థానాలు 848కు చేరుకుంటాయి. ఒకవేళ చేయను పక్షంలో సీట్ల సంఖ్య 543 వరకే ఉంటాయి. జనాభాకు తగ్గట్టుగా కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలు పెరిగి.. మరికొన్ని స్థానాలలో తగ్గే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ఉత్తరాది హవా కొనసాగుతుంది

జనాభా ప్రాతిపదికన పార్లమెంటు స్థానాల పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలకు లాభం జరిగే అవకాశం ఉంది. అదే జరిగితే ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో భారీగా పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాలలో ప్రస్తుతం 120 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. జనాభాపరంగా పునర్విభజన జరిగితే ఆస్థానాలు 222 కు పెరుగుతాయి. ఈ ప్రకారం పెరుగుదల 85% వరకు చేరుకుంటుంది. ఇక ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. అవి కాస్త 143 కు చేరుకునే అవకాశం ఉంది. బీహార్ రాష్ట్రంలో 40 పార్లమెంటు స్థానాలు ఉండగా.. అవి 79కి పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాలలో పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి. ఈ ప్రకారం చూసుకుంటే ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలే కేంద్ర రాజకీయాలను శాసించే అవకాశం ఉంటుంది.

దక్షిణాది రాష్ట్రాలకు దెబ్బ

దక్షిణాది రాష్ట్రాలలో 1970 నుంచి జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలను అమలు చేశాయి. వీటిని దక్షిణాది రాష్ట్రాలు స్పష్టంగా పాటించాయి. అయితే ఆ జనాభా తగ్గుదల దక్షిణాది రాష్ట్రాల పాలిట శాపంగా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేపడితే దేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రాబల్యం తగ్గుతుంది. ఒకవేళ పార్లమెంటు స్థానాలు 848 కు పెరిగితే.. దక్షిణాది రాష్ట్రాలలో నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 129 నుంచి 165 కు పెరుగుతాయి. అంటే 28% సీట్లు మాత్రమే పెరుగుతాయి. తెలంగాణలో 17 నుంచి 23 కి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 నుంచి 31కి.. కర్ణాటక రాష్ట్రంలో 28 నుంచి 41కి.. తమిళనాడు రాష్ట్రంలో 39 నుంచి 49 కి పెరుగుతాయి. ఇక కేరళ ప్రకారం చూసుకుంటే ఉన్న 20 సీట్లలో పెద్దగా పెరుగుదల ఉండదు.