Bigg Boss, CPI Narayana : రాజకీయాల్లో కొందరు నేతలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వాళ్లు వార్తల్లో నిలిచేదే ఆ ప్రవర్తనతో. అలాంటి వారిలో కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సీపీఐ నారాయణ కూడా ఉంటారు. అప్పుడెప్పుడో గాంధీ జయంతి వేళ చికెన్ తిని వార్తల్లో వ్యక్తి అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఉద్యమాల కన్నా.. ఇలాంటి చర్యలు, వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా.. ఆయన బిగ్ బాస్ షోపై ఒంటికాలిపై లేచారు. సమాజంలో విష సంస్కృతిని నింపుతోందంటూ మాట్లాడేశారు. దీంతో.. మరోసారి ఆయన వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే.. బిగ్ బాస్ పై వ్యాఖ్యలే కాకుండా.. తన ప్రవర్తనతో జనాల ఆలోచనకూ పనిపెట్టారు.
సహజంగా కమ్యూనిస్టులు భావ వాదాన్ని నమ్మరు. భౌతిక వాదాన్నే విశ్వసిస్తారు. అంటే.. దేవుళ్లు, దెయ్యాలు వగైరా అంశాలు ఊహాజనితమైనవని భావిస్తూ.. వాటిని అంగీకరించరు. ఆధారం ఉన్నదాన్నే నమ్ముతారు. కానీ.. ఓసారి నారాయణ తిరుపతి కొండెక్కారు. ఇదేంటి మీరిక్కడ? అని అడిగితే.. కుటుంబం కోసం వచ్చాను అన్నారు. మొన్న లాక్ డౌన్ లో దేవతలకు మద్దతుగా నిలిచారు. అన్నీ తెరిచినప్పుడు గుళ్లు గోపురాలు ఎందుకు తెరవొద్దు అని ప్రశ్నించారు. ఓ గుడి దగ్గరకు వెళ్లి తెరవాలని డిమాండ్ కూడా చేశారు. ఓసారి యోగాడేలో మోడీ ఆసనాలు వేస్తే.. ఈయన కూడా విన్యాసాలు చేశారనే విమర్శలు వచ్చాయి. కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసమంటూ మోడీ దీపాలు వెలిగించమంటే.. నారాయణ లైట్లు వెలిగించారు. ఈ విధంగా.. తనదైన ప్రవర్తనతో వార్తల్లోనిలిచే నారాయణ.. ఇప్పుడు బిగ్ బాస్ పై అంతెత్తున లేస్తున్నారు.
ఈ షో సమాజంలో విష సంస్కృతిని నింపుతోందని, అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఎలా అనుమతిస్తున్నాయని అన్నారు. గతేడాది కూడా ఇదే తరహా కామెంట్ చేశారు నారాయణ. ఓ కంటిస్టెంట్ కు ముగ్గురు అమ్మాయిల ఫొటోలను చూపించిన హోస్టు నాగార్జున.. వీరిని ఏం చేస్తావని అడిగితే.. ఒకరిని ముద్దు పెట్టుకుంటా, మరొకరితో డేటింగ్ చేస్తా, ఇంకొకరిని పెళ్లి చేసుకుంటా అన్నాడు కంటిస్టెంట్. దీంతో.. నారాయణ అగ్గిమీద గుగ్గిళం అయిపోయారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడుతూ.. ఇదొక అనైతిక చర్య అని, దీన్ని తాము ఖండఖండాలుగా ఖండిస్తున్నట్టు చెప్పేశారు. ఇప్పుడు మళ్లీ ఇదే షోపై పడిపోయారు. ఈ షో ద్వారా ఏం చెప్పాలని చూస్తున్నారంటూ ఉడికి పోయారు.
సహజంగా.. దేశ సంస్కృతి, సంప్రదాయం అనే మాటలు బీజేపీ వాళ్లు వల్లె వేస్తుంటారు. మరి, ఈ నారాయణ పార్టీ ఆ భావజాలానికి పూర్తి విరుద్ధం. మరి, ఇప్పుడు ఈయన సంస్కృతి మంట గలిసిపోతోందని మొత్తుకోవడంలో ఆంతర్యమేంటీ అని చర్చించుకుంటున్నారు జనం. పరోక్షంగా ఈయన కాషాయ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నారా? అని సెటైర్లు కూడా పడుతున్నాయి. దేశంలో మాట్లాడడానికి ఎన్నో సమస్యలు ఉండగా.. ఈ బిగ్ బాస్ పై ఆయాస పడాల్సిన అవసరమేంటీ? అంటున్నారు మరికొందరు. మరీ.. అంతగా ఇబ్బంది అనిపిస్తే.. అసలు చూడడమెందుకు అని కొందరు అంటుండగా.. మొత్తానికి ఏదో వంకతో బిగ్ బాస్ ను కంటిన్యూగా చూసేస్తున్నారా? అని సెటైర్ వేస్తున్నారు ఇంకొందరు. మరి, ఈ భావజాలపు వ్యాఖ్యలపై నారాయణ ఏమంటారో?