PM Modi: కాంగ్రెస్ వస్తే ముస్లింలకు సంపద.. మోడీ విద్వేషాలు రెచ్చగొడుతున్నారా?

ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలకు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : April 22, 2024 10:39 am

PM Modi

Follow us on

PM Modi: “కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపద కొందరి చేతుల్లోకి వెళుతుంది.. దానిని మొత్తం మైనారిటీలైన ముస్లింలకు పంచుతుంది. దేశంలో వనరులపై మైనారిటీలకే తొలి హక్కని నాటి కాంగ్రెస్ హయాంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేశారు. వారు అధికారంలోకి వస్తే ప్రజల వద్ద ఉన్న బంగారం తో సహా సంపద మొత్తాన్ని సర్వే చేసి అందరికీ సమానంగా పునః పంపిణీ చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. దాని ప్రకారం దేశ సంపద మొత్తం చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంపిణీ చేస్తారు. మీ ఆస్తులను తనిఖీ చేసే అధికారం వారికి ఎక్కడిది? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ నాయకులు.. మహిళల మంగళసూత్రాలు కూడా వదిలిపెట్టరు.. మీ కష్టార్జితం వారికి దక్కడం మీకు సమ్మతమేనా” ఇవీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాజస్థాన్ లోని జలౌర్, భీన్ మాల్, బాంస్ వాడా ప్రాంతాలలో నరేంద్ర మోడీ పర్యటించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొన్నారు. గతానికంటే భిన్నంగా ఈసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా పోటీ చేసే దమ్ము లేక.. ఇతర పార్టీలను సీట్లు అడుక్కుంటున్నదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు.. ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై కూడా నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. “సొంత నియోజకవర్గంలో గెలిచే పరిస్థితి లేదు. అందువల్లే రాష్ట్రాలు మొత్తం వదిలిపెట్టి రాజస్థాన్ వచ్చి.. రాజ్యసభ ద్వారా పార్లమెంట్లోకి ప్రవేశించారు. ఇలాంటివారు ఎన్నికల గురించి, విలువల గురించి, ఇతర వాటి గురించి చెబుతుంటారు. అవన్నీ మనం వినాలా? మనకు వారి మాటలు అవసరమా” అంటూ నరేంద్ర మోడీ సోనియాగాంధీని ఉద్దేశించి పరోక్షంగా ఆరోపణలు చేశారు.

ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఎన్నికలవేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ప్రజల మధ్య వైషమ్యాలకు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు. “ఒక ప్రధానమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దేశ ప్రజలను వారి మతాల ఆధారంగా విడగొడతారా? ఇలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా పనికిరాడు? అబద్దాలతో, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశ చరిత్రలో నరేంద్ర మోడీ స్థాయిలో ప్రధానమంత్రి పదవి ప్రతిష్టను దిగజార్చలేదు. అధికారం కోసం అబద్ధాలు చెబుతున్నారు. ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా మేనిఫెస్టో ప్రతి భారతీయుడి సమానత్వం కోరుకుంటుంది. ప్రధానమంత్రి ప్రచారం మరో విధంగా ఉంది. ఎన్నికల్లో గోబెల్స్ లాంటి నరేంద్ర మోడీ నియంత కుర్చీ కదులుతుందని” కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

అయితే ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది మేధావులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మతం ఆధారంగా దేశ ప్రజలను విభజించడం ఎంతవరకు సరైందని మండిపడుతున్నారు. దేశ సంపదను ఒక వర్గం వారికి పంచి పెడితే, మిగతావారు చూస్తూ ఊరుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ నాయకులు సమర్థిస్తున్నారు. ముస్లిం మహిళల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రిబుల్ తలాక్ ను నరేంద్ర మోడీ రద్దు చేశారని, సీమాంతర ఉగ్రవాదాన్ని కట్టడి చేశారని.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు అటు మీడియా నుంచి సోషల్ మీడియా వరకు చర్చకు దారితీస్తున్నాయి.