
అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రెండు బ్లాకులను అధికారులు సీజ్ చేశారు. అందులో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా పాజిటివ్ రావడంతో రెండు బ్లాకులను మూసివేశారు. ఆ రెండు బ్లాకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
సచివాలయంలోని మొత్తం ఐదు బ్లాకులను శానిటైజ్ చేయనున్నారు. లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఏపీ సచివాలయ ఉద్యోగులను గత నెల 27న ప్రత్యేక బస్సుల్లో అమరావతికి తీసుకువచ్చారు.
అయితే వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన వారిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారు.
ఇలా ఉండగా, ఎపిలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో 105 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎపిలోనే 76 కేసులు రాగా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన మరో 28 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
విదేశాల నుండి వచ్చిన వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది.
మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,118కి చేరిందని తెలిపింది. గడిచిన 24 గంటల్లో ఇద్దరు మృతిచెందడంతో.. మృతుల సంఖ్య 64కు చేరింది. 885 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 2, 169 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.