Delhi assembly election results 2025: కడపటి వార్తలు అందే సమయానికి ఆమ్ ఆద్మీ పార్టీ తన బలాన్ని 18 నుంచి 28 కి పెంచుకుంది. ఇక చాలా స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల లీడ్ లు 500 నుంచి వెయ్యి మధ్య మాత్రమే ఉంటున్నాయి. దీంతో రౌండ్ రౌండ్ కు ఫలితాలు మారుతున్నాయి. అయితే అభ్యర్థుల మెజారిటీని నిర్ణయించడంలో ముస్లిం ఆధిపత్య నియోజకవర్గాలు కీలకం అవుతున్నాయని ప్రస్తుత ట్రెండ్ ప్రకారం తెలుస్తోంది. 1993లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలో బిజెపి అధికారంలోకి వచ్చింది. అయితే నాడు ముఖ్యమంత్రులుగా అనేకమందిని భారతీయ జనతా పార్టీ మార్చింది. చివరికి 1998లో కేంద్రమంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్.. తన పదవికి రాజీనామా చేసి.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యారు.. ఆ తర్వాత ఇంతవరకు బిజెపి అధికారంలోకి రాలేదు. ఇక 2013 నుంచి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. నాటి ఎన్నికల్లో భారీగానే సీట్లు గెలుచుకున్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయింది.. ఆప్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో అధికారంలోకి రాగలిగింది.
2013 నుంచి..
2013 నుంచి ప్రస్తుత ఎన్నికల వరకు ఆప్ ఢిల్లీని పరిపాలిస్తోంది. మూడు పర్యాయాలు వరుసగా అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి కూడా అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. అయితే మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ పేరు ప్రముఖంగా వినిపించడంతో.. ఆయన గత ఏడాది తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన స్థానంలో మహిళను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు.. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. చాలా స్థానాలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గట్టి పోటీని ఇవ్వడంతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు వెనుకబడుతున్నారు.. అయితే ట్రెండ్ ప్రకారం మ్యాజిక్ ఫిగర్ వైపు ఆప్ ప్రయాణం సాగుతోందని తెలుస్తోంది. ఒకవేళ ఆప్ కు కనుక అధికారానికి సరిపడా సీట్లు లభిస్తే నాలుగోసారి ఢిల్లీ పీఠాన్ని అధిష్టిస్తుంది. ఒకవేళ బిజెపి గనుక అధికారంలోకి వస్తే.. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న పార్టీగా అవతరిస్తుంది. ముస్లింలు అధికంగా ఉన్న స్థానాలలో మాత్రం బిజెపి అభ్యర్థులు వెనుకబడ్డారు. ఇక్కడ ఆప్ నాయకులు జోరు చూపిస్తున్నారు.. అయితే బిజెపి అభ్యర్థులు చాలా స్థానాల్లో 500 నుంచి 1000 ఓట్ల మధ్యే లీడ్ లో ఉన్నారు. ఒకవేళ ఆప్ అభ్యర్థులకు ఓట్లు మరింత పెరిగితే బిజెపికి కష్టకాలం తప్పదని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.