CM Jagan: ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై విశేషంగా ప్రభావం చూపాయి. అక్కడ అధికార పక్షానికి షాక్ తగలడంతో.. ఏపీలో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించారు. అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని తెరపైకి తెస్తున్నారు. అందులో భాగంగా తొలి దశలో 11 నియోజకవర్గాలకు సంబంధించి ఇన్చార్జిలను మారుస్తూ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
చిలకలూరిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినిని గుంటూరు వెస్ట్ కి మార్చారు. రాజేష్ నాయుడుకు చిలకలూరిపేట ఇన్చార్జిగా నియమించారు. మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్థానాన్ని కూడా మార్చారు. ఆమెను ప్రత్తిపాడు నుంచి తప్పించారు. తాడికొండకు ఇన్చార్జిగా నియమించారు. ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్ కుమార్ ను నియమించారు. కొండపికి ఆదిమూలపు సురేష్, వేమూరుకు అశోక్ బాబును ఇంచార్జిగా నియమించారు. సంతనూతలపాడుకు మెరుగు నాగార్జునను, రేపల్లెకు ఈవూరు గణేష్ ను, అద్దంకి కి పాణం హనిమిరెడ్డికి బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో బీసీ నేత గంజి చిరంజీవిని ఇన్చార్జిగా నియమించారు. గాజువాక ఇన్చార్జిగా ఉన్న దేవన్ రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో రామచంద్రరావుకు బాధ్యతలు అప్పగించారు. ఐ కమాండ్ అకస్మాత్తుగా ఈ మార్పులు చేయడంపై అధికార పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు తేలుతోంది. ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల మార్పు అనివార్యంగా కనిపిస్తోంది. దాదాపు 50 మంది అభ్యర్థులను మార్చుతారని ప్రచారం జరుగుతుంది.
వై నాట్ 175 అన్న నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్.. వెనుకబడిన ఎమ్మెల్యేలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇప్పటికే వారికి చాలా విధాలుగా సంకేతాలు ఇచ్చారు. అయితే కీలక మంత్రులను సైతం స్థాన చలనం కల్పించనున్నట్లు తెలుస్తోంది.తెలంగాణలో వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు టిక్కెట్లు ఇచ్చి కెసిఆర్ చేతులు కాల్చుకున్నారు. వారిపై వ్యతిరేకతతో అధికారాన్ని కోల్పోయారు. ఏపీలో అటువంటి పరిస్థితి రాకుండా జగన్ ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయ నేతలను గుర్తిస్తున్నారు. ఈ లెక్కన 40 నుంచి 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మారనున్నట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.