Homeఆంధ్రప్రదేశ్‌AP SSC Results 2022: ఏపీలో తగ్గిన పదో తరగతి ఉత్తీర్ణత శాతం.. కారణాలు అవేనా?

AP SSC Results 2022: ఏపీలో తగ్గిన పదో తరగతి ఉత్తీర్ణత శాతం.. కారణాలు అవేనా?

AP SSC Results 2022: ‘బడి గంట కొట్టేందుకు అటెండరు లేరు. మధ్యాహ్న భోజనం నాణ్యత, వడ్డన చూసే మనిషి లేరు. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించే వారు లేరు. నాడునేడు పనులు చూసే మనిషి కరువు’..ఇదీ ఏపీ పాఠశాల్లో దుస్థితి. ఈ బాధ్యతలన్నీ ఉపాధ్యాయులు, హెచ్ఎంలే చూస్తున్నారు. చివరకు బాత్ రూమ్ లు శుభ్రంగా ఉన్నాయో లేదో? ఎప్పటికప్పుడు ఫొటోలు తీసి అప్ లోడ్ చేసే బాధ్యత కూడా వీరిదే. విద్యార్థికి చదువు చెప్పించాలన్న లక్ష్యం కంటే…ఈ పనులపైనే ఎక్కువ దృష్టి! విద్యాసంబంధమైన విధులను నిర్వర్తించాల్సిన ఉపాధ్యాయులకు బోధనేతర విధులు భారంగా మారాయి. ప్రభుత్వం వేసిన ఈ భారాలతో ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుపై కంటే ఇతరేత్రాలపైనే దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. వెరసి.. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తీరు ఉసూరుమనిపించింది! ఎక్కడైనా ఏటేటా ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. లేకుంటే కనీసం గతేడాది వచ్చినంతైనా వస్తుంది. అదీ కాకుంటే గతేడాది వచ్చినదానికంటే ఒకటో, రెండో శాతం తగ్గుతుంది. కానీ ఏకంగా 17.5శాతం 2022 పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత తగ్గిపోయింది. పరీక్షలు రాసిన 6.15 లక్షల మందిలో గతంలోలా ఫలితాలు వచ్చుంటే…అంటే 94శాతం వచ్చినా…దాదాపు 5.70లక్షల మంది ఉత్తీర్ణులయ్యేవారు. కానీ ఇప్పుడు అత్యంత దారుణంగా సుమారు 4.14లక్షల మందే ఉత్తీర్ణత సాధించారు. అంటే 1.5లక్షల మందికి పాస్‌ మార్క్‌ కూడా రాలేదు. ప్రభుత్వం బోధనాంశాలపై సరైన దృష్టిపెట్టకుండా…ఇతరత్రా విధులను ఉపాధ్యాయులకు అప్పగించడం వల్ల ఇంతమంది ఫెయిలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

AP SSC Results 2022
AP SSC Results 2022

మెంటల్ టార్చర్
పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు మొత్తం నిర్వహణతోపాటు… ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల చదువు సాగుతున్న తీరు గమనించాలి. వెనుకబడి ఉంటే మెరుగయ్యేందుకు ప్రణాళికలు రూపొందించాలి. తల్లిదండ్రులతో కూడా మాట్లాడి పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలో సలహాలివ్వాలి. మొత్తంగా పిల్లలు చదువులో రాణించేలా హెడ్‌మాస్టర్‌ చూడాలి. అయితే అతనికి దీనిపై దృష్టిపెట్టే సమయాన్నే లేకుండా చేసేసిందన్న విమర్శలు ప్రభుత్వంపై ఉన్నాయి. చాలా పాఠశాలల్లో అటెండరు లేకపోవడంతో క్లాస్‌బెల్‌ ఎవరితో కొట్టించాలి.. మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయడం, మధ్యాహ్న భోజనం వండేటప్పుడు, వడ్డించాక ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయడం, నాడు-నేడు పనులు చూడడం, వాటికి సంబంధించిన మెటీరియల్‌ లెక్కలు చూడడం, బిల్లులు చూడడం, ఈ పనుల కోసం ఎక్కడో ఇసుక ఉంటే తెప్పించడం…ఇలాంటి పనులన్నీ కలగలిసి ఒక మెంటల్‌ టార్చర్‌లా మారిపోయింది. మానసికంగా ఒత్తిడి పెరిగిపోయింది.

Also Read: Samantha Costly Car: బాప్ రే.. సమంత రేంజ్ ఇంత ఉందా? కాస్ట్లీ కారు చూస్తే అవాక్కే!

