https://oktelugu.com/

మోడీ.. ప్రభుత్వ ఆస్తులను పంచిపెడుతున్నారా?

ప్రధాని మోడీ దాచిపెడుతున్నారా? దోచిపెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను పప్పూ బెల్లాల్ల పంచిపెడుతున్నారా? 20 లక్షల కోట్ల ప్యాకేజీ మాటున మోడీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు.. మేధావి వర్గాలు.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ ప్యాకేజీ చూస్తే సర్వం ప్రైవేటు పరం చేస్తుండడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చి.. లాభాల్లో ఉన్న సంస్థలను, ఖనిజాలు, గనుల యజమాన్యాలను కూడా వదిలించుకోవడం దేనికి […]

Written By:
  • admin
  • , Updated On : May 16, 2020 / 08:23 PM IST
    Follow us on

    ప్రధాని మోడీ దాచిపెడుతున్నారా? దోచిపెడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులను పప్పూ బెల్లాల్ల పంచిపెడుతున్నారా? 20 లక్షల కోట్ల ప్యాకేజీ మాటున మోడీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు.. మేధావి వర్గాలు.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 4వ ప్యాకేజీ చూస్తే సర్వం ప్రైవేటు పరం చేస్తుండడం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరి ప్రభుత్వానికి బాగా ఆదాయం వచ్చి.. లాభాల్లో ఉన్న సంస్థలను, ఖనిజాలు, గనుల యజమాన్యాలను కూడా వదిలించుకోవడం దేనికి సంకేతం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

    ఇటీవలే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పేరిట కేంద్రంలోని మోడీ సర్కార్ 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 4వ రోజు కూడా వివిధ రంగాలకు ప్యాకేజీలు, సంస్కరణలను ప్రకటించారు. ఈ మేరకు సంచలన నిర్ణయాలను వెలువరించారు. వివిధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులకు తలుపులు బార్లా తీశారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేశారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

    * ప్రైవేటుకు 6 ఎయిర్ పోర్టులు అర్పణం
    ఎయిర్ పోర్టుల నిర్వహణను మోడీ ప్రభుత్వం వదిలించుకుంటోంది. లాభాలు వస్తున్నా సరే ప్రైవేటుపై ప్రేమ చూపిస్తోంది. తాజాగా దేశంలోని మరో 6 ఎయిర్ పోర్టులను సైతం ప్రైవేటుకు అప్పగిస్తున్నామని.. తద్వారా ప్రపంచస్థాయి విమానాశ్రయాలుగా రూపుదిద్దేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీనివెనుక పరమార్థం ఏంటో నిపుణులకు కూడా అంతుబట్టడం లేదు. ఇప్పటికే దేశంలో 12 ఎయిర్ పోర్టులు పీపీపీ విధానంలో ప్రైవేటు కంపెనీలకు కేటాయించామన్నారు. విమానాశ్రయాల అభివృద్ధికి రూ.2300 కోట్లు కేటాయిస్తామన్నారు. 12 నూతన ఎయిర్ పోర్టుల నిర్మాణానికి 13వేల కోట్లు కేటాయిస్తామన్నారు. మరి ఆ ఎయిర్ పోర్టులను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్నగా మారిపోయింది.

    *బొగ్గురంగంలో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత
    బొగ్గురంగం ఇన్నాళ్లు ప్రభుత్వం ఆధీనంలో ఉండేది. సింగరేణి, కోల్ ఇండియా చేతుల్లోనే బొగ్గు గనులుండేవి. కార్మికులకు లక్ష వరకు జీతాలు.. సంక్షేమం, హక్కులు ఉండేవి. ఇప్పుడు వాటిని కాదని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ సర్కార్ చర్యలు తీసుకోవడం కార్మికులను, యాజమాన్యాలను షాక్ కు గురిచేసింది. బొగ్గురంగంలో ప్రభుత్వానికి ఉన్న గుత్తాధిపత్యాన్ని తొలగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇక నుంచి ఎవరైనా బొగ్గు వేలంలో పాల్గొనవచ్చని.. బహిరంగ మార్కెట్ లో బొగ్గును విక్రయించుకోవచ్చని.. 50 బ్లాకులను ప్రైవేటుకు తక్షణమే కేటాయిస్తున్నామన్నారు. బొగ్గు తవ్వకాలు, మౌళిక వసతులకు రూ.50వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ఇలా మంచి లాభాలిచ్చే బొగ్గు సంస్థలను.. జాతి సంపదను మోడీ సర్కార్ ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నదన్నది అనుమానాలకు తావిస్తోంది. ప్రైవేటు దోచిపెట్టడానికా అని విమర్శలు మొదలయ్యాయి.

