AP – Telangana : పవన్ అనుమానమే నిజమైంది. ఏపీలో మహిళల అదృశ్యంపై పవన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది పెను దుమారానికి దారితీసింది. పవన్ అనుమానాన్ని నిజం చేస్తూ కేంద్రం స్పష్టమైన వివరాలను వెల్లడించింది. ఏపీలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు ధృవీకరించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం లో ఈ విషయాన్ని వెల్లడించింది.
వాలంటీర్ల వ్యవస్థలో లోపాలపై పవన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసింది. వ్యక్తిగత, గోప్యత సమాచారం వాలంటీర్ల వ్యవస్థ ద్వారా బయటకు వెళ్తోందని పవన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ సర్కార్ ఎదురుదాడినే అస్త్రంగా చేసుకుంది. వాలంటీర్లు,సచివాలయ ఉద్యోగులతో ప్రైవేట్ కేసులు పెట్టించింది. అయితే ఇప్పుడు కేంద్రం వెల్లడించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అయ్యింది.
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ లిఖితపూర్వకంగా తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలో 2019లో 2186 మంది బాలికలు అదృశ్యం అయ్యారు. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిని బాలికల కేటగిరిలో చేరుస్తారు. అలాగే 6252 మంది మహిళలు మిస్ అయ్యారు. 2020లో 2374 మంది బాలికలు, 7057 మంది మహిళల ఆచూకీ లేకుండా పోయింది. 2021 లో మాత్రం ఇలా అదృశ్యమైన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 3358 మంది బాలికలు,8969 మంది మహిళలు కనిపించకుండా పోయారు. ఇలా మొత్తం వీరి సంఖ్య 30,196 మంది. దేశ వ్యాప్తంగా మూడు లక్షల మంది మహిళలు అదృశ్యం అయితే. అందులో ఏపీలో 30 వేల మంది ఉండడం విశేషం.
కేంద్రం వెల్లడించిన తాజా అంశాలతో ఏపీలో రాజకీయ వివాదం ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్యల్లో నిజం ఉందని తేలడంతో ప్రభుత్వంపై ముప్పేట దాడి పెరిగే అవకాశం ఉంది. తాను పూర్తిగా అధ్యయనం చేసేవాలంటీర్లపై కామెంట్స్ చేసినట్లు పవన్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర నిగా వర్గాల హెచ్చరికతోనే మహిళల అదృశ్యంపై తాను మాట్లాడినట్లు పవన్ చెప్పుకొచ్చారు. కానీ పవన్ ను వైసిపి ప్రజాప్రతినిధులు ఎగతాళి చేస్తూ వచ్చారు. కోర్టు కేసులతో ముప్పు తిప్పలు పెడతామని భావించారు. కానీ దానికి చెక్ చెబుతూ కేంద్రం గణాంకాలతో సహా మహిళల అదృశ్యంపై స్పష్టమైన ప్రకటన చేసింది. దీంతో వైసిపి వర్గాల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది.