
DH Srinivasa Rao: రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు గడల శ్రీనివాసరావు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో మొక్కలు నాటాలని, రోగులకు పండ్లు పంపిణీ చేయాలంటూ అన్ని జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేయడం ఇప్పుడు కలకలం రేపుతున్నది. ఓ ఉన్నత స్థాయి అధికారి ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఏంటనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గడల తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలోనూ సీఎం కేసీఆర్ కు శ్రీనివాసరావు పాదాభివందనం చేశారు.. విమర్శలు ఎదుర్కొన్నారు. రానున్న ఇంటి కళ్ళు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న శ్రీనివాసరావు… కెసిఆర్ ను ప్రసన్నం చేసుకునేందుకే రాజభక్తి ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతోపాటు ఏసుక్రీస్తు దయ వల్లే కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రదుమారం లేపాయి. అంతేకాదు ఇటీవల తరచు ఆయన కొత్తగూడెం వస్తున్నారు. అధికార పార్టీ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.. ఈ వ్యవహారాన్ని పాల్వంచ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.

శ్రీనివాసరావు వైఖరి పట్ల సొంత సామాజిక వర్గంలోనే ఆగ్రహం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకుడితో మంత్రాంగం నడుపుతున్నట్టు సమాచారం. మరొకటి వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం టికెట్ ఆశిస్తున్న గడల జి.ఎస్.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించారు.. అది కూడా కార్పొరేట్ ఆసుపత్రులతో.. ప్రజారోగ్య శాఖకు సంచాలకుడిగా ఉన్న శ్రీనివాసరావు… కార్పొరేటర్ ఆస్పత్రులతో వైద్య శిబిరాలు నిర్వహించడం ఏంటనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. కాగా కెసిఆర్ జన్మదినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయడం పట్ల ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దీనిపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.. గడల శ్రీనివాసరావు కూడా సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి లాగా ఉద్యోగానికి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకోవాలని సూచిస్తున్నాయి.
