Devullu.com: ప్రపంచంలో అన్నింట్లోనూ మోసాలే కనిపిస్తున్నాయి. ఆఖరికి దేవుడి విషయంలో కూడా అలాంటి దారులే వెతుకుతున్నారు. దేవుడి పేరు చెప్పి కూడా ప్రజలను ముంచేందుకు సిద్ధపడుతున్నారు. భక్తుల సెంటిమెంట్ ను ఉపయోగించుకుని వారిని నిలువునా దోచేస్తున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు దేవుడి పేరుతో మరిన్ని అక్రమాలు చేస్తున్నారు. దీంతో దేవుడెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.

అవకాశం దొరికితే చాలు అందినంత దోచుకునే ప్రబుద్ధులు ఉన్న నేటి కాలంలో మోసాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫలితంగా తమ జేబులు నింపుకునే పనిలో పడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రతి ఏటా క్యాలండర్లు, డైరీలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. టీటీడీ వీటిని అమెజాన్ సంస్థ ద్వారా విక్రయాలు సాగిస్తోంది.
కానీ ఇటీవల రాజమండ్రికి చెందిన మోహన్ పబ్లికేషన్స్ అనే సంస్థ ఆన్ లైన్ లో దేవుళ్లు డాట్ కామ్ అనే వెబ్ సైట్ లో టీటీడీ క్యాలండర్లు, డైరీలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. టీటీడీ అనుమతి లేకపోయినా వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తోంది. దీంతో సదరు సంస్థపై చర్య తీసుకోవాల్సిన టీటీడీ సైతం మిన్నకుండిపోతోంది.
Also Read: దేశంలో టాప్ -5 దానకర్ణులు వీళ్లే.. ఎంత దానమిచ్చారంటే?
రూ.130 ల విలువ చేసే క్యాలండర్ ను రూ.243లకు , రూ.150 విలువ చేసే డైరీని రూ.247 లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటోంది. ఇప్పుడు టీటీడీ మోహన్ పబ్లికేషన్స్ పై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో ప్రస్తుతం బండారం బయటపడనుందని తెలుస్తోంది. భక్తులు సదరు సంస్థ వస్తువులు కొనుగోలు చేయొద్దని సూచిస్తోంది.