MLC Kavitha: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయ, ముఖ్యమైన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గారాల చెల్లి.. కల్వకుంట్ల కవితకు భవిష్యత్ కళ్ల ముందు కనిపిస్తోందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మూడు నెలలుగా ఈ స్కాంలో కవిత ఉన్నట్లు ఆరోపణలు మాత్రమే వచ్చాయి. కానీ, తాజాగా ఈడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ప్రస్తావించడంతోపాటు సౌత్ లాబీలో కీలకంగా వ్యవహరించినట్లు పేర్కొంది. టెక్నికల్ ఎడిడెన్స్ దొరకకుండా 10 మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీంతో ఇన్నాళ్లూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, సీఎం కూతురును కాబట్టే తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ, ఈడీ నివేదికలో పేర్కొన్న వివరాలతో కవిత దిమ్మతిరిగిపోయింది.

త్వరలో నోటీసులు…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సౌత్ లాబీకి కీలకంగా వ్యవహరించిన కవితను త్వరలో విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాల సమాచారం. ఈమేరకు నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ ద్వారా స్కాంకు సంబంధించిన మరిన్ని వివరాలను బయటపెట్టాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సౌత్‌లో టీఆర్‌ఎస్ నేతలు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోవడం దక్షిణాదిన ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఎవిడెన్స్ డ్యామేజీలో నంబర్ 2..
లిక్కర్ స్కాంలో చాలామంది టెక్నికల్ ఎవిడెన్స్ డ్యామేజ్ చేసినట్లు ఈడీ తన నివేదికలో పేర్కొంది. స్కామ్‌లో కీలక ఆధారాలైన సెల్‌ఫోన్లను నిందితులు ధ్వంసం చేసినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అత్యధికంగా 14 సెల్‌ఫోన్లు ధ్వంసం చేసి టాప్ వన్‌లో నిలవగా, తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత 10 సెల్‌ఫోన్లు ధ్వంసం చేసి రెండో స్థానంలో నిలిచింది. మిగతా నిందితులు కూడా 2 నుంచి 6 ఫోన్ల వరకు ధ్వంసం చేశారని ఈడీ వెల్లడించింది. వీటిపై కూడా నిందితులపై టెక్నికల్ ఎవిడెన్స్ డ్యామేజ్ కేసు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
జైలు జీవితం కళ్లముందు..
ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్రపై ఇన్నాళ్లూ లీకులకే పరిమితం అయ్యాయి. కానీ మొదటిసారి అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును చేర్చింది ఈడీ. ఈ క్రమంలో మీడియా ముందుకు వచ్చిన కవిత యథావిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మోదీ కంటే ముందు ఈడీ వచ్చిందని పేర్కొన్నారు. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగానే జరుగుతుందని తెలిపారు. అంతటితో ఆగకుండా ఏం జరుగబోతుందో తనకు ముందే తెలిసినట్లు కేసులు పెట్టుకోండి.. అరెస్టులు చేసుకోండి.. జైల్లో పెట్టుకోండి అని వ్యాఖ్యానించారు. ఈ మాటలు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. కవిత అరెస్ట్ తప్పదా అని నేతలు గుసగుసలాడుతున్నారు. అందుకే అరెస్ట్ చేసుకోండి అంటూ కవిత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారా అని చర్చించుకుంటున్నారు.

తాను చెప్పాల్సింది చెప్పి..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును బీజేపీ నాయకులు గత సెప్టెంబర్‌లో ప్రస్తావించారు. వాటిని కవిత ఖండించారు. ముఖ్యమంత్రి కూతురును కాబట్టి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ప్రెస్‌మీట్ అంటూ నాడు మీడియాకు సమాచారం ఇచ్చి.. తాను చెప్పాపల్సింది చెప్పి వెళ్లిపోయారు. గురువారం కూడా ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉండడంతో ప్రెస్‌మీట్ అంటూ కవిత మళ్లీ మీడియాకు సమాచారం ఇచ్చారు. అందరూ వచ్చాక.. ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రెండు పోన్ నంబర్ల వినియోగంపైగానీ, పది ఫోన్లను డ్యామేజ్ చేసిన విషయంపైగానీ ఆమె నోరు మెదుపలేదు. నగదు రవాణాకు సబంధించి ఈడీ పేర్కొన్న అంశంపై కూడా మాట్లాడలేదు. కేవలం తప్పుడు కేసు అని మాత్రమే చెప్పుకున్నారు. ఈడీ నివేదిక తప్పయితే.. అందలో పేర్కొన్న అంశాలపై కచ్చితంగా కవిత మాట్లాడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవం ఉంది కాబట్టే.. స్పందించలేదని, మీడియా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదని తెలుస్తోంది.