Homeజాతీయ వార్తలుగొప్ప మానవతావాది.. దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ!

గొప్ప మానవతావాది.. దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ!

deen dayal
కొందరు మరణించేవరకు జీవిస్తారు, మరికొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. రెండో కోవకు చెందినవారు పండిత దీనదయాళ్‌ ఉపాధ్యాయ. అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. చిన్నతనంలోనే తల్లి, తండ్రి మరణించిన దీనదయాళ్‌ జీ మేనమామ ఇంటిలో పెరిగారు. 1925 ప్రాథమిక విద్యకు శ్రీకారం చుట్టిన దయాళ్‌ కాన్పూర్‌లో బి.ఎ, చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్‌తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ఆయన జీవిత విధానం, గమ్యం మారిపోయింది. సంఘ్‌లో పనిచేస్తూనే బి.ఎ, డిగ్రీ, ఉపాధ్యాయ శిక్షణ ఎంఎ, ప్రథమ సంవత్సరం పూర్తిచేశారు. సంఘ్‌ విస్తరణకు పూర్తి సమయం ఇచ్చేందుకు చదువుకు స్వస్తి పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని లభంపూర్‌ ప్రాంతానికి ప్రచారకులుగా నియుక్తులైన కొద్ది సంవత్సరాలలోనే ఆ ప్రాంతంలో సంఘ్‌ కార్యక్రమాలను వికసింపజేశారు. అది గమనించిన సంఘ్‌ పెద్దలు వారిని ఉత్తరప్రదేశ్‌ ప్రాంత సహ ప్రచారకులుగా నియమించారు. ఆయన అసమాన్యమైన ప్రతిభా పాటవాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంఘ్‌ కార్యక్రమాలు చూస్తూనే పత్రికారంగంపై దృష్టి సారించి రాష్ట్ర ధర్మ ప్రకాశన్‌ అనే సంస్థ ఏర్పాటు చేశారు. ఆ ప్రకాశన్‌ ద్వారా రాష్ట్ర ధర్మ అనే ఒక మాస పత్రిక, పాంచజన్య అనే వారపత్రిక, స్వదేశ్‌ అనే దిన పత్రిక ప్రారంభించారు. ఆ పత్రికలు దీనదయాళ్‌ జీ కార్యదీక్షకు ప్రతీకలుగా నిలిచాయి!

నిత్యం ఉదయం సంఘ ప్రార్థన, రాత్రి పడుకునే ముందు సంఘ ప్రతిజ్ఞను మననం చేసుకొని జీవించేవారు. ప్రార్థన, ప్రతిజ్ఞ రెండు కళ్లు అని సంఘ్‌ ప్రచారకులు భావిస్తారు. అలా ఆచరణలో భాగంగానే ఎప్పటిలానే రెండు జతల బట్టలతో పాటు సంఘ్‌ నిక్కరును తన పెట్టెలో  పెట్టుకుని బయలుదేరారు. ఆ సంఘ్‌ నిక్కర్‌ వలననే అసామాన్యమైన ఆ వ్యక్తిని గుర్తు పట్టగలిగారు. భారతీయ జనసంఘ్‌ స్థాపనకు ముందు జరిగిన అఖిలపక్ష సమావేశంలో జనసంఘ్‌కు  సిద్ధాంతాలు లేవు అన్న వారి నోళ్ళు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కేవలం  భారతీయులను ఉద్దేశించి మాత్రమే కాకుండా విశ్వమానవాళిని దృష్టిలో పెట్టుకుని చెప్పిన సిద్ధాంతం ఏకాత్మతా మానవతావాదం. వ్యక్తి శీలం గొప్పది, సమాజ శీలం ఇంకా గొప్పది అని ఆయన చెప్పేవారు. జాతి, జాతీయత, భారతీయ సంస్కృతి, ధర్మం వంటి విషయాలపై తన అభిప్రాయాలు, మౌలిక సిద్ధాంతాలు తదితరాలపై ఆయన రచనా వ్యాసంగం కొనసాగింది.

నాడు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రధాని నెహ్రూ అనుసరిస్తున్న ముస్లిం సంతుష్టీకరణ, హిందూ ధర్మ వ్యతిరేక విధానాలను ఎదుర్కొనడానికి భారతీయ సంస్కృతి సభ్యులతో, జాతీయ భావాలతో కూడుకున్న రాజకీయ పార్టీని స్థాపించాలనే ఉద్దేశంతో ఆనాటి ఆరెస్సెస్‌ సర్‌ సంఘ చాలకులు పూజ్య గురూజీ సహాయం అర్ధించగా ఆ పనిని వారికే అప్పగించారు. అలా పురుడు పోసుకున్నది భారతీయ జనసంఘ్‌. ఆదర్శవంతమైన వ్యక్తిత్వం నిరాడంబర జీవితాన్ని గడుపుతున్న వారికి తోడుగా అప్పటికే యువకులుగా పనిచేస్తున్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి, సుందర్‌ సింగ్‌ భండారి, జగన్నాథరావు గార్లను వారికి అప్పగించారు. ప్రేరణనిచ్చే ఆదర్శ మహాపురుషులలో పండిత దీన్‌ద యాళ్‌జీ ఒకరు. మహా పురుషుడు అని ఆయన విరోధులు కూడా అనేవారు. ఆనాడు ప్రజా సోషలిస్టు పార్టీ నాయకులు నాదపాయ్‌ గాంధీ, దీన్‌ దయాళ్‌ను తిలక్, బోసుల పరంపరలో ఒకరిగా అభివర్ణిం చారు. ఆనాటి కమ్యూనిస్టు నాయకులు హీరేన్‌ గారు అజాత శత్రువుగా పేర్కొన్నారు.

దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ యువకుడిగా ఉన్నప్పుడే వ్యక్తి, సమాజం, స్వదేశీ, స్వధర్మం, పరంపర, సంస్కృతి లాంటి విషయాలపై ఆకర్షితులయ్యారు. వీటిపై లోతుగా అధ్యయనం చేశారు. భారతీయ జనసంఘం వ్యవస్థాపకులు వారే అయినప్పటికీ 1951లో కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాల నుండి బయటకు వచ్చిన డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. జాతీయ ఉపాధ్యక్షులుగా 1967 వరకు దీన్‌దయాళ్‌జీ బాధ్యతలు నిర్వహించారు. డా. శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ మరణం తరువాత జాతీయ అధ్యక్షులుగా పార్టీ పనిని తన భుజాలపై వేసుకుని నడిపించారు. జాతి సమగ్ర ఉన్నతిని సాధించడంలో సమర్థంకాగల ఒక రాజనీతి సిద్ధాంతాన్ని వికసింపచేయాలని కోరుకునేవారు. అదే ఏకాత్మతా మానవతావాదం. ఈ అంశంపై తొలిసారిగా 1964 గ్వాలియర్‌ మహాసభలో చర్చకు ప్రతిపాదించారు. ఆ తర్వాత 1965లో విజయవాడలో జరిగిన జనసంఘ్‌ మహాసభలలో ఇది ఆమోదం పొందింది. అదే ఏడాది పుణేలో 4 రోజుల పాటు జరిగిన ఉపన్యాస మాలలో విస్తృతమైన వివరణ ఇచ్చారు. సంపదను ఒకేచోట కేంద్రీకృతం చేయకూడదు అన్నారు దీన్‌దయాళ్‌జీ. ఏకాత్మక రాజ్యం అంటే సంపూర్ణమైన శక్తి లేదా అధికారాల కేంద్రీకరణ కాదు. ఏకాత్మక రాజ్యం అంటే కేంద్రీకృత నిరంకుశత్వం కాదు. అలాగే ప్రాంతాలను పరిసమాప్తం చేయాలని కూడా దాని అర్థం కాదు. ప్రాంతాలకు అధికారాలు ఉండాలి. ఈ ప్రాంతాల కింద మిగిలిన సంస్థలు, జిల్లాలు ఉంటాయి వాటికి కూడా అధికారాలు ఉంటాయి అదేవిధంగా పంచాయతీలు కూడా. ఈవిధంగా అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడు శక్తి కింద వరకు విస్తరిస్తుంది. ఈ మాదిరిగా అనేక శక్తి స్థానాలు ఏర్పడి వీటన్నిటి కేంద్రంగా ఏకాత్మక రాజ్యం ఉంటుంది. అది మన ధర్మానికి అనుగుణం కాగలదు. వసతులు, రవాణా వ్యవస్థలు, సామాజిక వ్యవస్థలు ఇప్పటిలాగా లేకపోయినా జనసంఘ్‌ విస్తరణలో నిష్ణాతులైన కార్యకర్తలను దేశానికి అందించడంలో ఆయన కార్యదీక్ష ఎనలేనిది.

గాంధీ హత్యానంతరం హిందూ మహాసభతోపాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రభుత్వం నిషేధించింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో గణనీయమైన పాత్ర పోషిం చారు దీన్‌దయాళ్‌జీ. మరోపక్క ఆర్‌ఎస్‌ఎస్‌ వార పత్రిక అయిన ‘పాంచజన్య’, లక్నో దినపత్రిక ‘స్వదేశీ’లకు దీన్‌దయాళ్‌జీ సంపాదకులుగా ఉన్నారు.

1968 ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లోని మొగల్‌ సరాయ్‌ రైల్వే స్టేషన్‌ రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన పెట్టెలోని వస్తువులను బట్టి అందులో సంఘ్‌ నిక్కరుని చూసి గుర్తుపట్టారు జనసంఘ్‌ వ్యవస్థాపకులు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ అని..  నేడు కొత్తగా బీజేపీలో చేరిన, చేరుతున్న ప్రతి ఒక్కరూ పండిట్‌ దీన్‌దయాళ్‌జీ చరిత్రను చదివి అభ్యసించి తెలుసుకుని పరి పూర్ణమైనటువంటి  బీజేపీ కార్యకర్తగా ఎదగాలి. ఇప్పుడు బీజేపీలో పని చేస్తున్నటువంటి అనేకమంది నాయకులు, కార్యకర్తలు పండిత దీన్‌దయాళ్‌ అడుగుజాడల్లో నడవడమే ఆయనకు నిజమైన నివాళి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular