ఎంతో హోరాహోరీ పోరు మధ్య తిరుపతి ఉప ఎన్నిక ముగిసింది. ఈ సీటును ఎలాగైనా గెలుచుకోవాలని అన్ని పార్టీలూ చివరివరకూ ప్రయత్నాలు చేశాయి. దీనికి సంబంధించిన ఫలితాలు ఇంకా రాలేదు. అయితే.. ఈ ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో భారీ ఎత్తున మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ–జనసేనలపై ఆ ప్రభావం పడనుంది.
ఎవరు ఔనన్నా కాదన్నా ఏపీలో బీజేపీ–జనసేనలు మిత్రపక్షంగా ఉంటున్నాయి. ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్‌తోనే ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. అలాగే తిరుపతి ఉప ఎన్నికలోనూ జనసేన బరిలోకి దిగకుండా బీజేపీకి మద్దతుగా నిలిచింది. ఉమ్మడి అభ్యర్థిగా రత్నప్రభను రంగంలోకి దింపారు. అయితే.. ఈ స్థానానికి జనసేన పోటీ చేయాలని ముందు నుంచీ అనుకున్నా.. కుదరలేదు. చివరకు పట్టుబట్టి మరీ బీజేపీనే తన మాట నెగ్గించుకుంది. పవన్ కల్యాణ్‌ను ఒప్పించి మరీ బరిలో నిలిచింది.
అయితే.. పవన్ కల్యాణ్ కూడా రత్నప్రభకు మద్దతుగా ఒక విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఒక తిరుపతి సభలోనే పవన్ కల్యాణ్ పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆద్యంతం వైసీపీనే టార్గెట్ చేశారు. ఎక్కడా చంద్రబాబు ఊసెత్తలేదు.
ఈ క్రమంలో జనసేన ఓటు బ్యాంకు బీజేపీకి పడిందా లేదా అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ కనిపిస్తోందట. వీరి పొత్తులో భాగంగా జరుగుతున్న అతి పెద్ద ఎన్నిక కూడా ఇదే. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్’ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా గల్లతైంది. వేరే అభ్యర్థికి దీన్ని కేటాయించారు. బీజేపీ కమలం గుర్తు మీదనే ఇక్కడ బీజేపీ-జనసేన పోటీపడ్డాయి. నిజానికి తిరుపతిలో బీజేపీ కంటే జనసేనకే ఎక్కువ బలం ఉందన్న టాక్ ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్లతోపాటు పవన్ అభిమానులు, బలిజలు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో జనసేన కార్యకర్తలు పెద్దగా ఎక్కడా పాల్గొనలేదనే టాక్ ఉంది. దీంతో జనసేన ఓట్లు కూటమి అభ్యర్థికి పడ్డాయా..? లేదా..? అనేది ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికైతే పోరు ముగిసింది. రిజల్ట్ వస్తే కానీ అసలు విషయం తెలియదు. మొత్తంగా బీజేపీ, జనసేనల రాజకీయ భవితవ్యం మాత్రం ఓ రిజల్ట్ మీదనే ఆధారపడి ఉన్నట్లుగా అర్థమవుతోంది.