Regional Parties: ఏ పార్టీలో అయినా ఏకపక్ష ధోరణులు, వ్యక్తి భజనలు పెరిగితే అక్కడ తిరుగుబాటు తధ్యం. ఇది చరిత్ర చెబుతున్న మాట. తెలుగునాట ఎన్టీ రామారావు పదవివిచ్యుతుడు కావడానికి ఇదే ప్రధాన కారణం. నేను చెప్పినదే రైట్, నా ఆలోచనే కరెక్ట్, నేను చేసిందే వేదం అనే మాటల నుంచే తిరుగుబాటు పుట్టకొస్తోంది. నాడు సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఎన్టీఆర్ లో ఈరకమైన తెగువ ఎక్కువ. అందుకే ఆయనకు రెండుసార్లు పదవి గండం ఎదురైంది. రెండోసారి మాత్రం ఆయన సొంత కుటుంబమే ఆయన నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా మహారాష్ట్రలో సంక్షోభం కూడా అధినేత ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటుకు ఇదే కారణం. అయితే ఈ సంక్షోభం వెనుక బీజేపీ పాత్ర ఉండివచ్చు కానీ..అందుకు ముమ్మాటికీ ఉద్దవ్ ఠాక్రే వ్యవహార శైలే కారణం. దేశంలో మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మహారాష్ట్ర రాజకీయాలు వేరు. బాల్ ఠాక్రే శివసేన ఏర్పాటుచేశారు. ప్రత్యేక సైద్ధాంతికతను లైన్ గా తీసుకొని రాజకీయాలు నడిపారు. హిందుత్వమే ప్రధాన అజెండాగా ముందుకు సాగారు. రాజకీయ పునాది వేసుకొని సుదీర్ఘ కాలం మనగలిగారు. ఎన్ని రాజకీయ అటుపోట్లు ఎదురైనా మొక్కవోని దీక్షతో ముందుకు కదిలారు. సుదీర్ఘ కాలం బీజేపీతో సహజీవనం చేశారు. రెండు పార్టీల అజెండా హిందుత్వమే కావడంతో వారి ప్రయాణం కూడా కొనసాగింది. అయితే ఈ ప్రయాణంలో బాల్ ఠాక్రే ఎప్పడూ అధికారం కోసం అర్రులు చాచలేదు. తెరవెనుక పాత్రకే పరిమితమయ్యారు.

అధికార పీఠం కోసం..
అయితే గత ఎన్నికల్లో మహారాష్ట్రంలో హంగ్ వచ్చింది. కీలకమైన స్థితిలో శివసేన నిలిచింది. కానీ ఎన్నడూ లేని విధంగా అధికార పీఠం కోసం ఉద్దవ్ పట్టుబట్టారు. బీజేపీతో విభేదించి.. కాంగ్రెస్, ఎన్సీపీ గూటికి చేరారు. మహాకూటమి అభ్యర్థిగా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, నాయకులకు ఇది మింగుడుపడలేదు. సైద్ధాంతికంగా విభేదాలుండి.. సుదీర్ఘకాలం పోరాడిన కాంగ్రెస్, ఎన్సీపీతో కలవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నాటి బాల్ ఠాక్రే విధానాలకు అడ్డంగా ఉద్దవ్ వెళుతుండడాన్ని ఎదురుచెప్పలేకపోయారు. కానీ కాలం మారింది. పార్టీ అధినేత తీరుపై నేతలంతా ఒక్కటయ్యారు. దీనికి కేంద్ర పెద్దల ఆజ్యం తోడైంది. అయితే తమను విభేదించిన వారి విషయంలో బీజేపీ ఎంతవరకైనా పోతుంది. అందుకే ఏక్ నాథ్ షిండే రూపంలో అరుదైన అవకాశం చిక్కింది. ఫలితంగా ఉద్దవ్ ఠాక్రేను ఒంటరి చేయగలిగింది. రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నాన్నుడిని ఉద్దవ్ ఠాక్రే నిజం చేశారు. అది ఆయన స్వయం క్రుతమే.
నాడు కాంగ్రెస్ లాగే..

అయితే బలమైన ప్రాంతీయ పార్టీలు తుంచాలన్న ప్రయత్నం ఇప్పటిది కాదు. సుదీర్ఘ కాలం దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ తన నీడలో ప్రాంతీయ పార్టీలను బతకనిచ్చేది కాదు. సామ, వేద, దండోపాయాలను ప్రయోగించి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించేది. కాంగ్రెస్ ప్రయోగాల ముందు చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని తట్టుకొని నిలబడ్డాయి, ఏపీలో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ నుంచి గట్టి దెబ్బే ఎదురైంది. 1983 టీడీపీ ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. ఎన్టీఆర్ చరిష్మ ముందు ఇందిరాగాంధీ సైతం నిలబడలేకపోయారు. అయితే ఇక్కడే కాంగ్రెస్ తన మార్కు రాజకీయం చూపించింది. నాదేండ్ల భాస్కరరావు రూపంలో తిరుగుబావుటా ఎగుర వేయించింది. నాడు ఎన్టీఆర్ మొండి మనిషి కాబట్టి.. ఢిల్లీ పెద్దలు ఢీకొట్టగలిగారు. మళ్లీ పార్టీని హస్తగతం చేసుకోగలిగారు. తరువాత చంద్రబాబు రూపంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి టీడీపీని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. కానీ సఫలం కాలేదు. నాడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతికి పార్టీ వస్తే.. తమ హస్తగతమవుతుందని కాంగ్రెస్ పెద్దలు భావించారు. కానీ వారు అనుకున్నది ఒకటి.. అయినది ఒకటిగా జరిగింది. చంద్రబాబు తన రాజకీయ చతురతతో టీడీపీని సుస్థిరమైన స్థానంలో ఉంచగలిగారు. అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమి కట్టి దానికి సారధ్యం వహించగలిగారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాలనే నేడు మోదీ అమలు చేస్తున్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రాబల్యమున్న చోట రాజకీయ అనిశ్చితిని స్రుష్టించి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగునాట కూడా బీజేపీ ఇదే విధానాలతో ముందుకు సాగుతోంది.
జాగ్రత్తపడుతున్న అధినేతలు..
ప్రాంతీయ పార్టీలో నంబర్ 2 అన్న స్థానం లేకుండా అధినేతలు జాగ్రత్త పడుతున్నారు. ఏ రాష్ట్రం తీసుకోండి.. ఏ పార్టీ తీసుకోండి.. పార్టీలో నంబరు 2లతోనే అధినేతలకు ముప్పు ఏర్పడింది. నాడు తెలుగునాట ఎన్టీ రామారావు తరువాత నంబరు 2 స్థానంలో చాంతాడంత జాబితానే ఉండేది. తొలి నాళ్లలో నాదేండ్ల భాస్కరావు నంబరు 2 గా ఉండేవారు. తరువాత ఆయనతోనే ఎన్టీఆర్ ప్రభుత్వానికి గండం వచ్చింది. అటు తరువాత చంద్రబాబు పార్టీ కేడర్ ను తన వైపు తిప్పుకొని నెంబరు 2 స్థానాన్ని పొందారు. ఏకంగా ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను పరేడ్ నిర్వహించి మరీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇప్పడు ఉద్దవ్ ఠాక్రే విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. నంబరు 2 గా ఉన్న ఏక్ నాథ్ షిండే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తప్ప మిగతా వారిని తన వెంట తీసుకెళ్లిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే నంబరు 2 పదవి, గుర్తింపు అనేది నాయకుడికి ఒక్కోసారి ప్రతికూలతను చూపుతోంది. టీఆర్ఎస్ లో సుదీర్ఘ కాలం పనిచేసిన ఈటెల రాజేందర్ విషయంలో కూడా కేసీఆర్ దారుణంగా వ్యవహరించారు. పొమ్మన లేక పొగపెట్టారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టంలోనూ, సుఖంలోనూ పాలుపంచుకున్న రాజేందర్ నిష్క్రమణ వెనుక అంతర్గత రాజకీయాలే కారణం. మొన్నటి ఎన్నికల వరకూ రాజేందర్ టీఆర్ఎస్ లో నంబరు టూగా ఉండేవారు. అది కేసీఆర్ కుటుంబసభ్యులకు నచ్చకో.. లేకుంటే రాజేందర్ వ్యవహార శైలే కారణమో తెలియదు కానీ ఆయన పార్టీకి దూరమయ్యారు. ఆయన్ను దూరం చేసుకోని ఉప ఎన్నికల్లో కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారు. అయితే ప్రాంతీయ పార్టీల్లో నంబర్ టూలుగా ఎదిగిన వారికి పార్టీలో ఎంత ఆదరణ ఉంటుందో, సమాంతర రాజకీయ కేంద్రంగా ఎదుగుతారో.. అదే స్థాయిలో విపక్షాలతో సంబంధాలు నెరుపుతారన్న అపవాదు కూడా ఉంది. అందుకే ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇటీవల జాగ్రత్త పడుతున్న సందర్భాలున్నాయి.
Also Read: Salman khan- Samantha: సల్మాన్ ఖాన్ కి సమంత లవ్ సింబల్స్.. వీడియో వైరల్ !
[…] […]
[…] […]