
రాఫెల్ కుంభకోణంలో మరో షాకింగ్ అంశం వెలుగు చూసింది. ఫ్రాన్స్–-భారత్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో మధ్యవర్తులకు భారీగా ముడుపులు అందాయని, రాఫెల్ జెట్స్ తయారీదారు దసాల్ట్ ఏవియేషన్ తన రికార్డుల్లో రహస్యంగా పొందుపర్చిన గుట్టు రట్టయిందని ఫ్రాన్స్ మీడియా దిగ్గజం ‘మీడియాపార్ట్’ బాంబు పేల్చింది. ఇప్పటికే దాదాపు పది రాఫెల్ విమానాలు ఐఏఎఫ్‌లో చేరిపోయాయి.
భారత వాయుసేనకు మొత్తం 36 రాఫెల్ యుద్ధవిమానాలను సరఫరా చేసేలా ఫ్రాన్స్‌తో అంగీకారం కుదుర్చుకుంది. ఫ్రెంచ్ సంస్థ దసాల్ట్ ఏవియేషన్, భారత్‌లోని ప్రైవేటు రక్షణ సంస్థలకు మధ్య 2017లో డీల్ కుదిరింది. ఈ వ్యవహారాన్ని రెండు దేశాల ప్రభుత్వాధినేతలు ముందుండి నడిపించారు. కాగా.. కాంగ్రెస్ హయాంలో కుదిరిన మెరుగైన ఒప్పందానికి మోదీ సర్కార్ తూట్లు పొడిచిందని, రిలయన్స్ సంస్థల అనిల్ అంబానీకి లబ్ధి చేకూరేలా డీల్‌లో మార్పులు చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే.. సుప్రీంకోర్టు మాత్రం సదరు ఆరోపణలను కొట్టిపారేసింది.
తాజాగా.. రాఫెల్ డీల్‌కు సంబంధించి ఫ్రాన్స్‌కు చెందిన ‘మీడియాపార్ట్’ అనే ఇన్వెస్టిగేటివ్ వెబ్ సైట్ కీలక రిపోర్టును ప్రచురించింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో దసాల్ట్ ఏవియేషన్ సంస్థ అక్రమ వ్యవహారాలు బయటపడ్డాయని తెలిపింది. ఫ్రాన్స్ అవినీతి నిరోధక విభాగం (ఏఎఫ్ఏ).. దసాల్ట్ ఏవియేషన్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టగా, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, 2017నాటి రాఫెల్ డీల్ కు సంబంధించిన పత్రాల్లో ‘మధ్యవర్తులకు బహుమానాలు’ అని పేర్కొంటూ భారీ మొత్తాన్ని లెక్కగా చూపించినట్లు వెల్లడైందని ఆ కథనంలో పేర్కొన్నారు. రాఫెల్ డీల్‌లో భారత్‌కు చెందిన మధ్యవర్తికి ఒక మిలియన్ యూరోలు (దాదాపు రూ.8.6 కోట్లు) బహుమానాల రూపంలో అందజేశామని దసాల్ట్ సంస్థ తన రికార్డుల్లో పేర్కొనడాన్ని ఏఎఫ్ఏ తీవ్రంగా పరిగణించిందని, ఆరా తీయగా, సదరు మధ్యవర్తి పేరు, వివరాలు కూడా బయటపడ్డాయని తెలిపింది.
మన్మోహన్ హయాంలో భారత ప్రభుత్వం దసాల్ట్ ఏవియేషన్ తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మొత్తం 126 జెట్ ఫైటర్లు కొనడానికి రూ.68 వేల కోట్లు కాగా, మోదీ హయాంలో ఆ ఒప్పందాలను మార్చేసి, విమానం ధరలను భారీగా పేర్కొంటూ, సంఖ్యను 36కు తగ్గించడమే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్)కు అవకాశం ఇవ్వకుండా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్ కు ఒప్పందంలో ఆఫ్ సెట్ భాగస్వామ్యం కల్పించారని కాంగ్రెస్ ఆరోపణలు చేయడం తెలిసిందే. కాగా.. రాఫెల్ డీల్‌లో సబ్ కాంట్రాక్టర్ గా ఉన్న డెఫ్‌సైస్ అనే సంస్థ, దాని యజమాని అయిన సుశేన్ మోహన్ గుప్తాకి దసాల్ట్ సంస్థ ముడుపులు చెల్లించినట్లు తాజా రిపోర్టులో వెల్లడైంది. వివాదాస్పద ఆయధ వ్యాపారిగా పేరుపొందిన సుశేన్ మోహన్ గుప్తా గతంలో అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలోనూ మధ్యవర్తిగా వ్యవహరించాడు. వీవీఐపీ చాపర్ల కొనుగోలులో మనీల్యాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలపై గుప్తా విచారణ ఎదుర్కొంటున్నాడు. అంతలోనే ఆయన పేరు రాఫెల్ కుంభకోణంలోనూ బయటికి వచ్చింది.
మార్చి 30, 2017 నాటి ఇన్వాయిస్ లో.. రాఫెల్ జెట్ల 50 డమ్మీ మోడళ్ల తయారీకి 1,017,850 యూరోల విలువైన ఆర్డర్‌లో డెఫ్సిస్(గుప్తా సంస్థ)కు 50 శాతం చెల్లించాలని రాసున్నట్లుగా ఏఎఫ్ఏ గుర్తించిందని, అయితే, ఆ చెల్లింపులకు అర్థమేంటో, డబ్బు ఎలా పంపారనడానికి ఎటువంటి డాక్యుమెంటరీ ఆధారాలను దసాల్ట్ అందించలేకపోయిందని, సంస్థ ఖాతాల్లో ఖర్చును ‘ఖాతాదారులకు బహుమతి’గా ఎందుకు రాశారనేదానిపైనా దసాల్ట్ వివరించలేదని ఏఎఫ్ఏ విభాగం నుంచి విశ్వసనీయంగా తెలిసిందని పేర్కొన్నారు. ఈ కథనాలపై అటు దసాల్ట్ సంస్థగానీ, ఫ్రాన్స్ అవినీతి నిరోధక శాఖగానీ, మధ్యవర్తి సుశేన్ గుప్తాగానీ ఇంకా స్పందించలేదు.