కమిటీల పాత్ర అంతంతే..
‘నాడు-నేడు’ పనులకు తల్లిదండ్రుల కమిటీలు వేశారు. ఈ కమిటీల్లో సగంమంది మహిళలు, చాలావరకు వారంతా పేదవారు. దీంతో భారమంతా ప్రధానోపాధ్యాయుడిపైనే పడుతోంది. మెటీరియల్‌ వచ్చిందా..లేదా.. అని చూసుకోవడం దగ్గర నుంచి పెయింటర్స్‌, టైల్స్‌ వేసేవాళ్లు, ప్లంబ్లింగ్‌, ఎలక్ర్టిక్‌ పనివాళ్లు .. ఇలా అందరిలోనూ వీరే పడాల్సి వస్తోంది. వీరికేదో ఇంజనీరింగ్‌ అనుభవం ఉన్నట్లు బిల్లుల అప్‌లోడ్‌ కూడా చేయాల్సిన పరిస్థితి. ఇటీవలే ప్రభుత్వం మళ్లీ ఒక కొత్త నిబంధన పెట్టింది. వర్షాకాలంలో ఇసుక కొరత ఉంటుంది కనుక పదేసి పాఠశాలలకు కావాల్సిన ఇసుకను ఒకచోట డంప్‌ చేసుకుని…అక్కడినుంచి ప్రతి పాఠశాలకు పట్టుకెళ్లాలట! మళ్లీ ఈ పని కూడా ప్రధానోపాధ్యాయుడిదే. ఇలాంటి పనులన్నీ చేయడంతో ఇకవారికి విద్యార్థుల చదువు గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోంది. అదే సమయంలో పలుచోట్ల ప్రధానోపాధ్యాయులు అనివార్యంగా ఈ పనులను ఎవరో ఒక ఉపాధ్యాయుడికి, లేదంటే రోజుకు ఒకరికి ఇలా కూడా అప్పచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా పనులు చేయించుకోవడం వల్ల తిరిగి ఉపాధ్యాయులను పాఠాల విషయంలో ఏమీ అనలేని స్థితి ఏర్పడుతుంది. బోధనేతర పనుల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ అసలు పనిచేసే అవకాశం లేకుండా పోతోంది. ఆఖరికి విద్యార్థుల హాజరు తీసుకోవడాన్ని కూడా క్లిష్టతరం చేసేశారు. యాప్‌లో హాజరు తీసుకోవడం, దాన్ని అప్‌లోడ్‌ చేయడానికే కొంత సమయం పడుతుంది. ఒక్కోసారి నెట్‌వర్క్‌ ఉండదు. ఒక్కోసారి సర్వర్‌ డౌన్‌ అవుతుంది. ప్రతిరోజు యాప్‌లోనే హాజరు నమోదు చేయాల్సిరావడం, అది కూడా రెండుసార్లు చేయడం ఉపాధ్యాయులపై పనిభారాన్ని పెంచింది.

AP SSC Results 2022
AP SSC Results 2022

ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ..
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రభుత్వం గత మూడేళ్లుగా భర్తీ చేయడం మానేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండుసార్లు డీఎస్సీ వేసి పోస్టులు భర్తీచేశారు. కానీ ఈ మూడేళ్లలో మాత్రం ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. 2020లో ఉపాధ్యాయ బదిలీల్లో 16వేల ఖాళీలను బ్లాక్‌ చేసేశారు. అంటే ఆ మేరకు ఖాళీలున్నా…బదిలీల్లో ఆ ఖాళీల్లో చూపించలేదు. చూపించాలంటే ఉపాధ్యాయుల పోస్టులను ఆ మేరకు భర్తీచేయాలి. అవి భర్తీ చేయకుండానే ఈ రెండేళ్లు కాలం గడిపేశారు. ఉన్న ఉపాధ్యాయులతోనే పాఠాలు చెప్పించారు. అదే ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పడంపై దృష్టిపెట్టేంత సమయం లేని పనులనూ అప్పగించారు. ఈ రెండేళ్లలో మళ్లీ వేల సంఖ్యలో ఖాళీలు ఏర్పడ్డాయి. ఇప్పటికి 25వేల ఉపాఽధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంచనా. అయితే వాటిని భర్తీ చేయకుండా…ఇతరత్రా మార్గాల్లో అసలు భర్తీ చేయకుండానే నెట్టుకొచ్చేస్తోంది. సబ్జెక్టు టీచర్లు తగినంతగా లేకున్నా…ఉన్నవారితోనే మేనేజ్‌ చేయాలని చెప్తోంది. లేకుంటే ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తిని పెంచేసి అసలు ఉపాధ్యాయులను భర్తీ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. ఇది పదో తరగతి విద్యార్థుల చదువులు, పరీక్ష ఫలితాలు, ఉత్తీర్ణతా శాతాలపై పెనుప్రభావం చూపిందని విద్యానిపుణులు విమర్శిస్తున్నారు.

Also Read:Pawan Kalyan CM Candidate Issue: పవన్ సీఎం క్యాండిడేట్ లొల్లి: జనసేన, బీజేపీ మధ్య దూరం పెరుగుతుందా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

2 COMMENTS

Comments are closed.

Exit mobile version