
రాజకీయాలు కులాలే ప్రాతిపదికగా మారుతున్నాయి. ఒకరు దళితుల పాట అందుకుంటే మరొకరు దళిత, గిరిజన వర్గాలను తమ వైపు తప్పుకోవాలని చూస్తున్నారు. సీఎం కేసీఆర్ దళితులందరికి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పార్టీల్లో చలనం ప్రారంభమైంది. మొత్తం ఓట్లు దండుకోవడానికి కేసీఆర్ వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎలాగైనా కేసీఆర్ ఆలోచనను మరల్చేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ‘దళిత గిరిజన దండోరా సభ’ పేరిట లక్ష మందితో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు వేల మంది దళితులకు రూ.10 లక్షల చొప్పున ఇచ్చేందుకు రూ.500 కోట్లు సీఎం కేసీఆర్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీల్లో వేడి పుట్టింది. రాష్ర్టంలోని దళితులందరికి ఈ పథకం వర్తింపజేస్తే మిగతా పార్టీల భవిష్యత్ అంధకారమే. అందుకే ప్రభుత్వ నిర్ణయం తప్పని చెప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది. దళితులతోపాటు గిరిజనులకు కూడా దళితబంధు ప్లాన్ అమలు చేయాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు. ఈ పథకం అందరికి ఇవ్వడం సాధ్యం కాదని తెలిసినా అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోందని ఆయన విమర్శిస్తున్నారు..
కేవలం ఓట్లు దండుకోవడానికే అధికార పార్టీ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. పది లేదా ఇరవై మందికి రూ.10 లక్షలు ఇచ్చి మిగతా వారికి ఇస్తామని చెప్పి మోసం చేస్తారని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. దీంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు తమ నియోజకవర్గంలో అమలు చేస్తే ఇక రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెబుతామని చెప్పారని గుర్తు చేశారు. దీనిపై ప్రభుత్వ వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. పథకం అమలు ప్లాన్ వివరించాలని ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న దళిత, గిరిజనుల జనాభా లెక్కలు చెప్పి వారికి ఏ విధంగా అందజేస్తారో చెప్పాలని కోరనున్నారు. దీంతో అధికార పార్టీ అడ్డదారుల్ని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేసీఆర్ దళితులకు ఎంత మేర ఇస్తున్నారో ఎంత ఇస్తున్నారో స్పష్టం చేయాలని చెబుతున్నారు. దళిత బంధు ఇప్పటికి కాదని వచ్చే ఎన్నికల వరకు కొనసాగించాలని సూచిస్తున్నారు. అప్పుడైతేనే స్పష్టత వస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా దళిత గిరిజన దండోరా సభలను అన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏదో ఒక ప్రాంతంలో జరిగే సభకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం హాజరు కానున్నారని వెల్లడించారు. దీంతో అధికార పార్టీ టీఆర్ఎస్ ఆగడాలకు కల్లెం వేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఓట్ల కోసం ప్రజలను వర్గాలుగా విడగొట్టి కేసీఆర్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండి పడుతున్నారు.