Chairman of DLDA: కెసిఆర్ గురించి తెలుసు కదా.. కొన్ని విషయాల్లో చాలా నిష్కర్షగా వ్యవహరిస్తూ ఉంటాడు. అవి కొంతమందికి నచ్చవచ్చు. మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ అంతటి కేసీఆర్ కూడా వీళ్లను ఏమి చేయలేకపోతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 సంవత్సరాలు పాతికపోయినప్పటికీ వారిని వీసమెత్తు కదిలించలేకపోతున్నాడు. ఫలితంగా విలువైన ప్రజలను వారికి ప్రతినెల జీతం గా వస్తోంది. పోనీ దీని ద్వారా వాళ్లు ఏమైనా పని చేస్తున్నారా అంటే అది కూడా లేదు. ఇంతకీ బంగారు తెలంగాణలో ఆ శాఖ ఏమిటో మీరూ చదివేయండి.
14 ఏళ్లుగా..
సాధారణంగా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీల పదవీ కాలమైతే ఐదేళ్లు ఉంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థలో చైర్మన్లను చూస్తే ఎమ్మెల్యే, ఎంపీ పదవులు కూడా బలాదూర్ అని అనిపించేలా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పదవుల్లో తిష్ట వేసిన 9 మంది డీఎల్‌డీఏ చైర్మన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి కావస్తున్నా కుర్చీలు వదలట్లేదు. ప్రభుత్వాలు మారినా, మంత్రులు మారినా వారు మాత్రం మారటం లేదు. పద్నాలుగేళ్లుగా పదవుల్లో పాతుకుపోయారంటే, రెండేళ్లకోసారి పదవీ కాలం పొడిగింపు ఉత్తర్వులు వారి ఇంటి తలుపు తడుతున్నాయంటే ఈ 9 మంది పలుకుబడి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
2001లో..
2001లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఏపీ- ఎల్డీఏ)ను స్థాపించారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఆగస్టు 13న తెలంగాణ రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (టీఎస్-ఎల్డీఏ) పురుడుపోసుకుంది. దీని పరిధిలో హైదరాబాద్ మినహా పాత ఉమ్మడి 9 జిల్లాలతో పాటు కరీంనగర్‌లోని ఘనీకృత వీర్య ఉత్పత్తి కేంద్రం పనిచేస్తున్నాయి. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎల్డీఏలకు 14 ఏళ్ల కిందట చైర్మన్లను నియమించారు. వీరి నియామకంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంది. ఉత్తమ పాడి రైతులు, విజయ డెయిరీకి పాలుపోసే రైతులు, వివిధ సమాఖ్యల అధ్యక్షులకు భాగస్వామ్యం కల్పించాల్సి ఉంది. అవేవీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లు నియమించారు. వాస్తవానికి వీరి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. కానీ 14 ఏళ్లుగా వారినే కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి పదవీ కాలం పొడిగిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు డీఎల్‌డీఏ చైర్మన్ల నియామకం జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కొనసాగిన డీఎల్‌డీఏ చైర్మన్లే కేసీఆర్ హయాంలో కూడా కొనసాగుతున్నారంటే అతిశయోక్తి కాదు.
ప్రభుత్వం తలొగ్గింది
తాజాగా ఈ నెల 24న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు-51 జారీ చేసింది. డీఎల్‌డీఏ ఛైర్మన్ల పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధార్ సిన్హా ఆదేశాలిచ్చారు. దానికి అనుగుణంగా టీఎ్‌సఎల్డీఏ సీఈవో మంజువాణి ఉత్తర్వులు జారీ చేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఈ నెల 31 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. విచ్రితమిటంటే ఎన్నికలు నిర్వహించే వరకు చైర్మన్ల పదవీ కాలం ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంటున్నారు. అలా ఏడు దఫాలుగా జరుగుతోంది. కానీ ఇంతవరకు ఎన్నికలు నిర్వహించింది లేదు. కొత్త చైర్మన్లను, పాలకవర్గాలను నియమించిందీ లేదు. తాజా ఉత్తర్వులతో డీఎల్‌డీఏ చైర్మన్ల పదవీ కాలం పదహారేళ్లకు చేరుతుంది. ప్రభుత్వాలు, మంత్రులు మారినా పొడిగింపు ఉత్తర్వులు చైర్మన్ల ఇంటికి వస్తుండటం చూసి రాష్ట్ర పశుసంవర్థక శాఖలో అందరూ విస్తుపోతున్నారు.
కృషి చేయడం లేదు
రాష్ట్రంలో పశు సంపదను, పాల ఉత్పత్తిని పెంచటానికి డీఎల్‌డీఏ ఛైర్మన్లు ఎలాంటి కృషి చేయటంలేదని పాల ఉత్పత్తిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ డెయిరీకి వెన్నుదన్నుగా నిలవాల్సి ఉండగా ప్రైవేటు డెయిరీలకు కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాడి రైతులు, విజయ డెయిరీ అభివృద్ధికి కృషి చేయకుండా గోపాలమిత్రలపై ఆధిపత్యం చెలాయించేందుకు, పశుసంవర్థకశాఖ నుంచి వచ్చే గౌరవ వేతనాలు, వసతులు, అలవెన్సులు వాడుకోవటానికే ప్రాధాన్యమిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఒక జిల్లాలో ప్రైవేటు సహకార డెయిరీ చైర్మన్, డీఎల్‌డీఏ చైర్మన్ పదవుల్లో ఒక్కరే ఉండడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతోపాటు పశు సంవర్థకశాఖ మంత్రిని కూడా ప్రసన్నం చేసుకొని పదవుల్లో పాతుకుపోయిన డీఎల్‌డీఏ చైర్మన్లను మార్చాలని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పాడి రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పాతుకు పోయింది వీరే
14 ఏళ్లుగా పదవుల్లో పాతుకుపోయిన డీఎల్‌డీఏ చైర్మన్లు వీరే
01. సీహెచ్.రాజేశ్వర్ రావు- కరీంనగర్
02. కె.నాగేశ్వర్ రావు- ఖమ్మం
03. ఎం.పిచ్చిరెడ్డి- నల్లగొండ
04. జి.లక్ష్మారెడ్డి- మెదక్
05. గౌరీ రాజలింగం- నిజామాబాద్
06. సీహెచ్.ప్రభాకర్ రెడ్డి- వరంగల్
07. జి.చెన్నకిషన్ రెడ్డి- మహబూబ్‌నగర్
08. పి.నారాయణరెడ్డి- రంగారెడ్డి
09. బి.గోవర్ధన్ యాదవ్- ఆదిలాబాద్.