పాత తరంలో రాజకీయాలు సిద్ధాంతాలను అనుసరించి సాగేవి. ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే నేతలు పనిచేసేవారు. నిబద్ధతతో కూడిన రాజకీయం చేసేవారు. కానీ.. రానురానూ ఈ పరిస్థితి మారిపోయింది. రాజకీయం అంటే కేవలం.. అధికారం, పెట్టుబడిలేని వ్యాపారంగా తయారైంది. దీంతో.. ఏ పార్టీలో ఉంటే మనకు మంచి జరుగుతుంది అని నేతలు ఆలోచించుకుంటున్నారు. దానికోసం ఎంతకైనా దిగజారుతున్నవారిని కళ్ల ముందే చూస్తున్నాం.
అయితే.. ఎక్కడ పదవి దక్కితే ఆ పార్టీలోకి వెళ్లిపోయే నేతలను కొంత కాలంగా చూస్తున్నాం. అంతేకాకుండా.. ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు పార్టీల్లోనూ కొనసాగడం కూడా మొదలైంది. కానీ.. ఇప్పుడు ఏకంగా మూడు పార్టీల్లోనూ కొనసాగుతోంది ఒక కుటుంబం. అది ఎవరో కాదు.. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న ధర్మపురి శ్రీనివాస్ ఫ్యామిలీ.
డీఎస్ గా సుపరిచితులైన శ్రీనివాస్.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ లో హవా కొనసాగించారు. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన 2004లో ఈయనే పీసీసీ పీఠంపై ఉన్నారు. అయితే.. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ గూటికి చేరారు. రాజ్యసభ సీటు దక్కించుకుని అప్పటి నుంచి గులాబీ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయనతోపాటు పెద్ద కొడుకు సంజయ్ కూడా కారెక్కారు.
అయితే.. చిన్న కుమారుడు అరవింద్ 2019 ఎన్నికల ముందు బీజేపీలోచేరి నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితను ఓడించి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి బీజేపీలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. కాగా.. లేటెస్ట్ న్యూస్ ఏమంటే.. డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి తన రాజకీయ భవిష్యత్ పై చర్చించారు. రేవంత్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో.. కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో.. ఒకే కుటుంబంలోని వారు ముగ్గురు మూడు పార్టీల్లో ఉండడం చర్చనీయాంశంగా మారింది. అంటే.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో వచ్చినా.. డీఎస్ కుటుంబం అధికార పార్టీకి చెందిన నేత కలిగిన కుటుంబంగా ఉంటుందన్నమాట.