UPI Payments: పెద్ద నోట్ల రద్దు; యూపీఐ చెల్లింపులు అమాంతం పెరిగాయి…5 ఏళ్ళల్లో ఎంతకు చేరుతాయంటే?

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల హవా నడుస్తోంది. వాటిలో అత్యధిక వాటా యూపీఐ చెల్లింపులదే. గత కొన్నేళ్లుగా యూపీఐ చెల్లింపులు నిలకడగా పెరుగుతూ సగటున ఏడాదికి 50 శాతం వృద్ధి ని సాధిస్తున్నాయి.

Written By: Bhaskar, Updated On : May 30, 2023 10:32 am

UPI Payments

Follow us on

UPI Payments: ఏ ముహూర్తాన పెద్ద కరెన్సీ నోట్లు రద్దు చేస్తూ ప్రధానమంత్రి నిర్ణయం తీసుకున్నారో.. ఇక అప్పటి నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. మొదట్లో ఈ స్థాయిలో పెరుగుదలను ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. అప్పట్లో కరెన్సీ అందుబాటులోకి లేకపోవడంతో ప్రజలు అనివార్యంగా డిజిటల్ వైపు మళ్ళారు. దానిని అలవాటుగా మార్చుకోవడంతో డిజిటల్ రూపంలో చెల్లింపులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. మొన్నామధ్య డిజిటల్ చెల్లింపులకు సంబంధించి పన్నులు విధిస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ప్రజలు వెరవకపోవడం విశేషం.

యూపీఐ చెల్లింపులు ఐదేళ్లలో రోజుకి 100 కోట్లు

దేశంలో డిజిటల్‌ చెల్లింపుల హవా నడుస్తోంది. వాటిలో అత్యధిక వాటా యూపీఐ చెల్లింపులదే. గత కొన్నేళ్లుగా యూపీఐ చెల్లింపులు నిలకడగా పెరుగుతూ సగటున ఏడాదికి 50 శాతం వృద్ధి ని సాధిస్తున్నాయి. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి రోజువారీ యూపీఐ చెల్లింపులు లావాదేవీల పరంగా 100 కోట్లకు చేరవచ్చునని పీడబ్ల్యూసీ అంచనా. అంటే మొత్తం రిటైల్‌ చెల్లింపుల్లో యూపీఐ చెల్లింపుల వాటా 90 శాతం అవుతుందని ‘‘భారత చెల్లింపుల హ్యాండ్‌బుక్‌ – 2022-27’’ పేరిట ప్రచురించిన నివేదికలో పీడబ్ల్యూసీ తెలిపింది. 2022-23లో మొత్తం డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ లావాదేవీల వాటా 75 శాతం ఉంది. కాగా 2026-27 నాటికి మొత్తం డిజిటల్‌ చెల్లింపులు 41,400 కోట్లకు చేరతాయని పేర్కొన్నారు.

ఏడాదికి పదివేల కోట్లకు మించి..

ప్రస్తుతం ఏడాదికి 10,300 కోట్ల డిజిటల్‌ లావాదేవీలు నమోదవుతున్నాయి. క్రెడిట్‌ కార్డుల విభాగం కూడా ఆరోగ్యవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్నట్టు తెలిపింది. యూపీఐ తర్వాత ప్రజలు అత్యధికంగా వినియోగించేది డెబిట్‌, క్రెడిట్‌ కార్డులేనని పేర్కొంది. 2024-25 నాటికి డెబిట్‌ కార్డు లావాదేవీలను పక్కకు నెట్టి క్రెడిట్‌ కార్డు లావాదేవీలు అగ్రస్థానానికి చేరవచ్చునని కూడా ఆ నివేదిక తెలిపింది. ప్రజలు డెబిట్‌ కార్డులను నగదు విత్‌డ్రాయల్‌కు ఉపయోగించడమే ఇందుకు కారణమని పేర్కొంది.

ఇతర దేశాలతో పోలిస్తే

డిజిటల్ చెల్లింపులకు సంబంధించి భారత్ ఇతర దేశాలతో పోలిస్తే ముందు వరుసలో ఉంది. అగ్రదేశంగా పేరుగాంచిన అమెరికా కూడా డిజిటల్ చెల్లింపుల్లో వెనుకబడి ఉండడం విశేషం. పైగా మనదేశంలో చెల్లింపులకు సంబంధించి యాప్ లు సులభతరంగా ఉండటంతో ప్రజలు వీటిని ఉపయోగించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. లావాదేవీలు కూడా సుసాధ్యంగా ఉండడంతో వీటి వాడకాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు.