CM Jagan: ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయంలో సీఎం జగన్ కఠినంగా ఉన్నారా? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టినట్టేనా? ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని సైతం తప్పించినట్టేనా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఆ ఇద్దరి విషయంలో సీఎం జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రీజనల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయ్ సాయి రెడ్డికి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరోసారి ఎంపీగా పోటీ చేయాలంటే కొన్ని రకాల షరతులు విధించినట్లు సమాచారం. బాలినేని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడే ఉద్దేశం లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. తనంతట తాను వచ్చి కలిస్తే మాట్లాడతానని.. లేకుంటే మాత్రం వదిలేయండి అని విజయసాయిరెడ్డికి ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఒంగోలు ఎంపీ సీట్లు తనకు కేటాయించాలని వైవి సుబ్బారెడ్డి కోరుతున్నారు. అదే సమయంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పదే పదే చెప్పుకొస్తున్నారు. అయిన దానికి కాని దానికి బాలినేని రక్త చేస్తున్నారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డితో కలిసి పార్టీలో విభేదాలకు ఆజ్యం పోస్తున్నారని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అదే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జునలకు నియోజకవర్గాలను మార్చిన సంగతి తెలిసిందే. అలా మార్చిన నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి క్యాడర్ను బాలినేని నియంత్రిస్తున్నారని హై కమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై జగన్ సీరియస్ గా దృష్టి సారించినట్లు సమాచారం. ఉంటే ఆ ఇద్దరూ పార్టీలో ఉండమనండి.. లేకుంటే వెళ్ళిపోవచ్చు అని కూడా జగన్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు. తనకు కాకుంటే కుమారుడికైనా టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ జగన్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి సైతం పోటీ చేస్తానని చెబుతున్నారు. ఈ తరుణంలో జగన్ మాగుంటకు ట్విస్ట్ ఇచ్చారు. ఒంగోలు నుంచి పోటీ చేయాలంటే రూ.180 కోట్లు డిపాజిట్ చేయాలని కోరినట్లు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే తాను అంత కట్టలేనని.. అవసరమైతే ఎంపీ బరి నుంచి తప్పుకుంటానని.. మరీ అవసరమైతే పార్టీ నుంచి వెళ్ళిపోతానని మాగుంట శ్రీనివాసులు రెడ్డి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మా గుంట కుమారుడు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అది పార్టీకి మైనస్ గా మారినట్లు జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే పెద్ద మొత్తంలో డిపాజిట్ చేస్తేనే.. ఆపై విపక్ష నేతలను విమర్శిస్తేనే టిక్కెట్ ఇస్తానని జగన్ చెప్పినట్లు సమాచారం. అయితే తనకు ఆ అవసరం లేదని మాగుంట అభిప్రాయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బాలినేని హైదరాబాదులోనే ఉన్నారు. అయినంతట ఆయన వచ్చి తనతో మాట్లాడితే సరి అని.. నేను మాత్రం పిలవనని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం. మంత్రివర్గం నుంచి తప్పించిన నాటి నుంచి బాలినేని చికాకు పెడుతూనే ఉన్నారని.. కేవలం నాడు మంత్రి పదవి వదులుకొని తనతో నడిచారన్న కారణంతోనే ఆయన ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా క్షమిస్తున్నానని.. ఇక సందేహించాల్సిన పనిలేదని.. రాష్ట్రవ్యాప్తంగా మార్పుల్లో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నానని విజయసాయి రెడ్డి వద్ద జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల క్రమంలో ప్రకాశం జిల్లాలో పార్టీలో భారీ ప్రక్షాళనకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే మాజీ మంత్రి బాలినేని తో పాటు సిట్టింగ్ ఎంపీ మా గుంటకు దాదాపు పక్కకు తప్పించినట్టే.