నాగార్జున సాగర్‌లో ఎలాగైనా పాగా కాంగ్రెస్ చేయాల్సిన ప్రయత్నాలన్నింటినీ చేస్తోంది. ఇంతో అంతో బలమున్న ఆ నియోజకవర్గంలో ఓ సీటును కైవసం చేసుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈ మేరకు జానారెడ్డి ఆ దిశగా తన కృషి సాగిస్తున్నారు. ఇందులోభాగంగా సాగర్‌లో కమ్యూనిస్టుల మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అభ్యర్థిగా ఎప్పుడో ఖరారైన జానారెడ్డి గ్రామాలన్నీ చుట్టేస్తున్నారు. దశాబ్దాలుగా అనుబంధం ఉన్న నియోజకవర్గం కావడంతో ఆయనకు గ్రామగ్రామాన పరిచయాలు బాగానే ఉన్నాయి.
అయినా కూడా.. ఏ చిన్న అవకాశం కూడా వదిలి పెట్టకూడదనుకుంటున్నారు. అందుకే.. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కమ్యూనిస్టుల మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీలకు బలం ఉంది. విధేయంగా ఉండే క్యాడర్ ఉన్నారు. నాగార్జునసాగర్‌లోనూ వారికి బలం ఉంది. రెండు పార్టీల సానుభూతిపరులు వేలల్లోనే ఉంటారని అంచనా. ఉపఎన్నికల్లో సీపీఎంతోపాటు సీపీఐ కూడా పోటీ చేయడం లేదు.
దీంతో ఆ పార్టీ క్యాడర్ మద్దతు తమకు లభించేలా చేసుకోవడానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ చీఫ్ భట్టి విక్రమార్క ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ అంశంపై కమ్యూనిస్టు పార్టీలు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఉపఎన్నికల్లోనూ కమ్యూనిస్టు పార్టీలు అభ్యర్థిని పెట్టలేదు. నాగార్జునసాగర్ ఎన్నికల్లో ఏపార్టీకి ఇతర పార్టీల మద్దతు లభించడం లేదు.
ఇదిలా ఉండగా.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కూడా బీజేపీతో జతకట్టలేదు. బాహాటంగానే బీజేపీని కాదని టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. టీడీపీ కూడా సొంతంగా పోటీ చేస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే.. ఆ పార్టీకే కాస్త అదనపు బలం లభించినట్లవుతుంది. అందుకే కమ్యూనిస్టు పార్టీల నిర్ణయంపై ఆసక్తి ఏర్పడింది. ఎలా అయినా.. కాంగ్రెస్ గెలిచి తీరాలనే ఆ పార్టీ నేతలు కామ్రేడ్ల మద్దతు కూడగట్టేందుఉక అన్ని విధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. కలిసివచ్చే ఏ ఓటు బ్యాంకునూ వదులుకోవద్దని భావిస్తున్నారు. మరి చివరికి కామ్రేడ్ల మద్దతు ఏ పార్టీకి లభిస్తుందో చూడాలి.