Rahul Gandhi: కమిట్ మెంట్ తో పనిచేస్తే ఏదైనా సాధ్యమే. అనుకున్న లక్ష్యానికి చేరువవుతాము. అంచనాలకు మించి సక్సెస్ సాధిస్తాం. కష్టాలకు దూరంగా వెళ్లిపోతే అవి వెంటాడతాయే తప్ప వాటికి ఫుల్ స్టాప్ పడదు. అదే ఎదురితిరిగి పోరాడితే మాత్రం ఒక్కో సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ యువ నాయకుడు రాహుల్ గాంధీ అదే పంథాను అనుసరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రంలో అధికారం పేకమేడలా కూలిపోతున్నా ఆందోళన చెందడం లేదు. సీనియర్ నేతలు ఒక్కొక్కరూ బయటకు వెళుతూ గాంధీ కుటుంబాన్ని కార్నర్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీని నిలబెట్టే ప్రయత్నంలో భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని కన్యాకుమారిలో సెప్టెంబరు 7న యాత్ర ప్రారంభించిన ఆయన 26 రోజుల పాటు పాదయాత్ర పూర్తి చేశారు. ప్రజలను పలుకరిస్తూ ముందుకు సాగుతున్నారు.

ప్రస్తుతం రాహుల్ జోడో యాత్ర కర్నాటకలో సాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో ఇక్కడ యాత్ర సుదీర్ఘ కాలం సాగేలా ప్రణాళిక రూపొందించారు. దాదాపు మూడు వారాలపాటు సాగే యాత్రలో రాహుల్ 511 కిలోమీటర్లు నడవనున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలంగా ఉన్నది కర్నాటకలోనే. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో జోడో యాత్ర కాంగ్రెస్ విజయానికి ఎంతగానో ఉపకరిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు రాహుల్ యాత్రకు జనాలు స్వచ్ఛందంగా వస్తుండడంతో మరింత ఊపు తేవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఏఐసీసీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ కర్నాటకలో రాహుల్ తో అడుగులు వేయనున్నారు. పాదయాత్రలో పాలుపంచుకోనున్నారు.
Also Read: Good News From AP Govt: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 62 లక్షలమందికి ఇక డబ్బు!
నాలుగు రోజుల కిందట కేరళ సరిహద్దుకు ఆనించి ఉన్న చమరనగర జిల్లాలో రాహుల్ జోడో యాత్ర కర్నాటకలో అడుగు పెట్టింది. అయితే అప్పటి నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. కానీ ఎక్కడా రాహుల్ వెనక్కి తగ్గలేదు. వర్షం హోరులోనూ అదే జోరు కొనసాగించారు. అయితే కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంచనాలకు తగ్గట్టుగానే భారీగా జనాలు తరలివస్తున్నారు. రాహుల్ తో పాటు అడుగులు వేస్తున్నారు. సోమవారం రాత్రి మైసూర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేశారు. అయితే రాహుల్ యాత్ర మైసూరుకు సమీపిస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. అయితే సభ జరుగుతుందా? లేదా? అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కంగారుపడ్డారు. అయితే కొద్దిసేపటికే వర్షం తెరిపినిచ్చింది. సభను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. అటు భారీగా తరలివచ్చిన జనాలు ఆసక్తిగా తిలకించారు. మళ్లీ వర్షం ప్రారంభమైంది. కానీ రాహుల్ మాత్రం తన ప్రసంగం ముగించలేదు. అటు ప్రజలు కూడా తలపై కుర్చీలు అడ్డంగా పెట్టుకొని మరీ రాహుల్ ప్రసంగాన్ని విన్నారు.

అయితే మైసూరు సభలో రాహుల్ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ లో ఇటువంటి మార్పు, కమిట్ మెంట్ నే తాము ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇదే పంథాను కొనసాగించాలని విన్నవిస్తున్నారు. అటు రాహుల్ ప్రసంగాలతో రాటు దేలుతున్నారు. ప్రజలకు ఆకట్టుకునేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. భారత్ ను ఏకం చేయడానికే తాను కన్యకుమారి నుంచి కశ్మీరు వరకూ యాత్ర చేస్తున్నానని.. తనను ఎవరూ అడ్డుకోలేరని కూడా తేల్చి చెబుతున్నారు. సోదరభావం భారత్ డీఎన్ఏలోనే ఉందని.. కానీ కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. అది తాత్కాలికమేనన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికైతే భారత్ జోడో యాత్ర రాహుల్ ను సరికొత్త ఆవిష్కరణకు ఎంతగానో దోహదం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే దూకుడు, కమిట్ మెంట్ తో కొనసాగితే కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని హార్ట్ కోర్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read:Nandamuri Balakrishna: బ్రేకింగ్: మార్చేయడానికి ఎన్టీఆర్ పేరు కాదు.. జగన్ పై తొడగొట్టిన బాలయ్య బాబు