Daggubati Purandeswari: పురందేశ్వరి టీం రెడీ.. టిడిపికి మరీ అంత దగ్గరగా ఉందా?

నూతన కార్యవర్గంలో పురందేశ్వరి తన మార్కును ప్రదర్శించారు. ఇప్పటివరకు ఉన్న నలుగురు ప్రధాన కార్యదర్శులను మార్చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపన చౌదరిలను నియమించారు.

Written By: Dharma, Updated On : August 19, 2023 10:51 am

Daggubati Purandeswari

Follow us on

Daggubati Purandeswari: ఏపీ బీజేపీ టీమ్ సిద్ధమైంది. 30 మందితో కూడిన జంబో కమిటీని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటించారు. వివిధ పార్టీల నుంచి చేరిన వారితో పాటు పాత బిజెపి నాయకులకు కొత్త కార్యవర్గంలో చోటు దక్కింది. అన్ని సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ మోర్చా కమిటీల నియామకం చేపట్టారు. కొత్త కార్యవర్గంపై బిజెపిలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

నూతన కార్యవర్గంలో పురందేశ్వరి తన మార్కును ప్రదర్శించారు. ఇప్పటివరకు ఉన్న నలుగురు ప్రధాన కార్యదర్శులను మార్చేసి కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ప్రధాన కార్యదర్శిగా విశ్వనాథరాజు, బిట్రా శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపన చౌదరిలను నియమించారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరితో పాటు ఆదినారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజు, చందు సాంబశివరావు వంటి సీనియర్ నేతలకు ఉపాధ్యక్షుల పదవులు ఇచ్చారు. పది మందిని కార్యదర్శులుగా నియమించారు. పార్టీలో అన్ని రకాల మోర్చాలకు కార్యవర్గాలను నియమించారు.

ఎన్నికల టీం కావడంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి బిజెపిలో జనంలో పలుకుబడి ఉన్న నేతలు తక్కువే అయినా.. వర్గ పోరాటానికి మాత్రం కొదువ ఉండదు. అయితే తాజాగా పురందేశ్వరి ఏర్పాటు చేసుకున్న ఈ టీం పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇది టిడిపికి దగ్గరగా ఉన్న టీం అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వెల్లు
వెత్తుతున్నాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తు పెట్టుకోవాలని బిజెపి భావిస్తోంది. మొన్నటివరకు టిడిపితో పొత్తునకు అడ్డంగా నిలిచారన్న కారణంతో సోము వీర్రాజును పక్కకు తప్పించారు. ఇప్పుడు ఆయన ముద్ర లేకుండా కొత్త టీం ను ఏర్పాటు చేసుకున్నారని బిజెపి వర్గాల నుంచి ఒక మాట వినిపిస్తోంది.

అయితే మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుకు పార్టీలోనే సహాయ నిరాకరణ ఎదురైంది. ఆయనపై వైసీపీ ముద్ర వేయడంలో కొంతమంది నేతలు సక్సెస్ అయ్యారు. ప్రధానంగా గత ఎన్నికల్లో తర్వాత టిడిపి నుంచి బిజెపిలో చేరిన నేతల నుంచి సోము వీర్రాజు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. సోము వీర్రాజు స్వేచ్ఛగా పార్టీ బలోపేతానికి పనిచేసినా ఆయనపై లేనిపోని ఫిర్యాదులతో పలుచన చేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆయన వైసీపీకి అనుకూలమని.. అందుకే టిడిపి తో పొత్తునకు వ్యతిరేకిస్తున్నారని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో వచ్చిన పురందేశ్వరి సైతం అదే అపవాదు వచ్చే అవకాశం ఉంది. ఆమె టిడిపికి అనుకూలమన్న ప్రచారం ఊపందుకుంటోంది.