Visakhapatnam- CM Jagan: ఏపీ సర్కారు కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోందా? అతి త్వరలో నిర్ణయాన్ని వెల్లడించనుందా? ఇప్పటికే ముహూర్తం ఫిక్స్ చేసుకుందా? అంటే వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే ప్లీనరీ విజయవంతం కావడంతో పార్టీ శ్రేణులు మంచి ఊపు మీద ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అధినేత స్పష్టత ఇచ్చారు. శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికలకు సమరశంఖం పూరించారు. ఇటువంటి సమయంలో మరో వార్త బయటకు వచ్చింది. విశాఖ నుంచి పాలనను ప్రారంభిస్తారన్న టాక్ ఒకటి బయటకు వచ్చింది. ఆగస్టు నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తారని.. ఈ రెండేళ్లు ఇక్కడ నుంచి పాలన అందిస్తారన్న వార్త ఇప్పుడు గుప్పుమంది. అయితే అది మూడు రాజధానుల రూపంలో కాదట. కేవలం సీఎం క్యాంపు కార్యాలయాన్ని మార్చి పాలన అందిస్తారుట. సాంకేతిక సమస్యలు రాకుండా విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేసి వారానికి ఐదు రోజుల పాటు పాలనను అక్కడ నుంచే పరుగులు పెడతారుట. శ్రావణమాసం కావడంతో ముహూర్తాలు అధికం. అందులో మంచి ముహూర్తం చూసుకొని జగన్ విశాఖలో అడుగుపెట్టనున్నారుట. ఇందుకుగాను భవనాల అన్వేషణ సైతం పూర్తయ్యిందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామం ఎటుదారితీస్తుందోనన్న చర్చ ప్రారంభమైంది.
అమరావతి నిర్వీర్యం..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతి రాజధాని మరుగునపడిపోయింది. మూడు రాజధానులను జగన్ సర్కారు తెరపైకి తెచ్చింది. విశాఖ పాలనా రాజధాని, అమరావతి శాసన రాజధాని, కర్నూలను న్యాయ రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే వైసీపీ ప్రభుత్వ నిర్ణమం పెను దుమారానికి దారితీసింది. అమరావతి ప్రాంత రైతులు ఉద్యమ బాట పట్టారు. అన్ని రాజకీయ పక్షాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఉద్యమం ఎగసిపడింది. సుదీర్ఘ కాలం సాగింది. కోర్టులో వివాదాలు సైతం నడిచాయి. చివరకు అమరావతి రైతులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అమరావతి ప్రాంతంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో వసతులకల్పన అనివార్యంగా మారింది. దీంతో అటు మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇక మూడు రాజధానులు అటకెక్కినట్టేనని అంతా భావించారు. మ,రోవైపు అమరావతిని అభివృద్ధిని చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా రాజధాని భూములను విక్రయించడానికి సిద్ధమైంది. అక్కడి కట్టడాలను, భవనాలను అద్దె రూపంలో ఆదాయం సమకూర్చుకునేందుకు నిర్ణయించింది. అయితే అమరావతిలో కోర్టు ఆదేశాలతో చిన్నచిన్న పనులు చేస్తున్న ప్రభుత్వం మనసు మాత్రం విశాఖపైనే ఉంది. అందుకే న్యాయ చిక్కులు ఎదురుకాకుండా ఇప్పడు సీఎం క్యాంపు ఆఫీసు పేరిట కొత్త నాటకానికి తెరతీసింది.
అపవాదు లేకుండా..
రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేసిందన్న అపవాదు వైసీపీపై ఉంది. అటు మూడు రాజధానులు ఏర్పాటు చేయకపోగా.. అటు అమరావతిని నిర్వీర్యం చేసిందన్న విమర్శను మూటగట్టుకుంది. దీనిపై మేథావులు, నిపుణులు, అన్నిరంగాలప్రముఖుల నుంచి ముప్పేట దాడిని ఎదుర్కొంటోంది. అందుకే ఎలాగోలా విశాఖ నుంచి పాలనను ప్రారంభించాలని భావిస్తోంది. తద్వారా తన మాటను నిలబెట్టుకోవడంతో పాటు రాజధానిగా విశాఖలో బీజం వేసినట్టేనని భావిస్తోంది. అయితే దీనిపై రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కోవడానికి సైతం వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖలో సీఎం క్యాంప్ ఆఫీసును ప్రారంభించాలన్న కృతనిశ్చయంతో మాత్రం ఉంది.
Also Read:Heavy Rains: ప్రభుత్వాల ప్రచార ఆర్భాటాలు.. వరద బురదలో ప్రజలు