BRS Kokapet Land: రాష్ట్ర మొత్తం భూముల ధరలు విపరితంగా పెరుగుతున్నాయి. మారుమూల గ్రామంలో కూడా ఎకరం 30 లక్షలు పలుకుతున్నది. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల ధరలను పలకరించాలంటే చేతిలో కోట్లు ఉండాలి.. ఇక హైదరాబాద్ కోకాపేట శివారు ప్రాంతాల్లో అయితే వందల కోట్ల పై మాటే. ఇలాంటి చోట చదరపు గజం 7,500 కు మాత్రమే లభిస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందా? అని తాపీ గా అడుగుతారేంటి మాస్టారూ? వెంటనే ఎగిరి గంతేసి కొనేస్తాం అంటారా! ఆగండి ఆగండి…ఆ ధర మీకు కాదు. మీకు ఆ ధరకు ఎవరూ అమ్మరు. మరి ఎవరికి అమ్ముతారు అనే ప్రశ్న వేయకండి. దానికంటే ముందు ఈ భూ మంతర్ కథనాన్ని చదవండి. మీకు ఒక అవగాహన వస్తుంది.
500 కోట్ల స్థలం 40 కోట్లకే
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ స్కీం పడకేసింది. దళితులకు మూడు ఎకరాలు ఇస్తామనే హామీ గాలిలో కలిసిపోయింది. గురుకుల పాఠశాలలకు సొంత భవనాలు లేక అద్దె భవంతుల్లో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇలాంటి స్థితిలో ఈ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది? ప్రభుత్వ స్థలాల్లో ఆయా భవంతులను నిర్మించి అద్దె చెల్లింపు ద్వారా తన మీద పడుతున్న ఆర్థిక భారాన్ని తొలగించుకుంటుంది.. కానీ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి రూట్ వేరు కదా. దర్జాగా తాను చేయాల్సిన పనిని పక్కనపెట్టి, తనకు అవసరమొచ్చే పనిని తలకు ఎత్తుకుంది. ఏకంగా 500 కోట్లకు పైచిలుకు విలువైన భూమిని కొట్టేసింది.. వాస్తవానికి ప్రభుత్వం నిర్మించిన కొత్త సచివాలయంలో ప్రజలకు ఉపయోగపడే వాటికంటే భారత రాష్ట్ర సమితికి ఉపయోగపడే పనులకే పెద్ద పీట వేస్తున్నారు. ఆ దిశగానే సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్వామి కార్యం, స్వకార్యం పూర్తయ్యే లాగా పావులు కదుపుతున్నారు.. ఇందులో భాగంగానే హైదరాబాదులోని అత్యంత విలువైన కోకాపేటలో ఇనిస్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్, డెవలప్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకంగా పదకొండు ఎకరాల భూమిని తమ పార్టీకి కేటాయించుకున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతున్నది.
రాజశేఖర్ రెడ్డి హయాంలో
తెలంగాణ రాష్ట్ర సంకి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారిన కేసీఆర్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన బంజరా హిల్స్ లో భూమిని కేటాయించారు. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం ఆ భవనంలోనే నిర్మించారు. అధికార పార్టీ డప్పు టీ న్యూస్ ఛానెల్ కూడా ఆ కార్యాలయం కేంద్రంగానే ప్రసారాలు సాగిస్తున్నది. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం 33 జిల్లాల్లోని తమ పార్టీ కార్యాలయాలకు అగ్గువ ధరకే భూములు కేటాయించుకుంది. యుద్ధ ప్రాతిపదికన కార్యాలయాలు కూడా నిర్మించింది. ఇప్పుడు తాజాగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటూ కోకాపేటలో అత్యంత విలువైన 11 ఎకరాల భూమిని తీసుకున్నది. అది కూడా అక్కడ మార్కెట్ విలువ చదరపు గజం లక్షన్నర వరకు ఉంటే.. కేవలం చదరపు గజం 7500 మాత్రమే చెల్లించేలా ప్రభుత్వం భారత రాష్ట్ర సమితి కట్టబెట్టింది. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని గండిపేట మండలం కోకా పేట గ్రామంలోని 239, 240 సర్వే నెంబర్లలో భారత రాష్ట్ర సమితికి 11 ఎకరాల భూమిని కేటాయించింది. అంటే ఈ లెక్కన భారత రాష్ట్ర సమితి 40 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది.
వాస్తవానికి హెచ్ఎండిఏ నిర్ణయించిన ధర ప్రకారం ఇక్కడ చదరపు గజం విలువ లక్షా పదివేలు ఉంది. అంటే భారత రాష్ట్ర సమితికి కేటాయించిన 11 ఎకరాల భూమి విలువ 500 కోట్ల దాకా ఉంటుంది. ఇక బహిరంగ మార్కెట్లో అయితే ఇక్కడ ఎకరా 100 కోట్ల దాకా పలుకుతుందని మార్కెట్ వర్గాల్లో చెబుతున్నాయి..అయితే ఈ భూ కేటాయింపులపై ప్రతిపక్షాలు పెడుతున్నప్పటికీ అధికార పార్టీ పట్టించుకోవడం లేదు. ఇక ఈ స్థలం కోసం దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే భారత రాష్ట్ర సమితికి ప్రభుత్వం భూమిని కేటాయించింది. సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు భూమి కోసం భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఈనెల 12 న ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇది చేసుకున్న ఐదు రోజుల్లోనే ఫ్రంట్ ఈనెల 18న కొత్త సచివాలయం లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం తెలిపారు. అయితే దరఖాస్తులో కామ నిర్మించబోయే భవనంలో రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలకు వ్యక్తిత్వ వికాస నైపుణ్యం, వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో కాన్ఫరెన్స్ హాల్, లైబ్రరీ ఏర్పాటు చేస్తామని, ఇక్కడ శిక్షణ పొందే వారికి, పని చేసే సిబ్బందికి సదుపాయాలు కల్పిస్తామన్నారు. అయితే ఇటువంటి శిక్షణ ఇచ్చే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులు హైదరాబాద్లో చాలానే ఉన్నాయని, ఎంసి హెచ్ఆర్డి కూడా ఉందని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. అయితే ఈ భూ కేటాయింపునకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కేవలం సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ సాకును మాత్రమే పేర్కొనడం విశేషం. అయితే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం పేరిట బోయిన్ పల్లి లో 10 ఎకరాల 15 గుంటల స్థలాన్ని కేటాయించుకుందని అందులో పేర్కొన్నారు. ఎకరానికి రెండు లక్షల చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం తన పార్టీకి కేటాయించుకుందని గుర్తు చేశారు. దాన్ని సాకుగా చూపి 500 కోట్ల విలువైన స్థలాన్ని 40 కోట్లకే కొట్టేశారు. ఇక 18న మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత అన్ని విషయాలు చెప్పిన మంత్రి హరీష్ రావు.. ఈ భూమి కేటాయింపు గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.