
ఒకప్పుడు బీజేపీతో అంటకాగిన టీడీపీ ఇప్పుడు అనాథ అయింది. ఒకప్పుడు దర్జాగా బతికిన తమ్ముళ్లు ఇప్పుడు అధికారం కోల్పోయి బిత్తర చూపులు చూస్తున్నారు. అంతేకాదు.. అధికార పార్టీలోనో.. మరో పార్టీ బీజేపీలోనో చేరాలని అనుకుంటున్నారు. ఇప్పటికే అలా చాలా మంది టీడీపీని వీడారు కూడా. కొంత మంది ముఖ్యులు చంద్రబాబుకు రాంరాం చెప్పి బీజేపీలో చేరిన వారికి పెద్దగా ప్రాధాన్యత దొరకడం లేదు. ఎలాగూ వలస వచ్చిన వారేనని బీజేపీ లైట్ తీసుకుంటోందట.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అధిష్టానం సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించింది. అయితే.. సోము బాధ్యతలు తీసుకున్నాక తన దూకుడును పెంచారు. అంతకుముందు టీడీపీ నుంచి వలస వచ్చిన వారంతా కొద్ది రోజులు హల్‌చల్ చేశారు. సోము వచ్చాక ఇప్పుడు వారి నోళ్లకు తాళాలు పడ్డాయి. ఆ మధ్య ఓ కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఒకాయన తెగ హడావుడి చేసేవారు. ఇప్పుడు కనీసం మీడియా ముందు చూద్దామన్నా కనిపించడం లేదు.
కేంద్రంలో మంత్రులుగా వెలగబెట్టి బీజేపీ కండుగా కప్పుకున్న వారు కూడా ఇప్పుడు కళా విహీనం అయ్యారు. వారికి జాతీయ స్థాయిలో పలుకుబడిలేదు, ఏపీలో పదవులు లేవు అన్నట్లుగా తయారైంది. వారి రాజకీయ జీవితం ఉల్టా పల్టా కొట్టింది. కనీసం పార్టీ పదవుల్లో అయినా కుదురుకుందామనుకుంటే అది కూడా సాధ్యపడడం లేదంట. దాంతో వారిలో అసంతృప్తి పెరుగుతోందట. ఇంకొంత మంది నాయకులైతే మొన్నటివరకు తామే బీజేపీ అన్నట్లుగా తెగ ఫోకస్ అయ్యారు. ఏకంగా బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పదవికే గురి పెట్టేశారు. ఆ పదవి చేతిలో ఉంటే చాలు జగన్‌ను ముప్పతిప్పలు పెట్టవచ్చని అనుకున్నారు. ఢిల్లీలో ఎలాగూ బీజేపీనే అధికారంలోకి ఉంది కాబట్టి రాష్ట్ర పదవి దక్కితే ఆడేయొచ్చని ఊహించుకున్నారు. కన్నా పోయి సోము వచ్చేసరికి వారి ఆశలకు గండి పడినట్లైంది. కనీసం పార్టీలో ఏవైనా కీలక పదవులు ఇస్తారా అని ఎదురుచూశారు. కానీ.. సోము మాత్రం ఫక్త్ బీజేపీ నేతలతోనే కమిటీని కూర్పు చేసి వదిలారు.
టీడీపీని వీడీ బీజేపీలోకి వచ్చాక మునుపటి గ్రాఫ్ కూడా పడిపోయిందని ఇప్పుడు ఆ నేతలు భావిస్తున్నారట. ఇక ఏపీలో బీజేపీ తీసుకుంటున్న అజెండా కూడా ఆ పార్టీలో చేరిన తమ్ముళ్లకు ఇబ్బందిగానే ఉంది. టీడీపీ నేతలను టార్గెట్ చేసిన బీజేపీ.. వారికి కాషాయం కండువాలు వేస్తూనే ఉంది. అయితే.. కాషాయం కండువా కప్పుకున్నా వారికి మొదటి పంక్తిలో కూర్చునే చాన్స్ లేదని మాత్రం చెప్పేస్తున్నారు.