    *ఖనిజ రంగంలోనూ ప్రైవేటు పరం
    ఇక ఖనిజ పరిశ్రమల రంగంలో 500 మైనింగ్ బ్లాకులను వేలం ద్వారా ప్రైవేటు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. అల్యుమినియం పరిశ్రమలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఇక బాక్సైట్, బొగ్గు బ్లాకులకు సంయుక్త వేలం నిర్వహిస్తామన్నారు. విలువైన బాక్సైట్, అల్యుమినియం కూడా ప్రైవేటుకు ధారదత్తం చేస్తే ప్రైవేటు వ్యక్తులు బాగుపడడం తప్ప కార్మికులకు, ప్రభుత్వాలకు మిగిలేది ఏమీ ఉండదు.

    *విద్యుత్ డిస్కంలు ప్రైవేటీకరణ
    విద్యుత్ సంస్థలు నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలో ఉండేది. వాటి ద్వారా ఉచిత విద్యుత్ కు ప్రభుత్వాలు తెరతీశాయి. ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే ఆ సంస్థలు ముక్కుపిండి వసూలు చేస్తాయి. రైతులకు ఉచిత విద్యుత్ కు ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్రాలు దీనిపై అభ్యంతరం తెలుపుతున్నాయి. ఉత్పత్తిదారులకు సకాలంలో చెల్లింపులు చేసేలా డిస్కంలలో సంస్కరణలు తెస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో డిస్కమ్ లను ప్రైవేటీకరిస్తున్నామన్నారు. నష్టాలను వినియోగదారులపై పడకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ డిస్కలు ఆర్థికభారంతో సతమతమవుతున్నాయని.. వాటిని గాడిన పెట్టడానికి రూ.90వేల కోట్లను కేంద్రం కేటాయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేటు పరం చేస్తున్నామని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా స్మార్ట్ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను ప్రవేశపెడుతామని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించి విద్యుత్ వినియోగదారులకు షాకిచ్చారు. ఇలా ప్రైవేటుకు అప్పగిస్తే విచ్చలవిడిగా విద్యుత్ వినియోగదారులను దోచుకోవడం తప్పితే సంక్షేమం ఆలోచించవని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయంపై మండిపడుతున్నాయి.

    *రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఐల పరిమితి పెంపు
    దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ రంగంలో ఎఫ్.డీ.ఐల పెంపు మన రక్షణరంగ రహస్యాలకు పెనుముప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రక్షణ రంగంలో ఏకంగా ఎఫ్.డీ.ఐ పరిమితిని 49శాతం నుంచి 75శాతానికి పెంచుతున్నామని ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. మేకిన్ ఇండియాను ప్రోత్సహించి రక్షణ రంగంలో స్వయం ప్రతిపత్తి, జవాబుదారితనం పెంచుతామన్నారు.

    *ప్రభుత్వంతో సంక్షేమం.. ప్రైవేటుతో సంక్షామం..
    ప్రభుత్వంలో ఉంటే సంక్షేమం ఉంటుంది.కార్మికులకు, ప్రభుత్వాలకు లాభదాయకం గా ఉంటుంది. అదే ప్రైవేటుకు అప్పగిస్తే వారికి దోచుకున్నోళ్లకు దోచుకున్నంత సంపద అవుతుంది. ఉదాహరణకు సింగరేణి ప్రభుత్వ సంస్థలో ఒక్కో కార్మికుడికి జీతం 80వేల వరకు ఉంటుంది. అదే ప్రైవేటు పరం చేస్తే ముసలివాళ్లకు రిటైర్ మెంట్ ప్రకటించి 20 వేలకు మించి జీతాలివ్వరు. యంత్రీకరణ చేసి ఉన్న ఉద్యోగాలను తీసేస్తారు. ప్రభుత్వంలో ఉంటే కార్మిక హక్కులు, సంక్షేమంతోపాటు అభివృద్ధి సాధ్యం.. అదే ప్రైవేటుకు గనులు, సంస్థలు ఇస్తే వాటిదే ఇష్టారాజ్యం.. ఉద్యోగాలకు భద్రత ఉండదు.. జీతాలు ఉండవు.. ప్రైవేటుకు దోచుపెట్టేందుకేనా ఈ నిర్ణయాలు అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు..

    -నరేశ్ ఎన్నం