Adani NDTV: ఎన్డీ టీవీ ఎవరిది? గౌతమ్ ఆదానిది. ఆయన ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్నేహితుడు. అలాంటప్పుడు ఎన్డి టీవీ ఎవరి గురించి చెబుతుంది? ఇందులో అనుమానం ఎందుకు? కచ్చితంగా బిజెపి గురించే వార్తలు ప్రచారం చేస్తుంది.. అదే కదా మీ సమాధానం. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలేశారు.. మొన్నటిదాకా ఒక లైన్ లో ఉండి పనిచేసిన ఆ ఛానల్.. ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ పల్లవి అందుకుంది.
పుంజుకుంటున్నది
కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోందా? 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లశాతాన్ని పెంచుకుని, ముందుకు సాగనుందా? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ప్రభ పెరుగుతోందా? ప్రసంగాల్లో స్వరం పెంచుతూ.. అట్టడుగు వర్గాల సమస్యలను తెలుసుకుంటూ గత ఏడాది సాగించిన ‘భారత్ జోడో యాత్ర’ తర్వాత ఆయన ఓటర్లను బాగా ఆకట్టుకుంటున్నారా? ప్రధాని మోదీని ఢీకొనగల నేతగా రాహుల్‌ను ఓటర్లు గుర్తిస్తున్నారా? ఈ ప్రశ్నలకు ఎన్డీటీవీ-లోక్‌నీతి-సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ పేరుతో నిర్వహించిన సర్వే అవుననే చెబుతోంది. అయితే.. మోదీనే ప్రధానిగా చాలా మంది ఇష్టపడుతున్నారని ఈ సర్వే స్పష్టం చేసింది. 19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో.. 7,202 మందితో నిర్వహించిన ఈ సర్వే విశేషాలు..
బీజేపీ, కాంగ్రెస్ కు ఓట్ల శాతం
ఈ సర్వేలో పాల్గొన్న 43ు మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకే జైకొట్టారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తమ ఓటు బీజేపీకేనని చెప్పారు. 38% మంది మాత్రం బీజేపీని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. అటు ఓట్ల శాతంలోనూ బీజేపీ 43శాతంతో ముందంజలో ఉందని ఈ సర్వే వెల్లడించింది. అయితే.. 2019లో నిర్వహించిన సర్వేలో వచ్చిన 44% నుంచి బీజేపీ ఒక శాతం కోల్పోవడం గమనార్హం. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 2019(19%)తో పోలిస్తే.. తాజా సర్వేలో 10% పెరుగుదలను నమోదు చేసుకుంటూ.. 29శాతానికి చేరుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చేస్తున్న అభివృద్ధి తమకు సంతృప్తినిస్తోందని 55% మంది, కాస్త సంతృప్తిగా ఉందని 38ు మంది, పూర్తిస్థాయిలో సంతృప్తినిచ్చిందని 17% మంది పేర్కొనగా.. 21% మంది తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రధానిగా మోదీకే జై
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 43% మంది ప్రధానిగా మోదీకే జైకొట్టారు. 2019తో పోలిస్తే.. మోదీ ఒక శాతాన్ని కోల్పోయారు. రాహుల్‌గాంధీ 24% నుంచి 27శాతానికి ఎగబాకారు. మూడో స్థానంలో 4శాతంతో బెంగాల్, ఢిల్లీ సీఎంలు మమత, కేజ్రీవాల్ ఉండగా.. అఖిలేశ్‌యాదవ్‌కు 3%, ప్రధాని రేసులో ఉన్నానంటూ పదేపదే ప్రకటించే నితిశ్‌కుమార్‌కు 1% మంది జైకొట్టారు. మోదీని ఎందుకు ఇష్టపడతారు? అని ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు 25% మంది ఆయన ప్రసంగాలను ఇష్టపడతామని చెప్పారు. 20ు మంది మోదీ చేసిన అభివృద్ధిని, 13% మంది కష్టపడి పనిచేసే తత్వాన్ని, 11%మంది ఆయన విధానాలను ఇష్టపడతామని చెప్పారు.
మోదీని ఎదుర్కొనేదెవరు?
2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడెవరు? అని అడిగిన ప్రశ్నకు 34ు మంది రాహుల్‌ను ఎంచుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో అర్వింద్ కేజ్రీవాల్(11%), అఖిలేశ్(5%), మమతాబెనర్జీ(4%) ఉండగా.. 9% మంది మోదీని ఎవరూ ఎదుర్కోలేరని స్పష్టం చేశారు. ఇక రాహుల్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారు? అని అడిగిన ప్రశ్నకు 26% మంది తామెప్పటికీ రాహుల్‌ను ఇష్టపడతామని చెప్పారు. 15% మంది తమను రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ ఆకట్టుకుందని చెప్పారు. 16% మంది రాహుల్ అంటే ఇష్టం లేదని చెప్పగా.. 27%మంది తటస్థంగా ఉన్నారు. కాగా.. కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తోందా? అని అడిగిన ప్రశ్నకు 37% మంది చట్టం తన పనిని తాను చేసుకుపోతుందని, దర్యాప్తు సంస్థలకు ఆ అధికారం ఉందని చెప్పారు. 32%మంది మాత్రం రాజకీయ కక్ష సాధింపు కోసం కేంద్రం ఆయా సంస్థలను వాడుకుంటోందని చెప్పారు.