ప్రజలను భయపెడుతున్న కరోనా వైరస్ కరెన్సీ నోట్ల ద్వారా వ్యాప్తి చెందుతోందా అన్న ప్రశ్నకు, అవుననే అంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు ఇటువంటి అనుమానాలు లేకపోయినా తాజాగా గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో గుర్తించిన రెండు కేసుల పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఈ నిర్థారణకు వచ్చినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ ఎక్కువగా చేతుల్లోనే తిష్టవేసి ఉంటుంది. ఎందుకంటే దైనందిన జీవితంలో కంప్యూటర్‌ను ఆన్ చేయడం నుంచి బాత్‌రూంకు వెళ్లేటప్పుడు తలుపులు తీయడం, లిఫ్ట్ ఎక్కిదిగినప్పుడు డోర్ల ఆపరేషన్, స్విచ్ఛ్‌లు ఆన్ చేయడం అన్నీ చేతులతోనే చేస్తుంటారు. దీనివల్ల ఒకరి చేతిలోని వైరస్ మరొకరి చేతిలోకి విస్తరించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని, శానిటైజర్లతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం క్రయవిక్రయాలు, చెల్లింపుల సందర్భంగా ఇచ్చే నోట్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులు గుర్తించారు. గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఆర్‌ఎంపీ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయునికి ఈ విధంగానే కరోనా సోకిందని తేల్చారు. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు వీలైనంత వరకు డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. గతంలో నోట్ల రద్దు సమయంలో డిజిటల్ చెల్లింపులపై దృష్టి సారించింది. క్రమంగా మార్కెట్లో నగదు చలామణి పెరిగిన అనంతరం డిజిటల్ పేమెంట్ల వినియోగం కోట తగ్గింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో డిజిటల్ పేమెంట్ వినియోగం ఎక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ దిశగా ప్రజలను మరింత ప్రోత్సహించాల్సి ఉందంటున్నారు.